Goldsmiths: మసకబారుతున్న ‘స్వర్ణ’కారుల బతుకులు

7 Jan, 2023 20:08 IST|Sakshi

కార్పొరేట్‌ తాకిడికి దూరమవుతున్న ఉపాధి

ప్రత్యామ్నాయంతో పట్టణాలకు వలస 

(డెస్క్‌–రాజమహేంద్రవరం): ఆధునిక పరిస్థితుల ప్రభావితంతో కుల వృత్తులు కూలిపోతున్నాయి. రోజురోజుకూ ఉనికి కోల్పోతున్నాయి. మనుగడ కష్టమని భావించిన కొందరు బతుకుదారి మార్చుకుంటున్నారు. మరికొందరు ఇప్పటికీ తాతల కాలం నుంచి వారసత్వంగా అబ్బిన వృత్తినే నమ్ముకుంటూ యాతనలు పడుతున్నారు. ఒకప్పుడు ‘బంగారు’బాబుల్లా బతికిన స్వర్ణకారుల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. చాలామంది పల్లెటూళ్ల నుంచి పట్టణాల బాట పడుతున్నారు. బతుకు బండి పయనానికి ప్రత్యామ్నాయ దారులు వెతుక్కుంటున్నారు. 


ఉనికిపాట్లు

కార్పొరేట్‌ సంస్థల సవాళ్ల నేపథ్యంలో కూడా ఉమ్మడి గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో స్వర్ణకారులు ఇప్పటికీ ఉనికి చాటుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని నల్లమందుసందు, సీతమ్మసందు, చందాసత్రం, గుండువారి వీధి ప్రాంతాల్లో కొందరు స్వర్ణకారులు కొద్దోగొప్పో ఆభరణాల తయారీ పనులు చేసుకుంటూ వృత్తికి ఊపిరిలూదుతున్నారు. దీర్ఘకాలంగా ఉన్న పరిచయాలతో కొందరు ఇక్కడకు వచ్చి బంగారమిచ్చి వారితో ఆభరణాలు తయారు చేయించుకుంటున్నారు. ఒక్క రాజమహేంద్రవరం నగరంలోనే 2008 నాటికి వెయ్యి మందికి పైగా స్వర్ణకారులు ఉండేవారు. ఇప్పుడు వీరి సంఖ్య బాగా తగ్గిపోయింది. తమ సంఘంలో 600 మంది సభ్యులుగా కొనసాగుతున్నారని రాజమహేంద్రవరం స్వర్ణకారుల సంఘం గండేబత్తుల శ్యామ్‌ చెప్పారు. 

కార్పొరేట్‌ సెగ 
ఆభరణాల రంగంలో కార్పొరేట్లు అడుగు పెట్టడంతో స్వర్ణకారుల బతుకులు రంగు మారిపోయాయి. అప్పటి వరకూ ఉన్న ఉపాధి కాస్తా దూరం కావడం ప్రారంభమైంది. తొలినాళ్లలో జ్యూయలరీ షాపులొచ్చి వీరి మనుగడను కొంత దెబ్బ తీశాయి. పాతిక సంవత్సరాలుగా నగరాల్లో కార్పొరేట్‌ షాపులు పెరిగిపోయాయి. ఈ పదేళ్లలో ఓ మాదిరి పట్టణాలకూ ఈ షాపులు విస్తరించాయి. పగలూ రాత్రీ విద్యుద్దీపాల కాంతులతో వెలిగిపోయే అందాల షాపుల భవంతుల వైపే జనమూ అడుగులు వేస్తున్నారు. ఫలితంగా వృత్తి నైపుణ్యమున్న స్వర్ణకారులకు ఆదరణ తగ్గింది. కార్పొరేట్‌ తాకిడికి తలవంచిన కొందరు బ్యాంకులు లేదా బంగారంపై వడ్డీ ఇచ్చే వ్యక్తుల వద్ద అప్రైజర్లుగా చేరిపోయారు. వయసు 50లు దాటిన మరికొందరు మరో పని నేర్చుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో పాత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం స్వర్ణకారులుగా పని చేస్తున్నవారెవరూ తమ పిల్లలను ఈ రంగం వైపు నడిపించడంలేదు. తన ఇద్దరు పిల్లలూ బాగా చదువుకున్నారని.. ఒకరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని నల్లమందు సందులో పని చేస్తున్న స్వర్ణకార సంఘం సభ్యుడు పేరూరి సూర్యప్రకాష్‌ చెప్పారు. తమ తరం తర్వాత స్వర్ణకారులు కనిపించరని ఆవేదన వ్యక్తం చేశారు. 

