అమరరాజా లెడ్‌తో.. అంతులేని వ్యథ

16 Jul, 2021 07:58 IST|Sakshi

కాలుష్య రక్కసితో ఊళ్లకు ఊళ్లు విలవిల 

చర్మ వ్యాధులతో నరకయాతన 

చుట్టుపక్కల చెరువులనూ మింగేసిన ఫ్యాక్టరీ 

ఫలితంగా బోర్ల నుంచి బురద నీరు 

హైకోర్టు చీవాట్లు పెట్టినా చీమకుట్టినట్టూ లేని యాజమాన్యం

సాక్షి ప్రతినిధి, తిరుపతి: సరిగ్గా తిరుపతి పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరకంబాడి పంచాయతీలో 1985లో తొలిసారిగా అమరరాజా పవర్‌ సిస్టం లిమిటెడ్‌ను నెలకొల్పిన యాజమాన్యం.. తర్వాతి కాలంలో అమరరాజా బ్యాటరీస్‌ ఇండస్ట్రీస్, మంగళ్‌ ఇండ్రస్టీస్‌ లిమిటెడ్‌ను నెలకొల్పి వ్యాపార సామ్రాజ్యాన్ని భారీగా విస్తరించుకుంది. ఇదంతా బాగానే ఉన్నా.. సదరు ఫ్యాక్టరీల నుంచి వచ్చే విషవాయువులు, జల కాలుష్యం గురించి కనీస మాత్రంగా కూడా పట్టని యాజమాన్య నిర్లక్ష్య ధోరణే ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవుతోంది. స్వయంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఫ్యాక్టరీలో లెడ్, ఇతర కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్నందున దానిని మూసి వేయాలన్న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు ఈమధ్యనే విచారించింది. అమరరాజా ఫ్యాక్టరీలో లెడ్‌ శాతం ప్రమాదకరంగా ఉందని కాలుష్య నియంత్రణ మండలితోపాటు హైదరాబాద్‌లోని కేంద్రప్రభుత్వ సంస్థ ఎన్విరాన్మెంట్‌ ప్రొటెక్షన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఈపీటీఆర్‌ఐ) నివేదిక స్పష్టం చేసిన విషయాన్ని హైకోర్టు ప్రముఖంగా ప్రస్తావించింది. ఇకనైనా కాలుష్యశాతం తగ్గించకుంటే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు యాజమాన్యాన్ని హెచ్చరించింది.

హైకోర్టుతో సహా ఎన్ని సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేసినా.. అమరరాజా ఫ్యాక్టరీస్‌ యాజమాన్యానికి చీమకుట్టినట్టు కూడా లేదని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారంటే  వాస్తవ పరిస్థితి అవగతమవుతోంది.ఆ ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్ధాలను దూరప్రాంతాలకు తీసుకువెళ్లి విడిచిపెట్టకుండా చుట్టుపక్కల ఊళ్లలోకి వదిలేయడంతోనే అనర్థాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. యాసిడ్, కెమికల్స్‌ను అక్కడే భూగర్భంలో వదిలేయడంతో భూగర్భజలాలు మొత్తం కలుషి తమైపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య రక్కసి ఫలితంగా గ్రామస్తుల్లో  చాలామందికి ఒళ్లంతా దురదలు,  చర్మవ్యాధులు.. గుళ్లలు, బొబ్బలు, ఆయింట్‌మెంట్‌ వాడినా పోని మచ్చలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు.

ఇదే విషయమై తారకరామానగర్‌కే చెందిన శ్రీనివాసాచారి ‘సాక్షి’తో మాట్లాడుతూ ఫ్యాక్టరీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వేలాదిమంది గ్రామస్తుల ప్రాణాలంటే యాజమాన్యానికి లెక్కేలేదని వ్యాఖ్యానించారు. ఆర్థిక దన్నుతో వ్యవస్థల్ని మేనేజ్‌ చేస్తూ ఇన్నాళ్లూ కాలుష్య శాతం కూడా ఎవరికీ తెలియనివ్వకుండా దాచేశారని ఆరోపించారు. ఇదే ప్రాంతానికి చెందిన మహిళ నాగరత్నమ్మ మాట్లాడుతూ బోరు నీళ్లలో చిలుము వాసన వస్తుందని చెప్పుకొచ్చారు. నీళ్లను వేడి చేస్తే పాత్ర కింద తెల్లగా మడ్డి పేరుకుపోతోందని వాపోయారు. 

రెండు చెరువులు మాయం  
ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యపు భూతంతో గ్రామస్తులు అల్లాడిపోతుంటే... మరోవైపు ఊళ్లలో ఉన్న చెరువులను సైతం మింగేసిన అమరరాజా యాజమాన్యం దందాలతో అక్కడి ప్రజలకు నీటిసౌకర్యం కూడా కరువైంది. తారకరామానగర్‌లోని 137 సర్వే నెంబర్‌లోని 28 ఎకరాల చెరువును చెరబట్టేసిన అమరరాజా ఫ్యాక్టరీ.. మరో నాలుగు ఎకరాల చెరువును పూర్తిగా ధ్వంసం చేసేసింది. చెరువు రూపు రేఖలు మార్చేసి రోడ్లు వేసేసింది. 

                                     

మంచినీటి కోసం బోరింగ్‌ వద్ద వృథాప్రయాస పడుతున్న ఈమె పేరు కల్పన.. గృహిణి, తారకరామానగర్‌ వాసి.. ఊరిలో ఇలాంటి బోర్లు చాలానే ఉన్నా ఎక్కడా మంచినీరు రాదు..  ఊరి చివర సుందరయ్యనగర్‌ సమీపాన ఉన్న ఈ బోరు నీరు చూస్తే పొరబాటున కూడా అవి తాగాలని అనిపించవు. ఎరుపు రంగుతో కూడిన కాలుష్యపు ధార అది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు