Andhra Pradesh: మహిళలకు రెట్టింపు రుణాలు 

25 Jul, 2022 04:43 IST|Sakshi

గతేడాది రూ.51,127 కోట్లు.. ఈ దఫా రూ.1,05,399 కోట్లు 

ఏడాదిలోనే ఏకంగా 106 శాతం రుణాలు మంజూరు 

చేయూత, ఆసరా, ఇళ్లు తదితర పథకాలన్నీ మహిళల పేరుతోనే..

సాక్షి, అమరావతి:  మహిళా సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో మహిళలకు బ్యాంకులు ఒక్క ఏడాదిలోనే రెట్టింపు రుణాలను మంజూరు చేశాయి. గత ఏడాది మార్చి నెలాఖరు నాటికి మహిళలకు మంజూరైన బ్యాంకు రుణాలు రూ.51,127 కోట్లు కాగా ఈ ఏడాది మార్చి చివరకు ఏకంగా రూ.1,05,399 కోట్లు ఇవ్వడం గమనార్హం. ఒక్క ఏడాదిలోనే అదనంగా రూ.54,272 కోట్ల మేర (106 %) రుణాలను మంజూరు చేసినట్లైంది.  

పొదుపు సంఘాల్లో క్రమశిక్షణ 
ఆర్బీఐ నిబంధనల ప్రకారం మొత్తం రుణాల మంజూరులో మహిళలకు ఐదు శాతం ఇవ్వాలి. అయితే రాష్ట్రంలో అంతకు మించి మహిళలకు 20.95 శాతం మంజూరయ్యాయి. ఇందుకు ప్రధాన కారణం మహిళల జీవనోపాధి పెంపొందించి సాధికారత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలేనని స్పష్టం అవుతోంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఎన్నికల నాటికి ఉన్న రుణాలను నాలుగు విడతల్లో తిరిగి చెల్లించేందుకు వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. సకాలంలో రుణాలు చెల్లించే సంఘాల మహిళలకు సున్నా వడ్డీని కూడా క్రమం తప్పకుండా అమలు చేస్తోంది. ఫలితంగా పొదుపు సంఘాల మహిళల్లో ఆర్థిక క్రమశిక్షణ పెరగడంతో వివిధ పథకాల ద్వారా బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేస్తున్నాయి.  

మూడేళ్లుగా లక్ష్యానికి మించి  
మూడేళ్ల  నుంచి స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకులు లక్ష్యానికి మించి రుణాలిచ్చాయి. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద 30 లక్షలకుపైగా ఇళ్ల స్థలాలను మహిళల పేరిటే ప్రభుత్వం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఇళ్ల నిర్మాణాల కోసం బ్యాంకులు లబ్ధిదారులకు రూ.35 వేల చొప్పున పావలా వడ్డీకే రుణాలను మంజూరు చేస్తున్నాయి. ఈ నెల 5వ తేదీ నాటికి 3,80,826 మంది ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు బ్యాంకులు రూ.1,345.09 కోట్ల మేరకు పావలా వడ్డీకి రుణం ఇచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల కారణంగానే మహిళలకు పెద్దఎత్తున రుణాలు మంజూరవుతున్నాయి.  

మరిన్ని వార్తలు