ఆ కొనుగోళ్లే కొంప ముంచాయ్‌

23 May, 2021 04:14 IST|Sakshi

టీడీపీ హయాంలో విచ్చలవిడిగా విద్యుత్‌ కొనుగోళ్లు 

నష్టాలకు ఇదే కారణమన్న కాగ్‌ నివేదిక 

ధరలు తగ్గినా.. ఇప్పటికీ ఎక్కువ చెల్లింపులు

సాక్షి, అమరావతి: విద్యుత్‌ కొనుగోళ్ల విషయంలో గత ప్రభుత్వం సరైన నియంత్రణ పాటించని కారణంగా విద్యుత్‌ సంస్థలు నష్టాల ఊబిలో చిక్కుకున్నాయని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తన నివేదికలో పేర్కొంది. ఈ కారణంగానే రాష్ట్ర విభజన కాలం నుంచి ఇప్పటివరకూ విద్యుత్‌ సంస్థలు కోలుకోలేని నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. 2014–15 నుంచి 2018–19 వరకూ విద్యుత్‌ రంగం పరిస్థితిపై కాగ్‌ నివేదిక వెలువరించింది. మిగులు విద్యుత్‌ పేరుతో గత ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేట్‌ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. విద్యుత్‌ ధరలు తగ్గుతున్నాయని తెలిసి కూడా దీర్ఘకాలిక కొనుగోలు ఒప్పందాలను అత్యధిక ధరలకు చేసుకోవడం వల్ల డిస్కమ్‌లు ఆర్థికంగా నష్టపోయాయి. ముఖ్యంగా పవన, సౌర విద్యుత్‌ కొనుగోలు విషయంలో గాడి తప్పడం వల్ల ఊహించని విధంగా నష్టాలు వచ్చాయి.
 
ప్రైవేటుతో ఢమాల్‌ 
రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు 2014–15లో రూ.7,069.25 కోట్ల నష్టాల్లో ఉంటే.. 2018–19 నాటికి ఆ నష్టాలు రూ. 27,239.60 కోట్లకు వెళ్లాయి. ప్రధానంగా విద్యుత్‌ పంపిణీ సంస్థలు అత్యధికంగా ఆర్థిక నష్టాన్ని చవిచూశాయి. విద్యుత్‌ కొనుగోలు వ్యయం తారస్థాయిలో ఉండటం (యూనిట్‌ రూ.5 పైన), ఆదాయం అంతకన్నా తక్కువ ఉండటంతో నష్టాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీ ఎస్పీడీసీఎల్‌) ఐదేళ్లలో రూ.6,608.90 కోట్ల నుంచి రూ.21,173.01 కోట్ల నష్టాలకు వెళ్లింది. తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్‌) రూ.2,416.68 కోట్ల నుంచి రూ.7,974 కోట్ల నష్టాల్లోకి వెళ్లింది. ఎక్కువగా ప్రైవేట్‌ సోలార్, విండ్‌ పవర్‌ విద్యుత్‌ ధరలు రానురాను తగ్గుతున్నా.. అప్పటి ప్రభుత్వం మాత్రం అత్యధిక రేట్లకు కొనుగోలు చేసింది.

ఆర్‌పీవో ఆబ్లిగేషన్‌ కింద 2016–17లో 2,433 ఎంయూల (5 శాతం) సౌర, పవన విద్యుత్‌కు అప్పటి ప్రభుత్వం అనుమతివ్వాల్సి ఉంటే.. 4,173 ఎంయూలు (8 శాతం) అనుమతించింది. 2017–18లో 4,612 ఎంయూలకు (9 శాతం), 9714 (19 శాతం) ఇచ్చింది. 2018–19లో 6,190 ఎంయూలు (11 శాతం) అనుమతించాల్సి ఉంటే... 13,142 ఎంయూలు (23.4 శాతం) అనుమతించింది. విండ్, సోలార్‌ విద్యుత్‌ తీసుకుని చౌకగా లభించే ఏపీ జెన్‌కో విద్యుత్‌ను నిలిపివేశారు. దీంతో జెన్‌కోకు యూనిట్‌కు రూ.1.50 వరకూ ఫిక్స్‌డ్‌ చార్జీలు చెల్లించాల్సి వచ్చింది. దీంతో 2015–16లో సంస్థలపై రూ.157.1 కోట్లు, 2016–17లో రూ.339.3 కోట్లు, 2017–18లో రూ.2,141.1 కోట్లు, 2018–19లో రూ.3,142.7 కోట్ల అదనపు భారం పడింది. సోలార్‌ విద్యుత్‌ ప్రస్తుతం యూనిట్‌ రూ.2.49కే లభిస్తోంది. కానీ.. గత ప్రభుత్వం చేసుకున్న పీపీఏ కారణంగా కొన్నింటికి యూనిట్‌కు రూ.6.25 వరకూ చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. టీడీపీ నిర్ణయాల వల్ల ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఇబ్బందులు తప్పడం లేదు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు