పూల సాగు.. గిరిజన రైతులకు వరం

1 Nov, 2021 03:41 IST|Sakshi
చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సాగు చేసిన వివిధ రకాల పూలు

విశాఖ ఏజెన్సీ అనువైన ప్రాంతం 

పది రకాల పూలతో ప్రయోగం

అగ్రి వర్సిటీ వీసీ విష్ణువర్ధన్‌రెడ్డి

సాక్షి, అమరావతి/గుంటూరు రూరల్‌: గిరిజన ప్రాంతాల్లో పూల సాగును చేపట్టేలా వ్యవసాయాధికారులు చర్యలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంత వాతావరణ పరిస్థితులు, భూమి ఇందుకు అనువుగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తున్నారు. సేంద్రియ పద్ధతిన పూలు, కూరగాయల సాగు చేపడితే హార్టీకల్చర్‌ విభాగంతో పాటు.. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇతోధికంగా తోడ్పడుతుందని వీసీ డాక్టర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి ప్రకటించారు.

విశాఖ ఏజెన్సీ రైతులు తరతరాలుగా వరి, మొక్కజొన్న, వేరుశనగ, కంది, రాజ్మా, చిక్కుళ్లు, వలిశలు వంటి ఆహార పంటలను, అల్లం, మిరియాలు, కాఫీ వంటి ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. అధిక వర్షాలతో ఈ పంటలు ఆశించిన ఆదాయాన్ని ఇవ్వలేకపోతుండడంతో కొంతమంది రైతులు చట్ట విరుద్ధమైన పంటల్ని సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పంటలను నిషేధించినా అటువైపే మొగ్గు చూపుతుండటంతో.. రైతులను పూల సాగు వంటి వాణిజ్య పంటల వైపు మరల్చేలా వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యాచరణను తయారు చేసినట్టు విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. 

పూలసాగుతో లంబసింగి, అరకు మరింత ఆకర్షణీయం 
ఇందులో భాగంగా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాన్నే ఓ ప్రయోగ క్షేత్రంగా మార్చాలని, పెద్ద ఎత్తున పూలసాగు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంత వాతావరణం పూల సాగుకు అనువైన స్థలంగా అభివర్ణించారు. రైతులకు ఈ మేరకు అవగాహన కల్పించేలా వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో 5 రకాల గ్లాడియోలస్, 3 రకాల ట్యూబారస్, రెండు రకాల చైనా ఆస్టర్, బంతి, చామంతి, తులిప్‌ వంటి పూల సాగును ప్రయోగాత్మకంగా చేపట్టినట్టు వివరించారు.

ఈ పూల సాగును విజయవంతం చేసి.. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌కు మారుపేరుగా నిలపాలని సూచించారు. పూల తోటల్ని విరివిగా పెంచితే లంబసింగితో పాటు, ఏపీ ఊటీ అయిన అరకు.. పర్యాటకుల్ని మరింత ఆకర్షిస్తాయని అభిప్రాయపడ్డారు. ఏజెన్సీ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు పాలీహౌస్‌ల అవసరం లేకుండానే పూలను సాగు చేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పూల సాగును ఇప్పటికిప్పుడు చేపడితే ఐదేళ్లలో గిరిజన రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. 

పాలిటెక్నిక్‌ విద్యార్థులతో పూల సాగు..
వివిధ రకాల పూలు, కూరగాయల పంటల సాగుపై శిక్షణ పొందుతున్న చింతపల్లి సేంద్రియ పాలిటెక్నిక్‌ విద్యార్థులు ప్రయోగాత్మకంగా ఈ పంటల్ని సాగు చేసేందుకు నడుంకట్టారు. గ్లాడియోలస్, తులిప్, నేల సంపంగి, చైనా ఆస్టర్, బంతి, చేమంతి సాగు చేపట్టారు. వీటితో పాటు సేంద్రియ పద్ధతిన కూరగాయల పెంపకాన్ని కూడా చేపట్టి చదువుతో పాటు రోజు వారీ ఖర్చులకు డబ్బును సమకూర్చుకుంటున్నారని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.రామారావు వివరించారు. 

మరిన్ని వార్తలు