రాష్ట్రంలో రెండ్రోజులు మోస్తరు వర్షాలు

3 Dec, 2023 04:06 IST|Sakshi

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం 

ఆదివారం ఉదయానికి తుపానుగా మారే అవకాశం 

ఈనెల 5వ తేదీ నాటికి తీరం దాటనున్న తుపాను 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం ఉదయానికి నైరుతి బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం శనివారం తీవ్ర వాయగుండంగా మారింది. ఇది గంటకు 18 కి.మీ వేగంతో పశ్చిమ–వాయవ్య దిశగా కదిలి నైరుతి బంగాళా ఖాతంలో కేంద్రీకృతమైంది.

పుదుచ్చేరికి తూర్పు–ఆగ్నేయంగా 440 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు–ఆగ్నేయంగా 450 కిలోమీటర్లు, నెల్లూరుకు దక్షిణ–ఆగ్నేయంగా 580 కిలోమీటర్లు, బాపట్లకు దక్షిణ–ఆగ్నేయంగా 670 కిలోమీటర్లు, మచిలీపట్ననికి ఆగ్నేయంగా 670 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా పయనించి, నైరుతి బంగాళాఖాతం వద్ద తుపానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత వాయువ్య దిశగా కదులుతూ 4వ తేదీ తెల్లవారుజాము వరకు దక్షిణ ఆంధ్రప్రదేశ్, దానికి ఆనుకొని ఉన్న ఉత్తర తమిళనాడు సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖతం వరకు చేరుకుంటుందని వివరించింది.

ఆ తర్వాత, ఉత్తరం వైపు కదులుతూ దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరానికి దాదాపు సమాంతరంగా కదులుతూ డిసెంబర్‌ 5వ తేదీ ఉదయానికి నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటు తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 80నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గంటకు ఈదు రు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వివరించింది.  

మరింతగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు 
రాష్ట్రంలోనూ రానున్న రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తా యని తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపు లతో కూడిన వానలు కూడా కురిసే అవకాశం ఉన్న ట్లు సూచించింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, 2 డిగ్రీ సెల్సియస్‌ నుంచి 3 డిగ్రీ సెల్సియస్‌ మేర గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వివరించింది. శనివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత హన్మకొండలో 33.5 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 16.0 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. 

మరిన్ని వార్తలు