అమ్మ తపనే ఆయువై..

12 Jun, 2022 05:04 IST|Sakshi

బీచ్‌ రోడ్డు (విశాఖ తూర్పు): సముద్ర కెరటాలకు కొట్టుకుపోయిన బాలిక మృత్యువును జయించింది. ఒడిశాలోని రాయగడకు చెందిన ఓ కుటుంబం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌కు వచ్చింది. ఆ కుటుంబంలోని తొమ్మిదేళ్ల బాలిక అలేఖ్య సముద్రంలోకి దిగి కేరింతలు కొడుతుండగా కెరటాలకు కొట్టుకుపోయింది. వెంటనే స్థానికులు గమనించి మునిగిపోయిన బాలికను ఒడ్డుకు తీసుకొచ్చారు.

అప్పటికే బాలిక నీళ్లు తాగి స్పృహ కోల్పోయింది. నోటి వెంట నురగలు వచ్చాయి. దీంతో బాలికను చూసి ఆమె తల్లిదండ్రులు ఆశలు వదిలేసుకున్నారు. ఇంతలో స్థానిక యువకులు బాలికకు ప్రథమ చికిత్స చేశారు. కడుపు, ఛాతీ మీద గట్టిగా రుద్దినా చిన్నారిలో కదలిక రాలేదు.

బాలిక తల్లి గట్టిగా హత్తుకున్న క్రమంలో ఒక్కసారిగా స్పృహ రావడంతో వారి ఆనందానికి అవధులు లేవు. వెంటనే చికిత్స నిమిత్తం బాలికను కేజీహెచ్‌కు తరలించారు. తమ కంటిపాపను కాపాడిన స్థానికులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు