ఫారెస్ట్‌ అధికారిపై చర్యలకు ఓకే చెప్పిన హైకోర్టు 

26 Aug, 2023 04:18 IST|Sakshi

రంపపు కోత మిల్లుల వ్యవహారంలో చర్యలకు అనుమతి  

సాక్షి, అమరావతి: పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు స్థానిక సంస్థలపైనా ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. మానవ మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఎంతో ముఖ్యమని, అడవులు, సరస్సులు, నదులు, అన్ని జీవరాశులను కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులు, ప్రభుత్వాలపై ఉందని పేర్కొంది.

రంపపు కోత మిల్లులను అటవీ ప్రాంత పరిధి నుంచి తరలించే విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన నేపథ్యంలో కర్నూలు ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారిగా పనిచేసిన చాణిక్యరాజు అనే అధికారిపై చట్ట ప్రకారం చర్యలు ప్రారంభించేందుకు ప్రభుత్వానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది.

చాణిక్యరాజుకు ఊరటనిస్తూ ఏపీ పరిపాలన ట్రిబ్యునల్‌ (ఏపీఏటీ) 2017లో ఇచి్చన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ, జస్టిస్‌ కుంభజడల మన్మథరావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారానికి ఆరు నెలల్లో తార్కిక ముగింపు తీసుకురావాలని సూచించింది.  

మరిన్ని వార్తలు