సహజ మార్గంలోకి గోదావరి ప్రవాహం

13 Jun, 2021 02:26 IST|Sakshi
సహజ మార్గంలోకి ప్రవేశించిన గోదారమ్మ

అప్రోచ్‌ చానల్, పోలవరం స్పిల్‌వే మీదుగా 6.6 కిలోమీటర్ల పొడవున దారి మళ్లింపు

స్పిల్‌ చానల్, పైలట్‌ చానల్‌ నిండటంతో సహజ మార్గంలోకి ప్రవేశించిన గోదారమ్మ

ధవళేశ్వరం బ్యారేజీ వైపు దూసుకెళ్తున్న ప్రవాహ జలాలు

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు వద్ద ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంతో గోదావరి సహజ ప్రవాహ మార్గానికి అడ్డుకట్ట వేసి.. సింగన్నపల్లి ఎగువన అప్రోచ్‌ చానల్, స్పిల్‌ వే, స్పిల్‌ చానల్, పైలట్‌ చానల్‌ మీదుగా మళ్లించిన గోదావరి ప్రవాహం శనివారం పోలవరానికి దిగువన నదీ సహజ మార్గంలోకి ప్రవేశించింది. ప్రవాహ జలాలు ధవళేశ్వరం బ్యారేజీ వైపు దూసుకెళ్తున్నాయి. దీంతో ఈ నెల 15న గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేయడానికి మార్గం సుగమమైంది. పోలవరం ప్రాజెక్టులో 194.6 టీఎంసీలను నిల్వ చేయడానికి వీలుగా చేపట్టిన ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) నిర్మాణానికి వీలుగా గోదావరిని స్పిల్‌వే వైపు మళ్లించేందుకు ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను ప్రభుత్వం నిర్మించింది.

స్పిల్‌వే వైపు గోదావరిని మళ్లించేందుకు అప్రోచ్‌ చానల్‌ తవ్వకం పనులు కొలిక్కి రావడంతో శుక్రవారం అడ్డుకట్టను తెంచి.. 2.18 కి.మీ. పొడవున తవ్విన అప్రోచ్‌ చానల్‌ మీదుగా ప్రవాహాన్ని దారి మళ్లించారు. సుమారు పది వేల క్యూసెక్కుల ప్రవాహం రివర్‌ స్లూయిజ్‌ల ద్వారా స్పిల్‌ చానల్‌కు చేరుతోంది. 4.42 కి.మీ. పొడవున ఉన్న స్పిల్‌ చానల్, పైలట్‌ చానల్‌ నిండితేనే గోదావరి ప్రవాహం సహజ మార్గంలోకి ప్రవేశిస్తుంది. ఈ చానళ్లు నిండాలంటే కనీసం ఒక టీఎంసీకి పైగా అవసరం. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్పిల్‌ చానల్, పైలట్‌ చానల్‌ నిండటంతో ప్రవాహం తిరిగి సహజ మార్గంలోకి ప్రవేశించింది.

కాఫర్‌ డ్యామ్‌కు ఎగువన సహజ మార్గం నుంచి అప్రోచ్‌ చానల్, స్పిల్‌వే, స్పిల్‌ చానల్, పైలట్‌ చానల్‌ మీదుగా 6.6 కి.మీ. పొడవున దారి మళ్లిన గోదావరి 24 గంటలపాటు ప్రవహించి తిరిగి సహజ మార్గంలోకి ప్రవేశించడం గమనార్హం. పైలట్‌ చానల్‌ ద్వారా సుమారు 10 వేల క్యూసెక్కులు ప్రవాహం సహజ మార్గం మీదుగా ధవళేశ్వరం బ్యారేజీ వైపు వెళుతోంది. ఆదివారం సాయంత్రానికి ప్రవాహం ధవళేశ్వరం బ్యారేజీని చేరుతుంది. గోదావరి పరీవాహక ప్రాంతంలో ప్రధానంగా ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో రోజురోజుకూ ప్రవాహ ఉద్ధృతి పెరగనుంది. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ప్రభావం వల్ల నీటిమట్టం 25 అడుగుల ఎత్తు దాటితే.. పోలవరం స్పిల్‌ వే  రేడియల్‌ గేట్ల మీదుగా తొలిసారిగా గోదావరి వరద జలాలు దిగువకు చేరతాయి.  

మరిన్ని వార్తలు