పోటీ పడదామన్నా పెట్టుబడి ఏదీ.. 
అన్ని వృత్తుల మాదిరిగానే ఆభరణాల తయారీలో కూడా ఆధునికత అడుగు పెట్టింది. ప్రతి చిన్న పనీ యంత్రాల సాయంతోనే చేయాల్సి వస్తోంది. కానీ వాటిని సమకూర్చోలేక స్థాయికి తగ్గట్టుగా చిన్నపాటి పరికరాలతో స్వర్ణకారులు నెట్టుకొస్తున్నారు. గతంలో ఎక్కువగా కుంపటి ఉపయోగించేవారు. నాటి స్వర్ణకారులెందరినో శ్వాసకోశ వ్యాధులు ఇప్పటికీ వెంటాడుతున్నాయని స్వర్ణకారుడు ఈదరాడ శ్రీనివాస్‌ చెప్పారు. ఉదయం నుంచి చీకటి పడే వరకూ కూర్చుని పని చేయడం వల్ల శారీరక వ్యాయామం లేక అనారోగ్యం బారిన పడుతున్నామని మరో స్వర్ణకారుడు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దోగొప్పో డబ్బులు వెచ్చించి, చిన్నపాటి యంత్రాలు కొందామన్నా ఎక్కువ మందికి ఆర్థిక పరిస్థితులు అనుకూలించడం లేదు. ఒక్కో యంత్రానికి కనీసం రూ.50 వేల పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. వ్యక్తిగత రుణాలకు బ్యాంకులు సహకరించడ లేదని స్వర్ణకారుడు వరప్రసాద్‌ చెప్పారు. దొంగ బంగారం కొన్నారంటూ గతంలో పోలీసుల నుంచి తమకు తరచూ వేధింపులు ఎదురయ్యేవని కొందరు స్వర్ణకారులు చెప్పారు. ఐదేళ్లుగా ఈ వేధింపులు తగ్గాయన్నారు. ఏమైనప్పటికీ కార్పొరేట్‌ సంస్థల పోటీని తట్టుకోలేక స్వర్ణకారుల బతుకులు కాంతిహీనమవుతున్నాయి. 


సామాజిక భవనమూ లేదు 

ఈ మధ్యనే రాజమహేంద్రవరం స్వర్ణ కారుల సంఘానికి ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నికయ్యాను. స్వర్ణకారుల బతుకులు దయనీయంగా ఉన్నాయి. ఈ నగరంలో మాకు ఒక సామాజిక భవనం కూడా లేదు. స్థలమివ్వగలిగితే భవనం ఇస్తామని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఖరీదైన స్థలాన్ని కొనుగోలు చేసి సమకూర్చగలిగే ఆర్థిక స్తోమత మాలో ఎవ్వరికీ లేదు. ప్రజాప్రతినిధులు మా కష్టాలను గమనించి సామాజిక భవనం నిర్మించాలని కోరుతున్నాను. 
– గండేబత్తుల శ్యామ్, అధ్యక్షుడు, రాజమహేంద్రవరం స్వర్ణకారుల సంఘం 


రుణం అందించాలి

స్వర్ణాభరణాల తయారీ యంత్రాలు చాలా ఖరీదైనవి. కొనుక్కుని బతుకుదామంటే ఆర్థిక పరిస్థితులు సహకరించడం లేదు. ముద్రా రుణాలు మంజూరు చేయాలని కోరుతున్నా బ్యాంకులు స్పందించడం లేదు. పూచీకత్తు లేనిదే ఇవ్వబోమంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వృత్తిలో ఎలా పోటీ పడగలం? ఎలా ముందుకు వెళ్లగలం? రుణ సదుపాయం కల్పిస్తే కొద్దోగొప్పో ఈ వృత్తి బతకడానికి అవకాశముంటుంది. 
– ఈదర వరప్రసాద్, నల్లమందు సందు, రాజమహేంద్రవరం 


ఈ స్పీడులో మాలాంటి వాళ్లకు కష్టమే.. 

ఎక్కడ పడితే అక్కడ జ్యూయలరీ షాపులు వచ్చేశాయి. పెద్ద పట్టణాల్లో కార్పొరేట్‌ సంస్థల షోరూములు వచ్చేశాయి. అక్కడ అడిగిన వెంటనే కావాల్సిన నగ దొరుకుతోంది. ప్రస్తుతం ప్రజలకు అడిగిన వెంటనే సరకు ఇవ్వాలి. ఒక్క క్షణం కూడా ఓపిక పట్టే తత్వం పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మేం ఎంత బాగా చేసినా ఫలితం ఏముంది? కొద్ది మంది మాత్రం చిన్నచిన్న నగలు చేయించుకోవడానికి నమ్మ కంతో వస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం పుణ్యమాని పెన్షన్‌ వస్తోంది. 
– నామగిరి బ్రహ్మానందం, ప్రత్తిపాడు  

మరిన్ని వార్తలు