ఇజ్రాయెల్‌ గుప్పిట్లో గాజా | Israel-Palestine War Updates: Israel And Hamas War Rages As Outcry Grows Over Gaza Crisis - Sakshi
Sakshi News home page

Israel-Palestine War Updates: ఇజ్రాయెల్‌ గుప్పిట్లో గాజా

Published Tue, Nov 7 2023 5:11 AM

Israel-Hamas conflict: Israel-Hamas war rages as outcry grows over Gaza crisis - Sakshi

గాజా్రస్టిప్‌: హమాస్‌ మిలిటెంట్ల భరతం పట్టడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం ఉత్తర గాజాను పూర్తిగా చుట్టుముట్టింది. గాజా స్ట్రిప్‌లోని ఇతర ప్రాంతాలతో ఉత్తర గాజాకు సంబంధాలు తెగిపోయాయి. ఉత్తర గాజా మొత్తం దిగ్బంధంలో చిక్కుకుంది. గాజా స్ట్రిప్‌ను రెండు ముక్కలుగా విభజించామని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. ఉత్తర గాజా ఇప్పుడు తమగుప్పిట్లో ఉందని పేర్కొంది. యుద్ధంలో ఇది చాలా ముఖ్యమైన దశ అని, ఇకపై కీలక దాడులు చేయబోతున్నామని తెలియజేసింది.

గాజా సిటీలోకి అడుగుపెట్టడానికి ఇజ్రాయెల్‌ సేనలు ముందుకు కదులుతున్నాయి. సైన్యం ఆదివారం అర్ధరాత్రి నుంచి ఉత్తర గాజాపై నిప్పుల వాన కురిపించింది. వైమానిక దాడులు ఉధృతం చేసింది. 450 లక్ష్యాలను ఛేదించామని, మిలిటెంట్ల స్థావరాలను, సొరంగాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. సీనియర్‌ మిలిటెంట్‌ జమాల్‌ మూసా హతమయ్యాడని వివరించింది. హమాస్‌ కాంపౌండ్‌ ఒకటి తమ అ«దీనంలోకి వచ్చిందని పేర్కొంది.

మిలిటెంట్లకు సమీపంలోనే ఉన్నామని, అతిత్వరలో వారిపై మూకుమ్మడి దాడి ప్రారంభిస్తామని ఇజ్రాయెల్‌ సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్‌ కల్నల్‌ రిచర్డ్‌ హెచ్ట్‌ వెల్లడించారు. హమాస్‌కు గాజా సిటీ ప్రధానమైన స్థావరం. మిలిటెంట్లు ఇక్కడ పటిష్టమైన సొరంగాల వ్యవస్థను నిర్మించుకున్నారు. పెద్ద సంఖ్యలో ఆయుధ నిల్వలను సిద్ధం చేసుకున్నారు. గాజా సిటీ వీధుల్లో ఇజ్రాయెల్‌ సైనికులతో ముఖాముఖి తలపడేందుకు వారు సిద్ధమవుతున్నట్లు స్థానిక మీడియా తెలియజేసింది.  

ఒక్క రాత్రి 200 మంది బలి!  
గాజాపై ఆదివారం రాత్రి నుంచి ఉదయం వరకూ ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో దాదాపు 200 మంది మరణించారని గాజా సిటీలోని అల్‌–íÙఫా హాస్పిటల్‌ డైరెక్టర్‌ చెప్పారు. పెద్ద సంఖ్యలో మృతదేహాలు తమ ఆసుపత్రికి చేరుకున్నాయని తెలిపారు. చాలామంది క్షతగాత్రులు చికిత్స కోసం చేరారని వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.  

కాల్పుల విరమణకు ససేమిరా  
గాజాపై దాడులకు విరామం ఇవ్వాలని, పాలస్తీనియన్లకు మరింత మానవతా సాయం అందేలా చర్యలు తీసుకోవాలంటూ మిత్రదేశం అమెరికా చేసిన సూచనను ఇజ్రాయెల్‌ లెక్కచేయడం లేదు. కాల్పుల విరమణ పాటించాలంటూ జోర్డాన్, ఈజిప్టు తదితర అరబ్‌ దేశాలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదు. హమాస్‌ చెరలో ఉన్న 240 మంది బందీలను విడుదల చేసే వరకూ గాజాపై దాడులు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూ      తేలి్చచెప్పారు.

