వ్యవసాయం.. గ్రామీణాభివృద్ధికి పెద్దపీట

13 Sep, 2021 05:06 IST|Sakshi

వ్యవసాయ మౌలిక వసతుల కల్పన నిధి ఏర్పాటు

‘సాక్షి’ ప్రతినిధితో నాబార్డు సీజీఎం సుధీర్‌కుమార్‌

సాక్షి, అమరావతి: వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్‌ (నాబార్డ్‌) పెద్దపీట వేస్తోందని బ్యాంక్‌ రాష్ట్ర చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సుధీర్‌కుమార్‌ జన్నావర్‌ చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ రంగంలో పంట రుణాలతో పాటు దీర్ఘకాలిక రుణాలు కూడా సహకార బ్యాంకుల ద్వారా ఇప్పించేందుకు చొరవ తీసుకుంటున్నామని తెలిపారు. అతి తక్కువ వడ్డీ రేటుతో వ్యవసాయ మౌలిక వసతుల నిధి నుంచి రుణాలు తీసుకుని పంట కోతల అనంతర పనులకు, గిడ్డంగుల నిర్మాణాలకు వినియోగించుకోవచ్చని రైతులకు సూచించారు. ఆదివారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

వ్యవసాయ మౌలిక వసతుల కల్పనకు రుణాలు
వివిధ కారణాల వల్ల వ్యవసాయ రంగానికి దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు వెనుకబడ్డాయి. ఈ రంగంలో మౌలిక వసతులు ఏర్పడాలంటే దీర్ఘకాలిక రుణాలు అవసరం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల బ్యాంకర్ల సమావేశంలో అదే విషయం చెప్పారు. ఆయన విజ్ఞప్తి మేరకు నాబార్డ్‌ ఏం చేయగలుగుతుందనే దానిపై చర్చిస్తున్నాం. నాబార్డ్‌ ఆధ్వర్యంలో రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక వసతుల నిధి (ఏఐఎఫ్‌) ఏర్పాటైంది. దీని నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ నిధిని పంట కోతల అనంతర కార్యకలాపాలు అంటే ధాన్యం నిల్వ కోసం గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజీలు, వేర్‌ హౌస్‌లు, అదనపు విలువ జోడింపు గదులు వంటి వాటి కోసమే ఇస్తారు.

324 ఎఫ్‌పీవోలకు ప్రోత్సాహం...
రాష్ట్రంలో ప్రస్తుతం 324 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను (ఎఫ్‌పీవోలు) ప్రోత్సహిస్తోంది. వీటిలో 259 సంఘాలు రిజిస్టర్‌ అయ్యాయి. ఇవి చాలా పురోగతిని సాధిస్తున్నాయి. ఆ సంఘాలు తమ ఉత్పత్తులను తామే అమ్ముకునే దశకు వచ్చాయి. వీటికి పరపతి సౌకర్యం కూడా బాగుంది. భవిష్యత్‌ అంతా ఎఫ్‌పీవోల పైనే ఆధారపడే పరిస్థితి రావొచ్చు. వర్షాధారిత ప్రాంతాల్లో వాటర్‌ షెడ్‌ పథకాలకు నాబార్డ్‌ అండగా నిలుస్తుంది. 200 వాటర్‌ షెడ్‌ పథకాలను ప్రోత్సహిస్తున్నాం.   

మరిన్ని వార్తలు