ఏపీలో తగ్గుతున్న పాజిటివిటీ రేటు

16 Aug, 2021 09:33 IST|Sakshi

గడిచిన వారం రోజుల్లో సగటున 2.43 శాతం నమోదు 

10 జిల్లాల్లో 3% కంటే తక్కువే 

ఏ జిల్లాలోనూ అసాధారణంగా కేసులు పెరగలేదు 

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కరోనా మూడో వేవ్‌ వస్తోందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కరోనా నియంత్రణలోనే ఉన్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో 13 జిల్లాలుండగా అందులో 10 జిల్లాల్లో 3 శాతం కంటే తక్కువగా పాజిటివిటీ రేటు ఉన్నట్టు తేలింది. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే 5.74 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. కొన్ని జిల్లాల్లో అయితే ఒకటి కంటే తక్కువకు పాజిటివిటీ రేటు పడిపోయింది. గడిచిన వారం రోజుల్లో అంటే ఈ నెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 4.68 లక్షల టెస్టులు చేయగా, 2.43 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది.

ఇది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువని అధికారులు వెల్లడిస్తున్నారు. పెద్ద జిల్లాల్లో ఒకటైన కర్నూలులో పాజిటివిటీ రేటు కేవలం 0.26 శాతంగా నమోదైంది. ఏ జిల్లాలోనూ అసాధారణంగా పాజిటివ్‌ కేసులు పెరిగిన దాఖలాలు లేవు. గడిచిన కొద్ది వారాలుగా క్రమంగా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తోంది. మాస్కులు విధిగా ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం వంటి మూడు పనులు చేస్తే పూర్తిస్థాయిలో కరోనాను నియంత్రించవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు