ఎటుచూసినా సంబరమే

3 Feb, 2022 04:11 IST|Sakshi
విశాఖ: ర్యాలీలో పాల్గొన్న జీవీఎంసీ మేయర్‌ హరివెంకటకుమారి, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్, ప్రజలు

సాక్షి నెట్‌వర్క్‌: కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇంకా ర్యాలీలు, క్షీరాభిషేకాలు ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతున్నాయి. విశాఖ ఆర్కే బీచ్‌లో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జీవీఎంసీ మేయర్‌ గొలగాని హరివెంకట కుమారి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్, ప్రజలు పాల్గొన్నారు.

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం 
ఇక సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచినందుకు కృతజ్ఞతగా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ‘జగనన్న వరం.. సర్వేపల్లి జననీరాజనం’ పేరిట వారం రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం మనుబోలు జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సీఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. 

అన్నమయ్య జిల్లాకు మద్దతుగా ర్యాలీ
ప్రస్తుతమున్న చిత్తూరు జిల్లాలో కొత్తగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లాకు మద్దతుగా ‘థాంక్యూ సీఎం సార్‌’.. అంటూ కలికిరి పట్టణంలో బుధవారం ప్రజలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అందరికీ ఆమోదయోగ్యంగా రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం శుభపరిణామమన్నారు. అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.  

మరిన్ని వార్తలు