రమ్య కుటుంబానికి ఐదు సెంట్ల ఇంటి స్థలం

12 Sep, 2021 04:37 IST|Sakshi

గుంటూరు ఈస్ట్‌: మృగాడి చేతిలో హత్యకు గురైన రమ్య కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో ఐదు సెంట్ల నివేశన స్థలం మంజూరైంది. ఇంటి స్థలం పట్టాను శనివారం హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత పరమాయ కుంటలోని రమ్య నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేశారు. గుంటూరు రూరల్‌ మండలం ఏటుకూరు గ్రామంలోని 5 లే అవుట్‌లో స్థలాన్ని కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడుతూ  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎంతగానో స్పందించి..  రమ్య కుటుంబానికి అండగా అనేక చర్యలు చేపట్టారని చెప్పారు. రమ్య తల్లిదండ్రులు కోరిన విధంగా నిందితుడికి త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని వివరించారు. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ ప్రకారం రమ్య తల్లిదండ్రులకు త్వరలో ఐదెకరాల భూమిని ప్రభుత్వం అందజేస్తుందని స్పష్టం చేశారు. వచ్చే సంవత్సరం రమ్య సోదరి మౌనిక డిగ్రీ పూర్తవుతుందని, అయితే మానవీయ కోణంలో సీఎం సూచన మేరకు డిగ్రీ పూర్తికాక ముందే సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగం ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రమ్య కుటుంబానికి అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో సహాయం అందజేశాక, వారితో కలిసి టీ తాగుతానని సీఎం చెప్పారని వివరించారు.

అందరూ దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి
ప్రతి మహిళ, యువతి సహా పురుషులు సైతం ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, అనుకోని ఘటనలు జరిగినప్పుడు పోలీసుల సాయం కోరవచ్చని హోం మంత్రి సూచించారు. మేడికొండూరు ఘటనలో పోలీసులు సమర్థవంతంగా విచారణ చేస్తున్నారని, ఆ విషయాలు బయటపెడితే నేరస్తుడు తప్పించుకునే అవకాశం ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. రమ్య ఘటనలో సీఎం స్పందించిన తీరు తమందరి హృదయాల్లో నిలిచి పోతుందన్నారు. అట్రాసిటీ యాక్ట్‌లో పేర్కొన్న పరిహారం కన్నా ఎక్కువగా సహాయం చేయడం సీఎం గొప్పతనాన్ని చాటిందన్నారు. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా.. అంటూ గత ప్రభుత్వ పెద్దలు చేసిన వ్యాఖ్యలు ఎవరూ మరచిపోలేదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా, మద్దాళి గిరిధర్, జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్, జీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము),  తూర్పు తహసీల్దారు శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు