ప్రభుత్వం ఘనతలను చెప్పుకోవడంలో తప్పేముంది? 

30 Nov, 2023 04:26 IST|Sakshi

‘రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి’ కార్యక్రమంపై హైకోర్టు 

అధికారులు పాల్గొనకుండా ఉత్తర్వులివ్వాలన్న అభ్యర్థన తిరస్కృతి 

ఇది ప్రచారమే కాదు.. ప్రజలకు సమాచారం అందించడం కూడా 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోజూ పత్రికల్లో భారీ ప్రకటనలు ఇస్తున్నాయి 

సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూనే ఉన్నాయని కోర్టు వ్యాఖ్య 

ప్రభుత్వ నిధులు ఖర్చు చేయకూడదన్న వినతికీ తిరస్కరణ 

కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం.. నోటీసులు జారీ 

ఈ కార్యక్రమంతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం: న్యాయవాది 

సాక్షి, అమరావతి: ‘రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో అధికారులు పాల్గొనకుండా, ప్రభుత్వ నిధులు ఖర్చు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం తన ఘనతలను ప్రజలకు చెప్పుకోవడంలో తప్పేముందని పిటిషనర్‌ను ప్రశ్నించింది. సంక్షేమ పథకాలను ప్రభుత్వ యంత్రాంగం ద్వారా వివరించడంలో తప్పేమీ లేదంది. ఏ ప్రభుత్వమైనా ఇదే చేస్తుందని వ్యాఖ్యానించింది. ఇది ప్రచారం మాత్రమే కాదని, ప్రజలకు సమాచారం అందిం­చడం కూడా అని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభు­త్వాలు రోజూ వాటి ఘనతల గురించి పత్రి­కల్లో ఫుల్‌ పేజీ ప్రకటనలు ఇస్తున్నా యంది.

తాము (హైకోర్టు) కూడా ప్రజల కోసం అమలు చేస్తున్న పథకాలను బుక్‌లెట్‌ రూపంలో న్యాయ సేవాధికార సంస్థ ద్వారా వివరిస్తున్నామంది. ఇందుకు ప్రభుత్వసాయం కూడా తీసుకుంటున్నామని చెప్పింది. ‘రాష్ట్రా­నికి జగనే ఎందుకు కావాలి’ కార్యక్రమంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

తెలుగుదేశం పార్టీ మద్దతుతో పిల్‌ 
‘రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి’ కార్యక్రమాన్ని అడ్డుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ మద్దతుతో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. జర్నలిస్ట్‌ కట్టెపోగు వెంకయ్య దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు నర్రా శ్రీనివాసరావు, పీవీజీ ఉమేష్‌ చంద్ర వాదనలు వినిపిస్తూ, ఈ కార్యక్రమాన్ని మొదట అధికార పార్టీ కార్యక్రమంగా చేపట్టారన్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్‌మీట్‌లో కూడా చెప్పారన్నారు.

ఆ తరువాత ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారని, వాలంటీర్లను, అధికారులను భాగస్వాములను చేశారన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ బుక్‌లెట్లు ముద్రించి వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయిస్తున్నారన్నారు. ఇందుకోసం రూ.20 కోట్లు విడుదల చేశారని చెప్పారు. వాలంటీర్లు అధికార పార్టీ జెండాలను ఎగురవేస్తున్నారని, ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం ఇదంతా చేస్తోందన్నారు.  

పత్రికా కథనాలను పరిగణనలోకి తీసుకోవద్దని సుప్రీంకోర్టు చెప్పింది 
ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఇందులో తప్పేముందని ప్రశ్నించింది. వాలంటీర్లు జెండాలు ఎగురవేస్తున్నారనడానికి ఆధారాలు ఏమున్నాయని అడిగింది. పత్రికల్లో కథనాలు వచ్చాయని నర్రా శ్రీనివాసరావు చెప్పగా.. వాటిని పరిగణనలోకి తీసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉమేష్‌ చంద్ర స్పందిస్తూ.. పత్రికా కథనాలను హైకోర్టులు సుమోటో పిల్‌గా పరిగణిస్తూ విచారణ జరుపుతున్నాయన్నారు. విచారణ సందర్భంగా పత్రికా కథనాలను పరిగణనలోకి తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఇటీవల చాలా స్పష్టంగా చెప్పిందని సీజే స్పష్టం చేశారు.

రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి వంటి కార్యక్రమాల్లో అధికారులు పాల్గొనడం కేంద్ర సివిల్‌ సర్వీసెస్‌ రూల్స్‌కు విరుద్ధమని శ్రీనివాసరావు అనగా.. ఆ రూల్స్‌ ఐఏఎస్‌లకే వర్తిస్తాయని, మిగిలిన వారికి కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. సంక్షేమ పథకాలను అధికారుల ద్వారా ప్రచారం చేయడంలో తప్పేముందని ప్రశ్నించింది. తన స్వరాష్ట్రం జమ్మూ కాశ్మీర్‌లో కూడా ఇలాగే చేశారని సీజే జస్టిస్‌ ఠాకూర్‌ వివరించారు.  ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) మహేశ్వర్‌రెడ్డి స్పందిస్తూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.   

మరిన్ని వార్తలు