‘జయలక్ష్మి’ పాలకవర్గం రద్దు

24 Jul, 2022 05:06 IST|Sakshi
మహాజన సభలో నియమితులైన అడ్‌హాక్‌ కమిటీ సభ్యులు

చైర్మన్‌ సహా డైరెక్టర్‌లపై మహాజనసభ అనర్హత వేటు

కొత్త పాలకవర్గం ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌.. 10 మంది సభ్యులతో అడ్‌హాక్‌ కమిటీ

సాక్షిప్రతినిధి, కాకినాడ: డిపాజిటర్లకు కుచ్చుటోపీ పెట్టి బోర్డు తిప్పేసిన కాకినాడలోని ది జయలక్ష్మి మ్యూచువల్లీ ఎయిడెడ్‌ మల్టీపర్పస్‌ (ఎంఏఎం) కోఆపరేటివ్‌ సొసైటీ పాలకవర్గం రద్దు అయ్యింది. చైర్మన్‌ సహా 10 మంది డైరెక్టర్‌లపై మహాజనసభ అనర్హత వేటు వేసింది. డిపాజిట్లకు 12.5 శాతం వడ్డీలు ఇస్తామని ఆశ చూపి రాష్ట్రవ్యాప్తంగా 29 బ్రాంచ్‌లలో 19,971 మంది విశ్రాంత ఉద్యోగులు, వ్యాపారులు, సీనియర్‌ సిటిజన్లు ఇలా అన్ని వర్గాల నుంచి రూ.520 కోట్ల వరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేయించారని ప్రాథమికంగా నిర్ధారించారు.

డిపాజిట్ల గడువు ముగిసినా సొమ్ములు చెల్లించకపోవడంతో ‘జయలక్ష్మి’ గత ఏప్రిల్‌ 6న బోర్డు తిప్పేసిన సంగతి వెలుగులోకి వచ్చింది. మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న సొసైటీ పాలకవర్గంపై బాధితుల ఫిర్యాదులతో క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. సీబీసీఐడీ పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. సొసైటీ రికార్డులను అధికారులు సీజ్‌ చేశారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు సహకార శాఖలోని రిజిస్ట్రార్‌లు, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌లు విచారణ చేస్తున్నారు. సొసైటీ నిర్వహణ లేక కుంటుపడుతోందని.. వెంటనే మహాజన సభ ఏర్పాటు చేయాలని డిపాజిటర్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా సహకార అధికారి బీకే దుర్గాప్రసాద్‌కు అందిన లేఖతో శనివారం కాకినాడలో మహాజనసభ ఏర్పాటు చేశారు. ఇందులో పలు తీర్మానాలు ఆమోదించారు.

అడ్‌హాక్‌ కమిటీకి పాలకవర్గం బాధ్యతలు
సుమారు రూ.520 కోట్లు డిపాజిట్లు ఏమయ్యాయో తెలియని పరిస్థితులు, సొసైటీ పరిపాలన మందగించడం, వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు కావడంతో చైర్మన్‌ సహా 10 మంది సభ్యులు డైరెక్టర్‌లుగా కొనసాగే అర్హత లేదని మహాజనసభ నిర్ణయించింది. 30 రోజుల్లోపు పాలకవర్గం మహాజనసభ ఏర్పాటు చేయకపోవడంతో సంఘం బైలా ప్రకారం సభ్యులపై అనర్హత వేటు వేసింది. పరారీలో ఉన్న పాలకవర్గ సభ్యులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా మరో తీర్మానాన్ని ఆమోదించింది.

పాలకవర్గ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ఆర్‌ ఆంజనేయులు, వైస్‌ చైర్‌పర్సన్‌ ఆర్‌బీ విశాలాక్షి, ట్రెజరర్‌ ఏపీఆర్‌ మూర్తి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌.జయదేవ్‌మణి, డైరెక్టర్‌లు.. నాగేశ్వరరావు, ఎం.సత్యనారాయణ, ఎస్‌.చక్రభాస్కరరావు, వి.నరసయ్య, జి.నారాయణమూర్తి, మాజీ ట్రెజరర్‌ డి. వెంకటేశ్వరరావులను పాలకవర్గంలో కొనసాగేందుకు అనర్హులుగా ప్రకటించారు. వీరిని పాలకవర్గం నుంచి తొలగిస్తూ తీర్మానం చేశారు.

తొలగించిన సభ్యుల స్థానంలో సొసైటీ బైలా ప్రకారం కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకునే వరకు ఎటువంటి ఇబ్బంది ఎదురు కాకుండా 10 మందితో అడ్‌హాక్‌ కమిటీని నియమించారు. దీనికి చైర్మన్‌గా వీఎస్‌వీ సుబ్బారావు, సభ్యులుగా.. గోదావరి శ్రీనివాస చక్రవర్తి, ఎండీ మెహబూబ్‌ రెహ్మాన్, పీవీ రమణమూర్తి, అంగర నరసింహారావు, సూరి రామ్‌ప్రసాద్, చింతలపూడి సుబ్రహ్మణ్యం, షేక్‌ జానీ బాషా, ఏవీఎస్‌ రవికుమార్, జ్యోతుల స్వామిప్రసాద్‌లను నియమించారు. కొత్త పాలకవర్గం ఏర్పాటు చేసే వరకు సొసైటీ కార్యకలాపాలను నిర్వహించే బాధ్యతలను అడ్‌హాక్‌ కమిటీకి అప్పగించారు. 

మరిన్ని వార్తలు