సరికొత్తగా.. తైవాన్‌ నిమ్మ

21 Oct, 2022 12:39 IST|Sakshi

ప్రస్తుతానికి స్వల్ప విస్తీర్ణంలోనే.. 

ఏడాది మొత్తం దిగుబడి ఇంకా రైతులకు సూచించని శాస్త్రవేత్తలు

తైవాన్‌ జామ.. దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రస్తుతం పల్లెల్లో ప్రాచుర్యంలోకి వచ్చి రైతులు సాగు చేస్తున్నారు. మంచి దిగుబడి సాధించి లాభాలు ఆర్జిస్తున్నారు. అయితే తైవాన్‌ నిమ్మ సాగు గురించి ఎవరికీ పెద్దగా తెలిసి ఉండదు. రైతులు ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకుని సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు సాగుకు శ్రీకారం చుట్టగా మరికొందరు మొక్కలను తీసుకొచ్చి నాటే పనిలో ఉన్నారు.

పొదలకూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో సైదాపురం, పొదలకూరు, వెంకటగిరి, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో తైవాన్‌ నిమ్మ సాగు తక్కువ విస్తీర్ణంలో జరుగుతోంది. సాధారణ నిమ్మతోటల్లో రెండు నెలలు కాపు కాస్తే మరో రెండు నెలలు ఉండదు. తైవాన్‌ రకం సాగు చేస్తే ఏడాది పొడవునా దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. చెట్టుకు ఓ వైపు కాయలు ఉంటే మరో వైపు పూత ఉంటుంది. గుత్తులుగా కాపు ఉంటే కోసేందుకు కూలీలకు సులువుగా ఉంటుంది. సాధారణ నిమ్మతోటల్లో మూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత దిగుబడి వస్తే తైవాన్‌ రకం నిమ్మకు సంబంధించి ఏడాది పూర్తయిన వెంటనే దిగుబడి ప్రారంభమవుతుంది. సాధారణ రకం ఎకరానికి 100 మొక్కలు పడితే తైవాన్‌ రకంలో 300 మొక్కలు నాటుకునేందుకు అవకాశం ఉంది. ఫలితంగా చిన్నా సన్నకారు రైతు కూడా దిగుబడిని పెంచుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం కడియం, అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నుంచి రైతులు తైవాన్‌ నిమ్మ మొక్కను రూ.100 వెచ్చించి తీసుకొస్తున్నారు. 

గుర్తింపు లేదు 
తైవాన్‌ సాగుకు సంబంధించి రైతులకు ఉద్యాన శాఖ అధికారులు, నిమ్మ శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు ఇవ్వడంలేదు. ప్రభుత్వ పరంగా గుర్తింపు లేకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించిన తర్వాతే ఈ నిమ్మ సాగుపై స్పష్టత వస్తుంది. పొదలకూరు మండలం పార్లపల్లిలో రెండెకరాల్లో ఓ రైతు తైవాన్‌ నిమ్మ సాగు చేస్తున్నారు. అలాగే పులికల్లు, వావింటపర్తి, ప్రభగిరిపట్నం, కనుపర్తి గ్రామాల్లో సాగు చేసేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. 

మార్కెటింగ్‌ ఎలా? 
తైవాన్‌ నిమ్మ దిగుబడి వస్తే మార్కెటింగ్‌ చేసుకునే విషయంలో సమస్యలు ఎదురవుతాయని  రైతులు భావిస్తున్నారు. పొదలకూరు ప్రభుత్వ నిమ్మ మార్కెట్‌ యార్డుకు ఎగుమతుల్లో రాష్ట్రస్థాయిలో పేరుంది. ఇక్కడి నుంచి ప్రతినిత్యం పదుల సంఖ్యలో లారీల్లో ఢిల్లీ మార్కెట్‌కు ఎగుమతులు జరుగుతుంటాయి. అక్కడి వ్యాపారులు తైవాన్‌ నిమ్మను స్వీకరిస్తారా? లేదా? అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాగు చేసేందుకు సమాయత్తమవుతున్న రైతులు వ్యాపారులతో చర్చిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆసక్తి ఉంది 
సాధారణ రకం నిమ్మ సాగు కంటే తైవాన్‌ నిమ్మ సాగుపై ఆసక్తి పెరిగింది. పార్లపల్లికి వెళ్లి తోటను పరిశీలించాను. సాగుకు అనుకూలంగానే ఉండడంతోపాటు యాజమాన్య పద్ధతుల ఖర్చు తక్కువగా ఉంది. ప్రస్తుతం ఒక ఎకరాలో సాగు చేసి దిగుబడి, మార్కెటింగ్‌ సమస్యలు లేకుంటే విస్తీర్ణం పెంచుతాను.  
– సీహెచ్‌ రమేష్, రైతు, నావూరుపల్లి 

అవగాహన లేదు 
తైవాన్‌ నిమ్మకాయలు ఇప్పటి వరకు మార్కెట్‌కు రాలేదు. పూర్తిగా అవగాహన కూడా లేదు. నిమ్మ మార్కెట్‌ను శాసించే ఢిల్లీ మార్కెట్‌ వ్యాపారులు ఈ రకాన్ని తీసుకుంటారో లేదో తెలియదు. మార్కెట్‌కు వస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. 
– ఎం.బాలకృష్ణారెడ్డి, నిమ్మమార్కెట్‌ వ్యాపారి, పొదలకూరు 

స్వల్పంగా సాగు చేస్తున్నారు 
తైవాన్‌ నిమ్మ రకం సాగు స్వల్పంగా ఉంది. పార్లపల్లిలో రెండెకర్లో సాగు చేస్తుండగా, మరో ఐదారు గ్రామాల రైతులు మొక్కలు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. వాటి చీడపీడలపై అవగాహన కోసం నిమ్మ శాస్త్రవేత్తలతో మాట్లాడాం. వారు పరిశోధనలు చేస్తున్నామని ఇప్పటికిప్పుడు సాగు చేసుకోవచ్చని చెప్పలేమన్నారు. సాధారణ నిమ్మ సాగులా తైవాన్‌ రకం కూడా ఎలాంటి నేలల్లోనైనా వస్తుంది. కాయ సైజు కూడా సాధారణ రకం కంటే పెద్దదిగా ఉంటుంది. 
– ఈ.ఆనంద్, ఉద్యానాధికారి, పొదలకూరు

మరిన్ని వార్తలు