కరోనా వ్యాప్తి నియంత్రణలో ఫీవర్ సర్వే కీలక పాత్ర

19 Jun, 2021 19:37 IST|Sakshi

ముఖ్యమంత్రి ఆదేశాలపై ఇప్పటి వరకు 13 సార్లు ఇంటింటికీ సర్వే

ప్రజల్లో చైతన్యం కలిగించడంలో విశేష కృషి

రెండోవేవ్‌లో 8 సార్లు ఇంటింటి ఫీవర్ సర్వే

రాష్ట్ర వ్యాప్తంగా 1.50 కోట్ల ఇళ్ళలో సర్వే పూర్తి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. కరోనా సంక్షోభం ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి తక్షణం స్పందించి వైద్య, ఆరోగ్యశాఖను అప్రమత్తం చేశారు. అధికారులతో తీసుకోవాల్సిన చర్యలపై నిత్యం స్వయంగా సమీక్షలు నిర్వహించారు. కోవిడ్ వ్యాప్తిని నియంత్రించడానికి, వైరస్‌ బారిన పడిన వారిని తక్షణం గుర్తించడానికి ప్రభుత్వ పరంగా చేపట్టిన చర్యలు కరోనాను కట్టడి చేయడానికి ఉపకరించాయి.

క్షేత్రస్థాయిలోకి పాలనను చేరువ చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్ తీసుకువచ్చిన పాలనాపరమైన మార్పులు కూడా సంక్షోభ సమయంలో ప్రజలకు సత్వర సేవలందించేందుకు కారణమయ్యాయి. ప్రతి రెండువేల జనాభాకు ఒక గ్రామ, వార్డు సచివాలయంను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సచివాలయాల పరిధిలో ఫీవర్ క్లీనిక్స్‌ను ప్రారంభించిన ప్రభుత్వం కరోనా విపత్తులో ఇంటింటి సర్వేలను విజయవంతంగా నిర్వహించింది. కరోనా సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13 సార్లు ఇంటింటి ఫీవర్ సర్వేలు నిర్వహించారు. 

రెండోవేవ్‌ సమయంలో 8 సార్లు ఇంటింటి సర్వే
కరోనా మొదటి వేవ్ సమయంలో దీనిని ఎలా ఎదుర్కోవాలో అర్థం చేసుకునేందుకే ప్రపంచ వ్యాప్తంగా వైద్యనిపుణులు ఇబ్బంది పడ్డారు. అందుబాటులో ఉన్న అన్ని పద్దతులను అమలులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో మన రాష్ట్రంలో సీఎం జగన్ కరోనా నియంత్రణకు ఇంటింటి సర్వేను ముమ్మరంగా నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. దీనిపై నిరంతరం సమీక్షలు నిర్వహించారు. ప్రతిసారీ ఫీవర్ సర్వే ఫలితాలను సమీక్షా సమావేశాల్లో విశ్లేషించారు. ఫీవర్ సర్వే అనేది నిరంతరం జరిగే ప్రక్రియగా తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేంది లేదని పలుసార్లు సీఎం అధికారులను హెచ్చరించారు.

రెండో వేవ్ కరోనా సమయంలో వైద్యపరంగా వైరస్‌ కట్టడికి అనుసరించాల్సిన విధానాలపై శాస్త్రీయంగా వచ్చిన అన్ని విధానాలను ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. మొదటి వేవ్ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 5 సార్లు ఫీవర్ సర్వే నిర్వహిస్తే, రెండో వేవ్‌ సమయంలో 8 సార్లు రాష్ట్రంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. అంతేకాదు కరోనా తగ్గుతోందనే ఉదాసీనత పనికిరాదని, తమకు వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్నాయన్న ప్రతి ఒక్కరికీ ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లు చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 

సచివాలయ స్థాయిలో ఫీవర్ క్లీనిక్స్‌
సచివాలయ స్థాయిలో ఏర్పాటైన ఫీవర్ క్లీనిక్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల మంది ఆశా వర్కర్లు, 19 వేల మంది ఎఎన్‌ఎంలు, దాదాపు 2.66 లక్షల మంది వాలంటీర్లు ఈ ఫీవర్ సర్వే నిర్వహించారు. ఆయా సచివాలయాల పరిధిలో ముందుగా ఆశావర్కర్లు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి కుటుంబాల్లోని సభ్యుల ఆరోగ్య పరిస్థితిపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో జ్వరంతో పాటు ఇతర కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉంటే తక్షణం సచివాలయ పరిధిలోని ఎఎన్‌ఎం, మెడికల్ ఆఫీసర్‌లకు సమాచారం అందిస్తున్నారు.

వెంటనే ఎఎన్‌ఎం, మెడికల్ ఆఫీసర్ సదరు ఇంటిని సందర్శించి, అక్కడికక్కడే వారికి కోవిడ్ నిర్ధారిత పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో కోవిడ్ పాజిటీవ్ వచ్చిన వారిని గుర్తించి, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండి, ఇంటిలో ఐసోలేషన్ వసతి ఉందని తేలితే వారికి ఉచితంగా మందుల కిట్‌లను అందిస్తున్నారు. ఐసోలేషన్‌ వసతి లేని వారిని సమీపంలోని కోవిడ్ కేర్ సెంటర్‌కు తరలించడం, ఆరోగ్య పరిస్థితి బాగోలేని వారిని ఆసుపత్రికి అంబులెన్స్‌ ద్వారా పంపించడం చేస్తున్నారు. అంతేకాకుండా కోవిడ్ పాజిటీవ్ పేషెంట్ల వివరాలను కమాండ్ కంట్రోల్ రూంకు అందించడం ద్వారా వైద్యులు నిత్యం హోం ఐసోలేషన్‌లో ఉన్న వారితో ఫోన్‌లో అందుబాటులో ఉండి, వారి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించడం చేస్తున్నారు. అంతే కాకుండా స్థానిక ఎఎన్‌ఎం, మెడికల్ ఆఫీసర్లు కూడా నిత్యం పేషంట్ల ఆరోగ్యంపై ఫోన్‌ ద్వారా పర్యవేస్తుంటారు. 

హోం ఐసోలేషన్‌లో ఉన్న అందరికీ ఉచితంగా మందుల కిట్లు
రాష్ట్ర వ్యాప్తంగా 1,63,62,671 నివాసాలు ఉండగా వాటిల్లో కరోనా రెండో వేవ్‌లో 1,50,13,669 ఇళ్ళలో ఫీవర్ సర్వే జరిగింది. మొత్తం 92,364 మంది వైరస్ లక్షణాలు ఉన్న అనుమానితులను గుర్తించారు. వారిలో 88,657 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, 10,729 మంది పాజిటీవ్ పేషెంట్లను గుర్తించారు. కరోనా విపత్తు ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి ప్రభుత్వమే ఉచితంగా మందుల కిట్‌లను ఇవ్వాలన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు కోవిడ్ పేషెంట్లుకు ఉచితంగా మందుల కిట్‌లను పంపిణీ చేశారు.

కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీసుకున్న అన్ని చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. అంతేకాకుండా ఫీవర్ సర్వే వల్ల ప్రజల్లో తమ ఆరోగ్యం పట్ల చైతన్యాన్ని కలిగించారు. కోవిడ్ వైరస్ ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు, వైద్య సహాయం కోసం అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకునేలా ప్రజల్లో అవగాహనను కల్పించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్ విధానాన్ని సమర్థంగా అమలు చేయడం వల్ల కోవిడ్ వంటి విపత్కర పరిస్థితిని కూడా ప్రభుత్వం సవాల్‌గా తీసుకుని మరీ ఎదుర్కొంది.

చదవండి: ఏపీలో స్థిరంగా తగ్గుతున్న కరోనా కేసులు
తగ్గిందని అలసత్వం వద్దు

మరిన్ని వార్తలు