దిశ మార్చుకున్న తీవ్ర అల్పపీడనం

22 Oct, 2020 03:14 IST|Sakshi

రాష్ట్రానికి తప్పిన ముప్పు

అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం

మహారాణిపేట (విశాఖ దక్షిణ): అల్పపీడనం దిశ మార్చుకుంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌కు ముప్పు తప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బుధవారం తీవ్ర అల్ప పీడనంగా మారి దిశ మార్చుకుంది. ఇది రాగల 24 గంటల్లో వాయవ్య దిశగా ప్రయాణించి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత 48 గంటల్లో ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించి ఒడిశా తీరానికి సమీపంలోని వాయువ్య బంగాళాఖాతం మీదుగా పశ్చిమ బెంగాల్‌–బంగ్లాదేశ్‌ తీరాల వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా తూర్పు–పశ్చిమ ద్రోణి వెంబడి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది 1.5 కి.మీ. నుంచి 5.8 కి.మీ. ఎత్తుకి వెళ్లేకొద్దీ దక్షిణ దిశ వైపు వంపు తిరిగి ఉంది. దీని ప్రభావం వల్ల గురు, శుక్రవారాల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  

మరిన్ని వార్తలు