టీచర్లకు ఇంగ్లిష్‌ సర్టిఫికెట్‌ కోర్సు

2 Jul, 2021 04:59 IST|Sakshi

ఏపీ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ ద్వారా జూలై 19 నుంచి ప్రారంభం  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న ప్రైమరీ, అప్పర్‌ ప్రైమరీ, హైస్కూళ్ల టీచర్లు తమ ఇంగ్లిష్‌ ప్రావీణ్యాన్ని మెరుగుపరచుకునేందుకు నెల రోజుల పాటు శిక్షణతో కూడిన సర్టిఫికెట్‌ కోర్సు అందించాలని ఏపీ సమగ్ర శిక్ష నిర్ణయించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే లక్ష్యంలో భాగంగా దీన్ని అమలు చేస్తోంది. సర్టిఫికెట్‌ ఇన్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌(సీఈఎల్‌టీ) శిక్షణను అందించనున్నారు. ఈనెల 19 నుంచి ఆగస్టు 17 వరకు నెల పాటు ఆన్‌లైన్‌ ద్వారా రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌(సౌత్‌ ఇండియా, బెంగళూరు) సంస్థ ఈ శిక్షణ ఇవ్వనుంది.

అర్హులైన వారిని ఎంపిక చేయాలని ఇప్పటికే అన్ని జిల్లాల విద్యాధికారులకు సమగ్ర శిక్ష ఆదేశాలిచ్చింది. ఈ ట్రైనింగ్‌కు జిల్లా నుంచి 25 మంది చొప్పున టీచర్లను ఎంపిక చేయనున్నారు. ఆన్‌లైన్‌ శిక్షణకు ఆసక్తి వ్యక్తీకరణను టీచర్ల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, విభిన్న ప్రతిభావంతులైన వారికి చోటు కల్పించాలి. కొత్తగా నియమితులైన టీచర్లకు ప్రాధాన్యమివ్వాలి. ఇంతకుముందు శిక్షణ పొందిన వారిని ఎంపిక చేయకూడదు. 50 ఏళ్లలోపు వయసున్న వారినే ఎంపిక చేయాలి. టీచర్లకు ఇంటర్నెట్‌ సదుపాయం, ఇతర డిజిటల్‌ డివైజ్‌లు అందుబాటులో ఉండాలి. అలాగే ఇంగ్లిష్‌ బోధిస్తున్న వారిని గుర్తించి డీఈవోలు, ఏపీవోలు ఈనెల 5లోపు జాబితా పంపించాలని సమగ్ర శిక్ష  ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు