36వేల మందికి పైగా.. అవ్వా తాతలకు కంటి శస్త్రచికిత్సలు

6 Apr, 2021 03:31 IST|Sakshi

వీరందరికీ శస్త్ర చికిత్సలు పూర్తి

మొత్తం 7.29 లక్షల మంది వృద్ధులకు పరీక్షలు

3.40 లక్షల మందికి అద్దాలు అవసరమని గుర్తింపు

వీరిలో 2.03 లక్షల మందికి పంపిణీ

కంటివెలుగు నిమిత్తం 230 మంది నియామకం

సాక్షి, అమరావతి: అంధత్వ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రారంభమైన అందరికీ ఉచిత కంటి పరీక్షల కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం రూ.560 కోట్లతో వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రెండు దశల్లో స్కూలు పిల్లల కంటి పరీక్షలు పూర్తికాగా.. మూడో దశలో 60 ఏళ్లు పైబడిన 7,29,266 మందికి ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించారు. ఇందులో 3,40,535 మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించడంతోపాటు వారిలో 2,03,483 మందికి వాటిని ఇప్పటికే పంపిణీ చేశారు. అలాగే, 72,416 మందికి కంటి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించగా వీరిలో 36,261 మందికి వాటిని నిర్వహించారు. అంటే 50 శాతం పైగా శస్త్ర చికిత్సలను పూర్తిచేశారు.
 
నిజానికి.. రాష్ట్రంలోని 60 ఏళ్లు పైబడిన 56,88,420 మంది అవ్వా తాతలకు ఉచితంగా కంటి వైద్య సేవలను అందించే కార్యక్రమాన్ని గత ఏడాది ఫిబ్రవరి 18న కర్నూలులో సీఎం జగన్‌ ప్రారంభించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే, లాక్‌డౌన్‌ నేపథ్యంలో గత ఏడాది మార్చి నెలాఖరు నుంచి అవ్వాతాతల కంటి వెలుగు పరీక్షలు నిలిచిపోయాయి. కరోనా ప్రభావం తగ్గడంతో గత ఏడాది నవంబరు 2 నుంచి కోవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలను తిరిగి ప్రారంభించారు. మిగతా వారికి కూడా వీలైనంత త్వరగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి శస్త్ర చికిత్సలను పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

అవ్వా తాతలందరికీ కంటివెలుగు
కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ప్రభుత్వాసుపత్రులు, ఎన్‌జీఓ కంటి ఆసుపత్రుల్లో మిగతా వారికి శస్త్ర చికిత్సలు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. శంకర నేత్రాలయం, ఎల్‌వీ ప్రసాద్‌ ఆసుపత్రుల్లో అవ్వా తాతలకు కంటి శస్త్ర చికిత్సలను చేయిస్తున్నాం. అలాగే, ఈ కార్యక్రమం కోసం ఇప్పటివరకు 230 మంది పారామెడికల్‌ ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్లను నియమించాం. త్వరలోనే మరికొంత మందిని నియమించేందుకు నోటిఫికేషన్‌ ఇస్తున్నాం. 
– డా. హైమావతి, నోడల్‌ అధికారి, వైఎస్సార్‌  కంటివెలుగు కార్యక్రమం 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు