తళుక్కుమంటున్న అదృష్టం

17 Aug, 2020 11:22 IST|Sakshi

పొలాల్లో ‘వజ్రాల పంట’  

వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న అన్వేషకులు 

ఇప్పటికే 50కి పైగా లభ్యం 

తుగ్గలి:  వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. పంటలు కళకళలాడుతున్నాయి. వాటితో పాటే వజ్రాలు కూడా తళుక్కుమంటున్నాయి. అదృష్టం రూపంలోదరికి కాసుల పంట పండిస్తున్నాయి. తుగ్గలి మండలంలోని పగిడిరాయి, జొన్నగిరి, చిన్నజొన్నగిరి, రామాపురం, జి.ఎర్రగుడి, ఉప్పర్లపల్లి, తుగ్గలి, గిరిగెట్ల, చెన్నంపల్లి, బొల్లవానిపల్లి, పి.కొత్తూరు, గిరిజన తండాల్లోని ఎర్రనేలల్లో వజ్రాలు లభ్యమవుతుంటాయి. ఏటా తొలకరి వర్షాలు మొదలైనప్పటి నుంచి ఈ ప్రాంతంలో విలువైన వజ్రాలు దొరుకుతుంటాయి. దీంతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు స్థానికులతో పాటు వివిధ జిల్లాల నుంచి జనం పెద్దసంఖ్యలో వజ్రాన్వేషణకు వస్తుంటారు. ఇలా వచ్చిన వారికే కాకుండా పొలాల్లో పనులు చేసే రైతులు, కూలీలకు కూడా వజ్రాలు దొరుకుతున్నాయి. (అదృష్టం అంటే అతనిదే.. రాత్రికి రాత్రే)

దీంతో పంట పొలాలకు వెళ్లినప్పుడు ఓ వైపు పని చేసుకుంటూనే..మరోవైపు వజ్రాలపై కూడా నిఘా  ఉంచుతున్నారు. 
ఈ ఏడాది ఇప్పటికే రూ.50 లక్షలకు పైగా విలువ చేసే 50కి పైగా వజ్రాలు లభ్యమయ్యాయి.  
దొరుకుతున్న వజ్రాలను జొన్నగిరి, మద్దికెర మండలం పెరవలి, అనంతపురం జిల్లా గుత్తికి చెందిన వ్యాపారులు రహస్యంగా కొనుగోలు చేస్తున్నారు. 
విక్రయదారులకు ధర నచ్చకపోతే టెండర్‌ పద్ధతిన తీసుకుంటారు. రంగు, జాతితో పాటు క్యారెట్ల రూపంలో లెక్కించి వ్యాపారులు వజ్రాలను కొనుగోలు చేస్తున్నారు.  
రెండు రోజుల క్రితం జొన్నగిరిలో మహిళా కూలీకి దొరికిన వజ్రాన్ని ఓ వ్యాపారి రూ.6 లక్షల నగదు,   5 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు