Cyclone Yaas: 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా రూపాంతరం

25 May, 2021 21:08 IST|Sakshi

సాక్షి, అమరావతి: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్‌​ తుపాను రానున్న 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర వాయవ్య దిశగా కదులుతున్న 'యాస్‌' తుపాను ఒడిశాలోని పారాదీప్‌కు 220 కిలోమీటర్ల దూరంలో..  బాలాసోర్‌కు ఆగ్నేయంగా 330 కిలోమీటర్ల దూరంలో బెంగాల్‌లోని దిఘాకు ఆగ్నేయదిశగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యిందని తెలిపారు. 

యాస్‌ తుపాను రేపు ఉత్తర ఒడిశా - బెంగాల్‌ సాగర్‌ఐలాండ్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు అధికారులు. తుపాను ప్రభావంతో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తుపాను ప్రభావం వల్ల రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాలు, యానాం ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. తుపాను ప్రభావం వల్ల గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 

తుపాను ప్రభావం వల్ల దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణశాఖ అధికారులు. ఈ క్రమంలో విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండోనెంబర్‌ ప్రమాద హెచ్చరికలు.. కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఒకటో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. 

మరిన్ని వార్తలు