మానవ అక్రమ రవాణా కట్టడి

25 Oct, 2021 03:26 IST|Sakshi

ఫలిస్తున్న ప్రభుత్వ చర్యలు

గతేడాది 257 మంది బాధితులకు విముక్తి

171 కేసుల నమోదు.. 619 మంది నిందితుల అరెస్టు

99.2% నిందితులపై చార్జిషీటు

ఎన్‌సీఆర్‌బీ నివేదికలో వెల్లడి

సాక్షి, అమరావతి: మానవ అక్రమ రవాణా మాఫియాకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కేసుల నమోదు, అరెస్టుతోపాటు బాధితులను రక్షించడంలోనూ ఏపీ ముందుంటోంది. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి వారిపై చార్జిషీటు వేయడం దేశంలో సగటున 85.2 శాతం ఉంటే ఏపీలో 99.2 శాతం ఉండటం విశేషం.

గడిచిన ఏడాదిలో ఈ తరహా కేసుల్లో ఏకంగా 619 మంది నిందితులను అరెస్టు చేయడం మరో రికార్డు. అలాగే 257 మంది బాధితులను కాపాడారు. జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) కొద్ది రోజుల కిందట విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2020లో మొత్తం 1,714 మానవ అక్రమ రవాణా కేసులు నమోదు అయ్యాయి. కేసుల నమోదులో మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ వరుస స్థానాల్లో నిలిచాయి. గడిచిన మూడేళ్ల గణాంకాలను గమనిస్తే ఏపీలో గతేడాది మానవ అక్రమ రవాణా కేసులు తగ్గుముఖం పట్టినట్టు తేటతెల్లమవుతోంది. 

రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అభినందనీయం 
ఆంధ్రప్రదేశ్‌లో మానవ అక్రమ రవాణా నిరోధానికి ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపట్టడం అభినందనీయం. ప్రధానంగా మహిళలు, బాలికల రక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్‌ (ఏహెచ్‌టీయూ) ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే మూడు ఏహెచ్‌టీయూలు ఉన్నాయి. మరో పది ఏర్పాటు చేస్తున్నారు.

దిశ పోలీస్‌ స్టేషన్‌లతో వీటిని అనుసంధానం చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం మంచి పరిణామం. కరోనా నేపథ్యంలో ఆర్థిక సమస్యలు, ఇబ్బందులతో మానవ అక్రమ రవాణా మరింత పెరగకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బాధితులను కాపాడి, వారి పునరావాసంపై దృష్టి సారిస్తోంది. 
– ఎన్‌.రామ్మోహన్, హెల్ప్‌ సంస్థ డైరెక్టర్‌  

మరిన్ని వార్తలు