ఓబీసీ బిల్లుకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు

10 Aug, 2021 13:30 IST|Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓబీసీ సవరణ బిల్లుకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా  వైఎస్సార్‌సీపీ ఎంపీలు మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ.. ఓబీసీ బిల్లుకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. ఓబీసీలను గుర్తించే అధికారం రాష్ట్రాలకు ఇవ్వడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఏయే కులాలు వెనకబాటు తనంలో ఉన్నాయో.. రాష్ట్ర ప్రభుత్వాలకే అవగాహన ఉంటుందన్నారు.

ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ ఓబీసీలకు ఈరోజు వరకు పూర్తిగా న్యాయం జరగలేదని రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఓబీసీల రిజర్వేషన్లను పలుమార్లు కేంద్రం దృష్టికి తెచ్చారని గుర్తు చేశారు. ఓబీసీ బిల్లును స్వాగతిస్తున్నామని తెలిపారు. బీసీ వర్గాల అభ్యున్నతి కోసం కేంద్రం కేటాయిస్తున్న బడ్జెట్‌ నామమాత్రం బడ్జెట్‌ అని విమర్శించారు. అదే ఏపీలో సీఎం జగన్‌ బీసీల అభివృద్ధి కోసం 30 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే..మరి 29 రాష్ట్రాలు ఉన్న కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు.

సుమారు 67 ఏళ్ల నుంచి ఓబీసీ కేటగిరీ కింద వెనకబడి ఉన్న కులాలకు ఇన్ని సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుందని వైఎస్సార్‌సీపీ లోక్‌సభ ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు. వారికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈ బిల్లును తీసుకురావడం మనస్పూర్తిగా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేంద్ర గుర్తించలేని ఓబీసీ కులాలు సుమారు 671 ఉన్నాయని, ఈ బిల్లు ద్వారా వారికి ప్రయోజనం చేకూరుతుందన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు