రూ.100 కోట్లతో ఎన్‌సీడీసీ ఏర్పాటు

3 Feb, 2022 04:15 IST|Sakshi
ఎన్‌సీడీసీ నిర్మాణం కోసం కేటాయించిన స్థలం

ప్రతిపాదన సిద్ధం చేసిన అధికారులు

ఎయిమ్స్‌కు వెళ్లే రోడ్‌లో రెండెకరాల స్థలం కేటాయింపు

తాడేపల్లి రూరల్‌: దేశం మొత్తం మీద ఏదైనా ఆరోగ్యపరమైన విపత్తులు సంభవించినపుడు వాటి గురించి రీసెర్చ్‌ చేయడం కోసం నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజెస్‌ సెంటర్‌ (ఎన్‌సీడీసీ)ను ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్‌ పరిధిలోని కొలనుకొండ నుంచి ఎయిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లే దారిలో రెండెకరాల స్థలాన్ని ఇందుకోసం గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ కేటాయించారు. సర్వే నం. 372/10 రెండెకరాల భూమిని ఎన్‌సీడీసీ సంస్థకు అప్పగించాలని స్థానిక తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు.  5వ తేదీన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజెస్‌ సంస్థకు ఈ స్థలాన్ని అప్పగించనున్నట్లు సమాచారం. కాగా, రూ.100 కోట్ల వ్యయంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మించే ఈ ప్రాజెక్ట్‌ వల్ల ఎంతోమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. 

రెండెకరాల స్థలం కేటాయించాం..
ఎన్‌సీడీసీ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు స్థలం కావాలని ప్రతిపాదనలు పంపింది. జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ çఆదేశాల మేరకు ఎయిమ్స్‌కు వెళ్లే రహదారిలోని జాతీయ రహదారి వెంబడి 2 ఎకరాల స్థలాన్ని కేటాయించాం. త్వరలోనే ఎన్‌సీడీసీకి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు  అందజేస్తాం.
– తహసీల్దార్‌ శ్రీనివాసులు రెడ్డి 

మరిన్ని వార్తలు