పేదల ఇళ్లలో నాణ్యతకు పెద్దపీట

3 Jan, 2021 04:52 IST|Sakshi

మొదటి దశలో రూ.28,080 కోట్లతో 15.60 లక్షల ఇళ్లు  

పరికరాల సరఫరా కోసం రివర్స్‌ టెండరింగ్‌  

వేగంగా నిర్మాణం కోసం సిబ్బంది సర్దుబాటు  

ప్రత్యేకంగా పర్యవేక్షణ కమిటీల ఏర్పాటు

సాక్షి, అమరావతి: ఎన్నో ఏళ్లుగా పేదలు ఎదురు చూస్తున్న సొంతింటి కల త్వరలో సాకారం కానుంది. రెండేళ్లలో పేదల కోసం ప్రభుత్వం 28 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టనుంది. ఇందులో భాగంగా మొదటి దశలో రూ.28,080 కోట్లతో 15.60 లక్షల ఇళ్లు పూర్తి చేసేందుకు అవసరమైన పనులు ప్రారంభమయ్యాయి. గతంలో ఉన్న 224 చదరపు అడుగులకు బదులుగా ప్రస్తుతం కొత్తగా చేపట్టనున్న ఇళ్లను 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న దృష్ట్యా అందుకు అవసరమయ్యే సామగ్రి, ఇతర పరికరాలను రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా కొనుగోలు చేసేందుకు గృహ నిర్మాణ సంస్థ టెండర్లను ఆహా్వనించిన విషయం తెలిసిందే. స్టీల్, ఆర్‌సీసీ డోర్లు, విండో ఫ్రేమ్స్, డోర్‌ షట్టర్స్, పీవీసీ టాయిలెట్‌ డోర్, గ్లేజ్డ్‌ విండో షట్టర్స్, వైట్‌ లైమ్, పెయింట్స్, ఎలక్ట్రికల్‌ కాంపోనెంట్స్, శానిటరీ, నీటి సరఫరా పరికరాలు, ఏసీ షీట్స్, గాల్వాల్యూమ్‌ షీట్స్, మైల్డ్‌ స్టీల్‌ సెక్షన్స్, ఒరిస్సా పాన్‌ ఫ్రీ టాప్‌ సేకరణ కోసం రివర్స్‌ టెండరింగ్‌ ప్రాసెస్‌ ద్వారా టెండర్లు పిలిచారు. నాణ్యతతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు అధికారులు ఏర్పాటు చేసిన ప్రీ–బిడ్‌ సమావేశాలు ఈ నెల 2వ తేదీతో ముగియనున్నాయి.  

మండలాల వారీగా బాధ్యతలు 
► నిర్ణీత సమయంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు వీలుగా ఖాళీగా ఉన్న స్థానాల్లో టెక్నికల్‌ సిబ్బందిని సర్దుబాటు చేస్తున్నారు. డివిజనల్‌ ఇంజనీర్‌ స్థాయి నుండి అసిస్టెంట్‌ ఇంజనీర్, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లకు అవసరమైతే మరికొన్ని మండలాల బాధ్యతలను అప్పగించేలా గృహ నిర్మాణ శాఖ అధికారులు అంతర్గతంగా ఆదేశాలు జారీ చేశారు. 
► సగం జిల్లాల్లో ఇప్పటికే సిబ్బంది సర్దుబాటు పని పూర్తి చేసి, ఇళ్ల నిర్మాణాలకు సిద్ధమయ్యారు.  మరికొంత మందికి పదోన్నతులు కూడా కల్పించారు. పునాదుల కోసం మార్కింగ్‌ వేయడం మొదలు.. ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు సిబ్బంది క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. 
► ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం పేదల కోసం నిర్మించే ప్రతి ఇంటిలో ఒక బెడ్‌ రూమ్, లివింగ్‌ రూమ్, కిచెన్, వరండా, టాయిలెట్, సింటెక్స్‌ ట్యాంక్, రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌ లైట్లు, రెండు ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేస్తారు.  

నాణ్యత పరిశీలనకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు 
► ఇళ్ల నిర్మాణానికి వినియోగించే పరికరాల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేశారు.  
► గృహ నిర్మాణ శాఖ అధికారులే కాకుండా ఇతర శాఖలకు చెందిన సిబ్బంది కూడా ఈ కమిటీలో ఉంటారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా స్థాయిలో కలెక్టర్‌ కమిటీలకు చైర్మన్లుగా వ్యవహరిస్తారు.  

ప్రతి 25 ఇళ్లకు ఒక క్లస్టర్‌  
– అజయ్‌ జైన్, ముఖ్యకార్యదర్శి, గృహ నిర్మాణశాఖ   
ఇళ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రతి 25 ఇళ్లను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి, క్షేత్ర స్థాయిలో పరిశీలన కోసం ఒక కమిటీ వేస్తాం. కమిటీ పర్యవేక్షణలోనే ఆ 25 ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. కొత్తగా నిర్మించే ప్రతి లే అవుట్‌ వద్ద గృహ నిర్మాణానికి ఉపయోగించే వస్తువులను డిస్‌ ప్లే చేస్తాం. వాటి వివరాలను, ధరలను తెలియజేసే పట్టికనూ అందుబాటులో ఉంచుతాం. నాణ్యతపై ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చాం. 

మరిన్ని వార్తలు