బతికుండగా పదిమందికి పట్టెడన్నం.. చనిపోతూ ఐదుగురికి ప్రాణదానం

10 Nov, 2022 15:12 IST|Sakshi
పరమేశ్వర్‌రెడ్డి (ఫైల్‌)

సాక్షి, కర్నూలు(హాస్పిటల్‌): తాను బతికి ఉండగా నాగలి చేతబట్టి ధాన్యరాశులు పండించి పదుగురికీ పట్టెడన్నం పెట్టాడు. చివరకు మరణించాక కూడా ఐదుగురికి తన అవయవాలను దానం చేసి వారిలో జీవిస్తున్నాడు. కర్నూలు మండలం పడిదెంపాడు గ్రామానికి చెందిన పరమేశ్వరరెడ్డికి ఈ నెల 5వ తేదీన బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అక్కడ పరిశీలించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ వెళ్లాలని సూచించారు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని కర్నూలు నుంచి సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ సన్‌షైన్‌ హాస్పిటల్‌కు తరలించారు. అతన్ని రక్షించేందుకు మూడురోజుల పాటు వైద్యులు ఎంతో శ్రమించారు. కానీ దురదృష్టవశాత్తూ అతను మంగళవారం బ్రెయిన్‌ డెడ్‌ అయ్యారు.

ఆ తర్వాత వైద్యబృందం అవయవదానంపై వారి కుటుంబసభ్యులు భార్య, కుమారులకు, బంధువులకు అవగాహన కల్పించారు. వారి అంగీకారంతో కళ్లు, కాలేయం, రెండు కిడ్నీలు దానం చేశారు. చనిపోతూ అతను మరో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపినందుకు గర్వంగా ఉందని మృతుని కుటుంబసభ్యులు తెలిపారు. జీవనధాన్‌ ఆధ్వర్యంలో అవసరం ఉన్న చోటికి గ్రీన్‌చానెల్‌ ద్వారా కాలేయం, కిడ్నీలను తరలించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.   

చదవండి: (సత్తెనపల్లిలో కుమ్మేసుకున్న తెలుగు తమ్ముళ్లు)

మరిన్ని వార్తలు