పర్యావరణహిత ‘పవర్‌’

14 Aug, 2022 03:59 IST|Sakshi

మార్చి నాటికి విశాఖ ఎన్టీపీసీలో ఎఫ్‌జీడీ ప్రాజెక్టు అందుబాటులోకి..

దక్షిణాదిలోనే తొలిసారిగా రూ.871 కోట్లతో ఏర్పాటు

విద్యుత్‌ ఉత్పత్తిలో కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా నిర్మాణం  

సాక్షి, అమరావతి: పర్యావరణ హిత విద్యుత్‌ ఉత్పత్తి దిశగా రాష్ట్రంలో వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన మొట్టమొదటి ఫ్లూ గ్యాస్‌ డీసల్ఫరైజేషన్‌(ఎఫ్‌జీడీ) ప్రాజెక్టు వచ్చే ఏడాది మార్చి నాటికల్లా విశాఖ నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్టీపీసీ)లో అందుబాటులోకి రానుంది. వ్యవసాయానికి పూర్తిగా సౌర విద్యుత్‌నే వినియోగించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ పవర్‌ ప్లాంటు స్థాపించేందుకు చర్యలు చేపట్టింది.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీలో కాలుష్యాన్ని తగ్గించే విద్యుత్‌ ప్రాజెక్టులు నెలకొల్పడానికి ఉత్సాహం చూపిస్తోంది. ఇందులో భాగంగానే విశాఖ ఎన్టీపీసీలో పర్యావరణ అనుకూల ఎఫ్‌జీడీ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. బొగ్గును కాల్చే ప్రక్రియలో విడుదలయ్యే హానికర వాయువుల తీవ్రతను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. దాదాపు 90 శాతం నిర్మాణం పూర్తయ్యిందని, వచ్చే ఏడాది మార్చి కల్లా అందుబాటులోకి తీసుకువస్తామని ఎన్టీపీసీ అధికారులు తెలిపారు. మొత్తం రూ.871 కోట్ల వ్యయంతో 2 వేల మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ఎఫ్‌జీడీ దక్షిణ భారతదేశంలోనే తొలి ప్రాజెక్టు కావడం విశేషం.

ఎఫ్‌జీడీలతో కాలుష్యానికి అడ్డుకట్ట! 
ఎన్టీపీసీ దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ తరహా ఎఫ్‌జీడీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతోంది. మొత్తం 38 ఎన్టీపీసీ ప్లాంట్లలో 60 గిగావాట్ల సామర్థ్యంతో ఎఫ్‌జీడీలను అందుబాటులోకి తీసుకురావాలనేది తమ లక్ష్యమని కేంద్ర విద్యుత్‌ శాఖ ఇటీవల లోక్‌సభలో వెల్లడించింది. దేశంలోని విద్యుత్‌ ఉత్పత్తిలో దాదాపు 71 శాతం వాటా కలిగిన థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీలు 80 శాతం పారిశ్రామిక ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. దీంతో థర్మల్‌ కేంద్రంలోనే కాలుష్యాన్ని తగ్గించేలా సాంకేతికతను అభివృద్ధి చేశారు.

విశాఖ ప్రాజెక్టులో 143 మీటర్ల పొడవున్న నాలుగు ఎఫ్‌జీడీ చిమ్నీలను ఏర్పాటు చేయడం ద్వారా కాలుష్యానికి అడ్డుకట్ట వేయనున్నారు. ఇవి నేరుగా కర్బన ఉద్గారాలను గాలిలో కలవనివ్వవు. వాటి తీవ్రతను తగ్గించి విడుదల చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు.   

మరిన్ని వార్తలు