ఏడుకొండలపై భక్తుల రద్దీ

12 Jun, 2022 04:26 IST|Sakshi
చలువ పందిరి కింద నడిచి వస్తున్న భక్తులు, జ్యేష్టాభిషేకం టికెట్‌ చూపుతున్న భక్తురాలు

తిరుమలేశుని దర్శనానికి 25 గంటల సమయం 

అందుబాటులో జ్యేష్టాభిషేకం సేవా టికెట్లు

తిరుపతి అలిపిరి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశుని దర్శనానికి భక్తజనం క్యూ కడుతున్నారు. వేసవి సెలవులు, వారాంతాలు కావడంతో ఏడు కొండలపై భక్తుల రద్దీ పెరిగింది. దీంతో క్యూలైన్‌లన్నీ భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో క్యూలైన్లు రాంభగీచ వరకు చేరుకున్నాయి.

మరోవైపు నడక మార్గం గుండా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తుల సంఖ్య మాత్రం అంతకంతకూ పెరిగిపోతోంది. తిరుమలకు విచ్చేసిన భక్తులకు టీటీడీ మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోంది. నడక మార్గంలో తిరుమలకు వస్తున్న భక్తులకు మోకాళ్లమెట్టు ప్రాంతంలో ప్రత్యేకంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.

నిత్యం గ్రీన్‌మ్యాట్‌పై నీళ్లు పడుతున్నారు. క్యూలైన్‌లో వేచి ఉండే భక్తులకు తాగునీరు, మజ్జిగ, పాలను అందిస్తున్నారు. ఊహించని స్థాయిలో భక్తులు కొండకు రావడంతో సర్వదర్శనానికి 25 గంటల సమయం పడుతోంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 67,949 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 39,837 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.70 కోట్లు వచ్చింది. కాగా, తిరుమలలో ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు మూడు రోజులపాటు జరగనున్న జ్యేష్టాభిషేకం సేవా టికెట్లు శనివారం నుంచి భక్తులకు అందిస్తున్నారు. టికెట్‌ ధర రూ.400 చొప్పున రోజుకు 600 టికెట్లు విడుదల చేస్తున్నారు. శనివారం సీఆర్వో కార్యాలయానికి ఎదురుగా ఉన్న కౌంటర్‌లో భక్తుల ఆధార్‌ వివరాలు, బయోమెట్రిక్‌ తీసుకుని టికెట్లు తీసుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు