కల్తీ, అక్రమ మద్యానికి చెక్‌ 

30 Apr, 2021 04:32 IST|Sakshi

 19 ఫీచర్లతో కొత్త హోలోగ్రామ్‌

త్వరలో ప్రవేశపెట్టనున్న బెవరేజస్‌ కార్పొరేషన్‌

సాక్షి, అమరావతి: కల్తీ మద్యం, మద్యం అక్రమ రవాణాకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం సరికొత్త హోలోగ్రామ్‌ అస్త్రాన్ని ప్రయోగించనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ విభిన్న ఫీచర్లతో కొత్త హోలోగ్రామ్‌ రూపొందించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2011 నుంచి మద్యం సీసాల మీద ముద్రిస్తున్న హోలోగ్రామ్‌ విధానం లోపభూయిష్టంగా ఉండటంతో మద్యం కల్తీ, అక్రమ రవాణాను అరికట్టడం సాధ్యపడటం లేదు. దీంతో దశాబ్దకాలంగా రాష్ట్రంలో మద్యం మాఫియా వ్యవస్థీకృతమైంది. కల్తీ మద్యం తాగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యానికి అడ్డుకట్ట పడటంలేదు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు గండిపడుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా రాష్ట్ర బెవరేజస్‌ కార్పొరేషన్‌ మద్యం సీసాలపై ముద్రించేందుకు.. పాత విధానంలోని లోపాలను సరిదిద్ది 19 ఫీచర్లతో కొత్త హోలోగ్రామ్‌ను రూపొందించింది. అధికారులు తనిఖీల్లో మద్యం సీసాలపై కొత్త హోలోగ్రామ్‌ను పరిశీలించగానే అవి అసలైనవా, కల్తీవా అన్నది సులభంగా గుర్తించవచ్చు. 

కొత్త హోలోగ్రామ్‌లోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లు..
ప్రస్తుతం ఉన్న హోలోగ్రామ్‌ కంటే కొత్తదాన్లో ‘డాట్స్‌ పర్‌ ఇంచ్‌ (డీపీఐ) రెండింతలు పెద్దగా పెట్టారు. పాత హోలోగ్రామ్‌లో డీపీఐ 6 వేలు ఉండగా కొత్తదాంట్లో 12 వేలు ఉంది. ప్రస్తుత హోలోగ్రామ్‌ సైజు 60*15 మిల్లీమీటర్లు ఉండగా కొత్తది 65*15 మిల్లీమీటర్లు ఉంది. కొత్త హోలోగ్రామ్‌లో ట్యాగంట్‌ ఆప్షన్‌ ఉంది. మద్యం సీసాపై ఉన్న హోలోగ్రామ్‌పై రీడర్‌ పెట్టగానే అది ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. మద్యం సీసాను అటూ ఇటూ కదిపితే ఆ హోలోగ్రామ్‌పై ఓ అమ్మాయి బొమ్మ కనిపిస్తుంది. ‘ఓకే’ అనే పదం ఓ వైపునకు ‘టిక్‌ మార్కు’ మరోవైపునకు కదులుతాయి. దీన్లో కొత్తగా ‘టూ చానల్‌ ఎఫెక్ట్‌’ ఉంది. ‘రాస్టర్‌ టెక్ట్స్‌’ ఫీచర్‌ ఉంది. దానిపై కోడర్‌ ఫిల్మ్‌ పెడితే ‘ఎక్సైజ్‌’ అనే పదం కనిపిస్తుంది. కొత్త హోలోగ్రామ్‌పై 10 ఎక్స్‌ లెన్స్‌తో చూస్తేనే కనిపించే సూక్ష్మ అక్షరాలను ముద్రించారు. దీనిపై ‘వర్టికల్‌ స్విచ్‌ ఎఫెక్ట్‌’ పొందుపరిచారు. వీటిని పరిశీలించి ఆ మద్యం సీసా అసలైనదా.. కల్తీదా అనేది నిర్ధారిస్తారు.

కల్తీ మద్యం, మద్యం అక్రమ రవాణా అరికట్టడమే లక్ష్యం
రాష్ట్రంలో మద్యం సీసాలపై 2011 నుంచి ముద్రిస్తున్న హోలోగ్రామ్‌ విధానం లోపాలను సరిదిద్దుతూ కొత్త హోలోగ్రామ్‌ రూపొందించాం. టెక్నాలజీని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని కొత్త భద్రతా ఫీచర్లను పొందుపరిచాం. కల్తీ మద్యం, మద్యం అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా హోలోగ్రామ్‌ను డిజైన్‌ చేశాం. దీన్ని త్వరలోనే ప్రవేశపెడతాం. 
– డి.వాసుదేవరెడ్డి, ఎండీ, రాష్ట్ర బెవరేజస్‌ కార్పొరేషన్‌  

మరిన్ని వార్తలు