గాజాలో సంక్షోభం మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తుండడంతో అరబ్‌ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. జోర్డాన్‌ సైనిక రవాణా విమానం సోమవారం ఉత్తర గాజాల్లో క్షతగాత్రులకు, రోగులుకు అవసరమైన ఔషధాలు, వైద్య పరికరాలను జార విడిచింది. మరోవైపు ఇజ్రాయెల్‌–లెబనాన్‌ సరిహద్దుల్లో ఘర్షణలు ఆగడం లేదు. ఇరాన్‌ అండదండలున్న హెజ్బొల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడులు సాగిస్తూనే ఉన్నారు. ఈ దాడులను ఇజ్రాయెల్‌ సైన్యం తిప్పికొడుతోంది. ఆదివారం రాత్రి ఇజ్రాయెల్‌ దాడుల్లో దక్షిణ లెబనాన్‌లో నలుగురు పౌరులు మరణించారు.   

10,022 మంది పాలస్తీనియన్లు మృతి  
ఇజ్రాయెల్‌–హమాస్‌ మిలిటెంట్ల మధ్య యుద్ధం మొదలై నెల రోజులవుతోంది. ప్రాణనష్టం నానాటికీ పెరిగిపోతోంది. గాజాలో మృతుల సంఖ్య 10 వేలు దాటింది. ఇజ్రాయెల్‌ సైన్యం భూతల, వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 10,022 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. మృతుల్లో 4,100 మంది చిన్నారులు, 2,600 మంది మహిళలు ఉన్నారని తెలియజేసింది.

వైమానిక దాడుల్లోనే ఎక్కువ మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌ భూభాగం వైపు హమాస్‌ మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్లలో 500కుపైగా రాకెట్లు గాజాలోనే కూలిపోయాయని, వాటివల్ల పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు మరణించారని ఇజ్రాయెల్‌ సైన్యం చెబుతోంది. డేర్‌ అల్‌–బాలహ్‌ పట్టణంలో సోమవారం ఉదయం ఓ ఆసుపత్రి సమీపంలోనే 66 మృతదేహాలను సామూహికంగా ఖననం చేశారు.  
 
ముగిసిన ఆంటోనీ బ్లింకెన్‌ పర్యటన

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ మధ్యప్రాచ్యంలో పర్యటన ముగించుకొని స్వదేశానికి పయనమయ్యారు. ఆయన సోమవారం తుర్కియే రాజధాని అంకారాలో ఆ దేశ విదేశాంగ మంత్రి హకన్‌ ఫిడాన్‌తో సమావేశమయ్యారు. అమెరికాకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. గాజాలో సంక్షోభాన్ని నివారించే ప్రక్రియ పురోగతిలో ఉందని చెప్పారు. గాజాపై దాడులకు విరామం ఇవ్వాలని ఇజ్రాయెల్‌కు మరోసారి సూచించారు. ఇజ్రాయెల్‌–హమాస్‌ సంఘర్షణకు తెరదించడం, బందీలను విడిపించడంతోపాటు గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం అందేలా చర్యలు తీసుకొనే లక్ష్యంతో మధ్య ప్రాచ్యం చేరుకున్న బ్లింకెన్‌ పాక్షికంగానే విజయం సాధించారు.

మధ్యప్రాచ్యం చేరుకున్న అమెరికా జలాంతర్గామి  
ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య ఘర్షణ మరింత ఉధృతంగా మారుతున్న నేపథ్యంలో అమెరికా తన గైడెడ్‌ మిస్సైల్‌ జలాంతర్గామిని మధ్యప్రాచ్యానికి పంపించింది. ఓహాయో క్లాస్‌ సబ్‌మెరైన్‌ తనకు కేటాయించిన ప్రాంతంలో అడుగుపెట్టిందని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ప్రకటించింది. ఈజిప్టు రాజధాని కైరోకు ఈశాన్య దిక్కున సూయెజ్‌ కెనాల్‌లో జలాంతర్గామి ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. తమ గైడెడ్‌ మిస్సైల్‌ జలాంతర్గాముల ఎక్కడ మకాం వేశాయన్నది అమెరికా సైన్యం ఇలా బహిరంగంగా ప్రకటించడం అత్యంత అరుదు. తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్‌ జోలికి ఎవరూ రావొద్దన్న హెచ్చరికలు జారీ చేయడానికే అమెరికా తన జలాంతర్గామిని మధ్యప్రాచ్యానికి తరలించినట్లు తెలుస్తోంది.   
ఖాన్‌ యూనిస్‌లోని భవన శిథిలాల్లో బాధితుల కోసం అన్వేíÙస్తున్న ఓ పాలస్తీనా వాసి ఉద్వేగం  
రఫాలో  శిథిలాల మధ్య  చిన్నారులు

Advertisement

తప్పక చదవండి

Advertisement