పోలవరం పనులపై సంతృప్తి

20 Feb, 2021 03:58 IST|Sakshi
స్పిల్‌వే బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలిస్తున్న డీడీఆర్‌పీ బృందం సభ్యులు

క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించిన డీడీఆర్పీ

పెండింగ్‌ డిజైన్లపై నేడు జలవనరుల అధికారులతో సమీక్ష

సాక్షి, అమరావతి‌: పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న డిజైన్లను ఖరారు చేయడమే లక్ష్యంగా.. డీడీఆర్పీ (డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌) శుక్రవారం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. పూణేలోని సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ (సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌) ఆవరణలో 3–డీ పద్ధతిలో నిర్మించిన పోలవరం నమూనా ప్రాజెక్టులో రకరకాల ఒత్తిడులతో నీటిని పంపడం ద్వారా నిర్వహించిన ప్రయోగాల్లో వెల్లడైన ఫలితాలను క్షేత్రస్థాయిలో వర్తింపజేస్తూ డిజైన్లపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేసుకునే యత్నం చేశారు. అలాగే, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు.. పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈఓ చంద్రశేఖర్‌ అయ్యర్, సభ్య కార్యదర్శి రంగారెడ్డి, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో శనివారం రాజమహేంద్రవరంలో జరగనున్న సమీక్ష సమావేశంలో డిజైన్లపై చర్చించనున్నారు. మరోవైపు.. వీటి రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్‌ ఏబీ పాండ్య నేతృత్వంలో కేంద్రం ఏర్పాటుచేసిన డీడీఆర్పీ నిపుణుల కమిటీ గురువారం రాజమహేంద్రవరానికి చేరుకుంది.


స్పిల్‌వే గ్యాలరీని పరిశీలిస్తున్న డీడీఆర్‌పీ బృందం సభ్యులు 

రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, పీపీఏ సీఈఓ చంద్రశేఖర్‌ అయ్యర్‌లతో కలిసి ఈ కమిటీ పోలవరం ప్రాజెక్టు పనులను శుక్రవారం పరిశీలించింది. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, స్పిల్‌ వే గ్యాలరీ, స్పిల్‌ వేకు అమర్చిన గేట్లు, ఎగువ కాఫర్‌ డ్యామ్, దిగువ కాఫర్‌ డ్యామ్, రెండు కాఫర్‌ డ్యామ్‌ల మధ్య చేపట్టిన ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) పనులను పరిశీలించి వాటి నాణ్యతపై సంతృప్తి వ్యక్తంచేసింది. గోదావరి నది వరద ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదుగా మళ్లించడానికి తవ్వాల్సిన అప్రోచ్‌ ఛానల్‌ ప్రదేశాన్ని కూడా కమిటీ పరిశీలించింది. ఈ సందర్భంగా వెల్లడైన అంశాలను పూణేలో సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌లో నిర్వహించిన ప్రయోగాల్లో తేలిన విషయాలతో పోల్చి.. డిజైన్లలో చేయాల్సిన మార్పులు చేర్పులపై చర్చించింది. ఆదివారం కూడా పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. అధికారులతో మరోమారు సమావేశమై డిజైన్‌లపై తుది నిర్ణయం తీసుకోనుంది. 

మరిన్ని వార్తలు