ఎరువుల అక్రమ రవాణాకు చెక్‌

13 Sep, 2023 03:51 IST|Sakshi

వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ హరికిరణ్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రా­నికి కేటా­యించిన ఎరు­వులు ఇతర రాష్ట్రా­లకు అనధికారిక రవాణా జరగ­కుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్టు వ్యవ­సాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ చేవూరు హరికిరణ్‌ వెల్లడించారు. మంగళగిరిలోని వ్యవసాయ కార్యా­లయం నుంచి జిల్లా, మండల వ్యవసాయ అధికా­రులతో మంగళ­వారం నిర్వహించిన వీడియో కాన్ఫ­రెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. సరిహద్దు జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాలకు ఎరువుల రవాణా జరుగు­తు­న్నట్టు గుర్తించామన్నారు.

దీనికి అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయ, పోలీస్‌ శాఖలతో సంయుక్త బృందాలను ఏర్పాటు చేశామన్నారు. విజి­లెన్స్‌ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) సహ­కారంతో సరి­హద్దు ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా ఏర్పా­టు చేశామన్నారు. కేటాయింపుల మేరకు రాష్ట్రానికి వచ్చే ప్రతి ఎరువు బస్తాను ఐఎఫ్‌ఎంఎఎస్‌ ద్వారా రికార్డు చేయాలని అధికా­రులను ఆదేశించా­రు. ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నా­యని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.

ముమ్మరంగా వ్యవసాయ పనులు
కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని హరికిరణ్‌ చెప్పారు.  గ్యాప్‌ సర్టిఫికేషన్‌ కోసం ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాకు 50 మంది రైతులతో  26 రైతు ఉత్పత్తిదా­రుల సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇలా ఎంపిక చేసిన 1,300 మంది రైతులతో ఏర్పాటు చేసిన ఎఫ్‌పీవోలతో అవగాహనా ఒప్పందాలు చేసు­కో­­వాల­న్నారు.

ఏపీ స్టేట్‌ ఆర్గానిక్‌ ఉత్పత్తుల సర్టిఫి­కేషన్‌ అథారిటీ (ఏపీఎస్‌ఓపీసీఏ) రిజిస్ట్రేషన్‌తో సేంద్రియ పద్ధతిలో సాగు చేసే పంటలకు ఎఫ్‌పీవోలతో అగ్రిమెంట్‌ చేయించి ఆయా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని  సూచించారు. పంట వేసిన నెల రోజులకు జియో రిఫరెన్సింగ్‌ ద్వారా ఈ–క్రాప్‌ నమోదు చేయాలన్నారు.

మరిన్ని వార్తలు