గోదావరి–కావేరి అనుసంధానంపై మళ్లీ కదలిక

22 Oct, 2023 04:11 IST|Sakshi

ఇచ్చంపల్లి వద్దే బ్యారేజీ నిర్మాణానికి నిర్ణయం

నవంబర్‌ 3న హైదరాబాద్‌లో స్టాండింగ్‌ కమిటీ, టాస్క్‌ఫోర్స్‌ భేటీలు

అదే రోజు రాష్ట్రాలకు ఎంఓయూ ముసాయిదాల పంపిణీ

సంబంధిత రాష్ట్రాల సమ్మతి కోసం కేంద్రం ప్రయత్నాలు

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు విషయంలో ముందడుగు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నవంబర్‌ 3న హైదరాబాద్‌లో ఇందుకు సంబంధించిన రెండు కీలక సమావేశాలను నిర్వహించతలపెట్టింది. ఉదయం 11.30 గంటలకు నేషనల్‌ వాటర్‌ డెవలప్‌ మెంట్‌ ఏజెన్సీ(ఎన్‌డబ్ల్యూడీఏ) డైరెక్టర్‌ జనరల్‌ భోపాల్‌ సింగ్‌ ఆధ్వర్యంలో గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై వేసిన స్టాండింగ్‌ కమిటీ ఐదో సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు నదుల అనుసంధానంపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం కూడా చైర్మన్‌ వెదిరే శ్రీరామ్‌ అధ్యక్షతన జరగనుంది.

ఉదయం జరిగే సమావేశంలో మెమోరాండం ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌ (ఎంఓయూ)ముసాయిదాను ఆయా రాష్ట్రాలకు అందజేయనున్నారు. చివరిసారిగా జరిగిన 4వ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో గోదావరిపై ఎక్కడ బ్యారేజీ నిర్మించి నీళ్లను తరలించాలనే అంశంపై ఎన్‌డబ్ల్యూడీఏ ఆధ్వర్యంలో అధ్యయనం జరపా లని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇచ్చంపల్లి వద్దే గోదావరిపై బ్యారేజీ నిర్మించాలని తాజాగా ఎన్‌డబ్ల్యూడీఏ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీనిపై నవంబర్‌ 3న జరగనున్న స్టాండింగ్‌ కమిటీ, టాస్క్‌ఫోర్స్‌ సమావేశాల్లో విస్తృతంగా చర్చించి అన్ని రాష్ట్రాల సమ్మతి పొందాలని ఎన్‌డబ్ల్యూడీఏ భావిస్తోంది.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం వినియోగించుకోని 141 టీఎంసీల గోదావరి జలా లను గోదావరి–కావేరి అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా తరలించాలని గతంలో నిర్ణయం తీసుకోగా, తాజాగా ఆ పరిమాణాన్ని 151 టీఎంసీలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో కర్ణాటక కోటాను 19 టీఎంసీలకు పెంచనున్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం వాడుకోని 151 టీఎంసీల నీళ్లను తరలించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నిరభ్యంతర పత్రం జారీ చేస్తేనే ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లాలని ఇప్పటికే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు కోరాయి. ఈ నేపథ్యంలో నవంబర్‌ 3న జరగనున్న సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయోనన్నది ఆసక్తికరంగా మారింది.  

మరిన్ని వార్తలు