తాగినమైకంలో కానిస్టేబుల్‌ వీరంగం.. బీర్‌ సీసాతో యువకుడిపై దాడి

22 Mar, 2022 12:43 IST|Sakshi

సాక్షి, జమ్మలమడుగు రూరల్‌ : తాగినమైకంలో ఓ కానిస్టేబుల్‌ వీరంగం సృష్టించాడు. ఓ ప్రైవేట్‌ బార్‌ వద్ద బీర్‌ సీసాతో యువకుడి తలపై కొట్టాడు.దీంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.జమ్మలమడుగు ఎస్‌ఐ తీమోతి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మైలవరం మండలం దొడియం గ్రామానికి చెందిన దళిత యువకుడు నడిపి చెన్నయ్య ఆటో నడిపేవాడు. ఈ క్రమంలో సోమవారం జమ్మలమడుగులోని ఓ ప్రైవేట్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ వద్ద మరో వ్యక్తి కోసం వేచి ఉన్నాడు. అదే సమయంలోబార్‌ వద్ద మద్యం సేవిస్తు ఉన్న గంగాధర్‌ బాబు అనే కానిస్టేబుల్‌ యువకుడిని నీది ఏ ఊరు అని ప్రశ్నించాడు.

మాది దొడియం అని చెప్పగానే అక్కడి నాయకుల గురించి ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన గంగాధర్‌ బాబు బీర్‌ సీసా తీసుకొని చెన్నయ్య తలపై కొట్టాడు. దీంతో అతని తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రొద్దుటూరుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం చెన్నయ్య చికిత్స పోందుతున్నాడు. కాగా కానిస్టేబుల్‌ గంగాధర్‌ బాబు ఏడాది కాలంగా తలమంచిపట్నం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.

మరిన్ని వార్తలు