రుషికొండపై నిర్మాణాల నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ 

30 Nov, 2023 05:40 IST|Sakshi

కేంద్ర కమిటీ నివేదిక ఇచ్చాక ఏం చేయాలో చూస్తాం 

అనుమతులు, ఉల్లంఘనల గురించి కమిటీనే చూసుకుంటుంది 

పిటిషనర్లకు తేల్చి చెప్పిన హైకోర్టు ధర్మాసనం 

గౌరప్పన్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపిన కేంద్రం

సాక్షి, అమరావతి: విశాఖపట్నం రుషికొండపై జరుగుతున్న పర్యాటక శాఖ రిసార్ట్‌ పునరుద్ధరణ పనులను, నిర్మాణాలను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో ప్రస్తుతం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. నిర్మాణాలకు సంబంధించి ఉల్లంఘనలను పరిశీలించేందుకు ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ఏం చేయాలో చూస్తామంది. ఉల్లంఘనలు ఏం ఉన్నాయో తాము కమిటీకి చెబుతామన్న పిటిషనర్‌ అభ్యర్థనను తోసిపుచ్చింది. కమిటీకి మీరు చెప్పాల్సిన అవసరం లేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం తేల్చిచెప్పింది.  

రాజకీయ నేతల వ్యాజ్యాలు.. 
విశాఖ జిల్లా యండాడ గ్రామం సర్వే నంబర్‌ 19 పరిధిలోని కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌లో చెట్ల నరికివేత, భూమి తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ (ఎంఓఈఎఫ్‌) నిబంధనలు, విశాఖపట్నం పట్టణ ప్రాంతాభివృద్ధి సంస్థ మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధమంటూ జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ గతంలో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఇదే వ్యవహారంలో ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది యజ్ఞదత్‌ స్పందిస్తూ.. ధర్మాసనం గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు హెచ్‌టూవో ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీస్‌ సలహాదారు గౌరప్పన్‌ నేతృత్వంలో ఎంఓఈఎఫ్‌ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ కమిటీ డిసెంబర్‌ మొదటి వారంలో రుషికొండ నిర్మాణాలను పరిశీలించి నివేదిక ఇస్తుందని నివేదించారు. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు.

మూర్తి యాదవ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి వాదనలు వినిపిస్తూ.. ఉల్లంఘనలను కమిటీకి వివరించేందుకు అనుమతివ్వాలని కోరగా.. ధర్మాసనం నిరాకరించింది. ఏం ఉల్లంఘనలు ఉన్నాయో కమిటీనే చూసుకుంటుందని, మీరు చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. కమిటీ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేసింది. ఇచ్చిన అనుమతులు ఏమిటి? నిర్మాణాలు అందుకు అనుగుణంగా ఉన్నాయా? ఉల్లంఘనలు ఏం ఉన్నాయి? తదితర వివరాలను కమిటీ స్వయంగా చూసుకుంటుందని తెలిపింది. నిర్మాణాలను నిలువరించేందుకు తగిన ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్‌ కోరగా.. ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం చెప్పింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 27కి వాయిదా వేసింది.   

మరిన్ని వార్తలు