మల్బరీ, పట్టులో ‘ఉమ్మడి అనంత’ పైచేయి

28 Jan, 2023 21:53 IST|Sakshi

రాష్ట్రంలోనే అత్యధికంగా మల్బరీ సాగు శ్రీసత్యసాయి జిల్లాలోనే..

మల్బరీ సాగులో అనంతపురం జిల్లా నాలుగో స్థానం

నాణ్యమైన పట్టుగూళ్లకు పేరుగాంచిన పురం మార్కెట్‌

ఉద్యాన పంటలకు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు రాష్ట్రంలోనే పేరెన్నికగన్నవి. కానీ ఈ రెండు ఇప్పుడు మల్బరీ సాగులోనూ మొదటి వరుసలో నిలిచాయి. శ్రీసత్యసాయి జిల్లాలో ఉత్పత్తయ్యే పట్టు అత్యంత నాణ్యమైనది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే పట్టుకు దేశీయంగా మంచి మార్కెట్‌ ఉంది. రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో మల్బరీ పండించే జిల్లాల్లో శ్రీసత్యసాయి మొదటి స్థానంలో ఉండగా.. అనంతపురం జిల్లా నాలుగో స్థానంలో ఉంది.  అంతర్జాతీయంగానూ ధర్మవరంలో తయారయ్యే పట్టుచీరలకు ఎంత ఖ్యాతి ఉందో అందరికీ తెలిసిందే. 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: మనరాష్ట్రంలో శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిర, హిందూపురం, పుట్టపర్తి, ధర్మవరం ప్రాంతాలతో పాటు అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మల్బరీ సాగు భారీ విస్తీర్ణంలో ఉంది. ఒక్క శ్రీసత్యసాయి జిల్లాలో 26వేల మంది రైతులు 44,487 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నట్టు పట్టుపరిశ్రమ  శాఖ అంచనా. చిత్తూరులో 39,849 ఎకరాల్లోనూ, అన్నమయ్య జిల్లాలో 12,839 ఎకరాల్లోనూ     పండిస్తుండగా, 6,740 ఎకరాల్లో మల్బరీ సాగుచేస్తూ అనంతపురం జిల్లా నాల్గో స్థానంలో నిలిచింది. శ్రీసత్యసాయి జిల్లాలో 26వేల పైచిలుకు మల్బరీ రైతులుండగా, అనంతపురం జిల్లాలో 8,500 మంది ఉన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఉత్పత్తి అవుతున్న పట్టుగూళ్లు అత్యంత నాణ్యమైనవిగా పేరుంది. ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యధికంగా ధర్మవరం పట్టుగూళ్లు కిలో రూ.607 పలుకుతున్నాయి. 

పట్టుగూళ్ల ధర ఆశాజనకం 
రెండు ఎకరాల్లో మల్బరీ సాగు చేశాం. ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టాం. బైవోల్టిన్‌ పట్టుగూళ్లు పెంచాం. దిగుబడి బాగా వచ్చింది. పట్టు గూళ్ల ధర కూడా ఆశాజనకంగా ఉంది. కిలో రూ.700పైగా పలికింది. రెండు ఎకరాలకు రూ.లక్షదాకా లాభం వచ్చింది. 
– రంగనాథ్, రైతు, రొళ్ల 

మల్బరీ సాగు లాభదాయకం 
కొన్నేళ్లుగా పట్టు పరుగులు పెంచుతున్నా. రెండెకరాల్లో మల్బరీ సాగు చేశా. ఏటా ఐదు నుంచి ఆరు పంటలు తీసుకుంటా. ఒక పంటకు ఖర్చు పోను రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ఆదాయం వస్తుంది. మల్బరీ నర్సరీని కూడా ఏర్పాటు చేశా. నర్సరీ ద్వారా కూడా ఆదాయం వస్తోంది. 
– నారాయణప్ప, వి.ఆగ్రహారం, అమరాపురం  

మల్బరీ విస్తీర్ణం పెంపునకు కృషి
హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్‌ రాష్ట్రంలోనే అతి పెద్దది. సగటున రోజుకు 6వేల కిలోల పట్టుగూళ్లు వస్తున్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి, ధర్మవరంలో కూడా పట్టుగూళ్ల మార్కెట్లు ఉన్నాయి. ఇప్పటికే మల్బరీ సాగు విస్తీర్ణం గణనీయంగా ఉంది. దీన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తాం.                 
– పద్మమ్మ, పట్టు పరిశ్రమ శాఖ జేడీ, శ్రీసత్యసాయి జిల్లా 

మరిన్ని వార్తలు