టోల్‌  ఫ్రీ నంబర్ల గురించి తెలుసుకుందామా..

8 May, 2021 14:08 IST|Sakshi

కడప కార్పొరేషన్‌: మన మేదో పని మీద వెళ్తుంటాం. రోడ్డు మీద ప్రమాదం జరిగి ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటారు. వెంటనే మొబైల్‌ నుంచి 108కి ఫోన్‌ చేసి సమాచారం అందిస్తాం. ఒక్క కాల్‌తో రెండు ప్రాణాలు కాపాడుతాం. పైగా ఫోన్‌ చేయడం వల్ల ఒక్క పైసా ఖర్చుండదు. ఇలాంటి టోల్‌ ఫ్రీ నంబర్లు అన్ని రంగాలకూ విస్తరించాయి. కొన్ని ప్రయివేటు సంస్థలు కూడా సమాచారాన్ని టోల్‌ ఫ్రీ నంబర్ల ద్వారా అందిస్తున్నాయి. అలాంటి టోల్‌  ఫ్రీ నంబర్ల గురించి తెలుసుకుందాం.

155333 (ఏపీఎస్‌పీడీసీఎల్‌): 
విద్యుత్‌ సరఫరాలో అంతరాయం, లో ఓల్టేజీ, సిబ్బంది పనితీరు, ఇతర విద్యుత్‌ సమస్యలను ఈ నంబర్‌కు ఫోన్‌ చేసి చెప్పవచ్చు. 

1910 (బ్లడ్‌ బ్యాంక్స్‌): 
అందుబాటులో ఉన్న గ్రూపు రక్తం, ఇతర వివరాలు ఈ నంబర్‌కు ఫోన్‌ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.

1950 (ఎన్నికల సంఘం): 
ఓటరు నమోదు, తొలగింపులు, పేరు మార్పిడి, ఓటు మార్పిడి, అవసరమైన సర్టిఫికెట్లు వంటి వివరాలు తెలుసుకోవచ్చు.

1100(మీ సేవ): 
ఆయా ప్రాంతాల్లో మీ సేవ పథకం అమలు తీరు, సమస్యలపై ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

18004251110(వ్యవసాయ శాఖ): 
ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం మద్దతు ధర, రైతుల సమస్యలు, మిల్లర్ల దోపిడీ, అధికారులు సహకరించకపోవడం వంటి వాటిపై ఫిర్యాదు చేయవచ్చు.

18002004599 (ఏపీఎస్‌ఆర్‌టీసీ): 
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సేవలు, సంస్థ బస్సుల్లో అసౌకర్యాలు, ప్రయాణికులతో సిబ్బంది ప్రవర్తనపై ఫిర్యాదు చేయవచ్చు.

101(అగ్ని మాపక శాఖ): 
అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఈ నంబర్‌కు ఫోన్‌ చేస్తే సిబ్బంది వచ్చి నియంత్రణ, సహాయ చర్యలు చేపడుతారు. విపత్తుల నిర్వహణలో సేవలు అందిస్తారు.

108 (ఎమర్జెన్సీ అంబులెన్స్‌):
ప్రమాదం జరిగినా, ప్రాణాపాయ పరిస్థితుల్లో అస్వస్థతకు గురైనా ఈ నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు. క్షణాల వ్యవధిలో అంబులెన్స్‌ వచ్చి వైద్య సిబ్బంది చికిత్స అందిస్తారు. ఇంటి వద్ద ఉన్న రోగులనూ అత్యవసరంగా ఆసుపత్రికి చేరవేస్తారు.

1997(హెచ్‌ఐవీ–కంట్రోల్‌ రూమ్‌): 
హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ వ్యాధులపై బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవచ్చు.

100(పోలీసు శాఖ): 
పోలీసుల తక్షణ సాయం పొందేందుకు ఈ నంబర్‌కు కాల్‌ చేయవచ్చు. గృహహింస, వరకట్న వేధింపులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, పోలీసుల ప్రవర్తనపై కూడా ఫిర్యాదు చేయవచ్చు.

131(రైల్వే శాఖ): 
రైల్వే రిజర్వేషన్, రైళ్ల రాకపోకల వివరాలు తెలుసుకోవచ్చు. స్థానిక రైల్వేస్టేషన్‌ సమచారం తెలుస్తుంది.

1090 (క్రైం స్పెషల్‌ బ్రాంచ్‌): 
చోరీలు, ఇతర నేర సంబంధ సమస్యలను తెలియజేయవచ్చు. అది జిల్లా కేంద్రంలో క్రైం స్టాఫర్‌కు చేరుతుంది. అసాంఘిక కార్యకలాపాలు, వేధింపులు, జూదం, వ్యభిచారం వంటి వాటిపై ఫిర్యాదు చేయవచ్చు. 

155361(అవినీతి నిరోధక శాఖ): 
ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వచ్చు.

155321 (ఉపాధి హామీ పథకం): 
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ దీనిని వినియోగిస్తోంది. పథకంలో సమస్యలు, లోపాలు, అవకతవకలపై ఫిర్యాదు చేయవచ్చు.

198(బీఎస్‌ఎన్‌ఎల్‌): 
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థకు చెందిన టెలిఫోన్‌ సమస్యలపై వినియోగదారులు ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

1098 (చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌): 
ఎలాంటి ఆదరణ, రక్షణ లేని బాలలను ఆదుకొనేందుకు, బాలలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసినా, బాల కార్మికులు తారసపడినా ఈ నంబర్‌కు తెలియజేయవచ్చు.

18004255314(ఐసీడీఎస్‌): 
స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థలో సిబ్బంది పనితీరు, పిల్లలకు ఆహార సరఫరాలో లోపాలుంటే ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

18001208757(కడప కార్పొరేషన్‌): 
కడప నగరపాలక సంస్థలో పారిశుధ్యం, తాగునీరు, డ్రైనేజీ, వీధిలైట్లు వంటి సమస్యలపై ఫోన్‌ చేసి తెలపవచ్చు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు