వెంచర్ల వంచన

6 Oct, 2023 04:31 IST|Sakshi

గత ప్రభుత్వ హయాంలో సీఆర్‌డీఏ పరిధిలో వందలాది అక్రమ లేఅవుట్లు

అద్భుత నగరం ఆవిష్కృతమవుతుందని తప్పుడు ప్రచారం

రెరా, సీఆర్‌డీఏ అనుమతులు తీసుకోని వెంచర్ల యజమానులు

అన్నీ ఉన్నట్లుగా వినియోగదారులను నమ్మించిన వైనం

తప్పుడు ఎల్‌పీ నంబర్లతో మోసం

ఆకట్టుకొనే డిజైన్లు, ప్రచారాన్ని చూసి ముచ్చటపడిన వినియోగదారులు

భవన నిర్మాణానికి అనుమతులు రాకపోవడంతో మోసం బట్టబయలు

సీఆర్‌డీఏకు పలు ఫిర్యాదులు

1,567 అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకుంటున్న సీఆర్‌డీఏ

వీటిలో ప్లాట్లు కొంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరికలు

అక్రమంగా వెలసిన 3,072 నిర్మాణాలపైనా చర్యలు

సీఆర్డీఏ పరిధిలోని గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో 2020లో 5.50 ఎకరాల్లో కొందరు లే అవుట్‌ వేశారు. ఈ ప్రాంతం నగర శివారులో ఉండడం, కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కావడంతో సమీపంలోనే ఓ భారీ కంపెనీ వస్తున్నట్టు ప్రచారం చేసుకున్నారు. దాంతో పలువురు ప్లాట్లు కొన్నారు. వాటిల్లో నిర్మాణాలు చేపట్టాలని సీఆర్డీఏకి దరఖాస్తు చేసుకుంటే అసలు ఆ లేఅవుట్‌కు అనుమతి లేదని తేలింది. దాంతో ప్లాట్లు కొన్న వారు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.

ఇదే కాదు.. సీఆర్డీఏ పరిధిలోని గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఇలాంటి లేఅవుట్లు చాలా వెలిశాయి. వాటి తొలగింపునకు సీఆర్డీఏ అధికారులు చర్యలు ప్రారంభించారు. వీటిలో ఎవరూ ప్లాట్లు కొని మోసపోకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.

సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని పేరు చెప్పి ప్రజలను ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేశారు. ఇందులో అక్రమ లేఅవుట్లు కూడా ప్రధాన పాత్ర పోషించాయి. అమరావతి రాజధాని నెపంతో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ)ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని దాదాపు మొత్తం ప్రాంతాన్ని దీని పరిధిలోకి తెచ్చారు. ఈ ప్రాంతంలో అనేకానేక ప్రాజెక్టులు వస్తాయని ప్రచారం చేశారు. దీంతో ఈ రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఇబ్బడిముబ్బడిగా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వెలిశాయి.

ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడో లేఅవుట్‌ వేశారు. వీటిలో దాదాపు అన్నీ అక్రమంగా, అనుమతి లేకుండా వేసినవే. వీటికోసం ప్రచారం ఘనంగా చేశారు. కళ్లు చెదిరే నిర్మాణాలు, అంతర్జాతీయ పరిశ్రమలు వస్తున్నాయని ఊదరగొట్టారు. భారీగా అభివృద్ధి జరిగిపోతున్నట్లు గ్రాఫిక్స్‌ చూపించారు. దీంతో అనేక మంది ఇక్కడ ప్లాట్లు కొన్నారు. ధర ఎంత అన్నది చూడకుండా కొనేశారు. వీటిలో ఇళ్లు కట్టుకొనేందుకు అనుమతుల కోసం దరఖాస్తు చేయగా.. ఆ లేఅవుట్లకు అసలు అనుమతులే లేవని సీఆర్డీఏ అధికారులు వాటిని తిరస్కరించారు. దీంతో మోసం బయటపడింది. ప్లాట్లు కొనుక్కున్న వారు కన్నీటిపర్యంతమవుతున్నారు.

సీఆర్డీఏ పరిధిలో భారీ ప్రాజెక్టులు వస్తున్నాయని, అద్భుత నగరం ఆవిష్కృతమవుతుందని గత ప్రభుత్వ హయాంలో ప్రచారం చేసి ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వందలాది వెంచర్లు వేశారు. విజయవాడ, గుంటూరు నగరాల మధ్య, అమరావతి – గుంటూరు మధ్య జాతీయ రహదారికి ఇరువైపులా, విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ఇబ్రహీంపట్నం, నున్న, గన్నవరం, కంకిపాడు ప్రాంతాల్లో, చిలకలూరిపేట సమీపంలో.. ఇలా సీఆర్డీఏ పరిధిలోని 19 నియోజకవర్గాల్లో లేఅవుట్లు వేశారు. వీటిలో దాదాపు అన్నీ అనుమతుల్లేకుండా అక్రమంగా వేసినవే.

ఈ వెంచర్ల యజమానులు రెరా, సీఆర్‌డీఏ అనుమతులు తీసుకోకుండానే అవన్నీ ఉన్నట్టుగా మభ్యపెట్టారు. వేరే చోట అనుమతి ఉన్న లే అవుట్ల ఎల్పీ నంబర్లను ఇక్కడి వాటికి జోడించి కొనుగోలుదారులకు తప్పుడు సమాచారం అందించారు. ఆకట్టుకొనే డిజైన్లు, వారు చేసిన ప్రచారం, బ్రోచర్లను చూసి ముచ్చటపడిన వినియోగదారులు ఎక్కువ ధర అయినా కొనేశారు. విదేశాల్లో ఉన్న వారు కూడా చాలా మంది వీటిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత వీటి మోసం బయటపడటంతో సీఆర్డీఏకు పలు ఫిర్యాదులు అందాయి. ఇలా వచ్చిన వాటిలో 2020 వరకు 1,469 లేఅవుట్లను అక్రమమైనవిగా గుర్తించి చర్యలు తీసుకున్నారు. ఇటీవల మరో 98 అక్రమ లేఅవుట్లను గుర్తించారు.

వాటిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. సీఆర్డీఏ పరిధిలో అక్రమ లేఅవుట్లతో పాటు అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణాలు మరో 3,072 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిపైనా చర్యలు తీసుకుంటున్నారు. అక్రమ లేఅవుట్లు, అక్రమ నిర్మాణాల యజమానులకు నోటీసులు కూడా జారీ చేశారు. అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని, అలా చేస్తే వచ్చే నష్టాలను వివరిస్తూ ఆ ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి వాటిని కొనుగోలు చేస్తే భవిష్యత్‌లో ప్రభుత్వ అనుమతులు మంజూరు కావని సీఆర్డీఏ అధికారులు హెచ్చరిస్తున్నారు.

గుర్తింపులేని లేఅవుట్లతో ఇబ్బందులు
సీఆర్‌డీఏ పరిధిలో ప్రభుత్వ అనుమతి లేని లే అవుట్లు, నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి వాటిలో ప్లాట్లు కొంటే భవన నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రావు. కొనుగోలుదారులు ప్లాటు కొనే ముందు రెరా, సీఆర్‌డీఏ అనుమతి, ఎల్పీ నంబర్‌ వంటివి సరిచూసుకోవాలి. సీఆర్‌డీఏ కూడా అన్ని ప్రభుత్వ అనుమతులు, సదుపాయాలతో లేఅవుట్లను నవులూరు, నూజివీడులో అభివృద్ధి చేసింది. ఏ వివరాలు కావాలన్నా వినియోగదారులు సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. – సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌యాదవ్‌

సీఆర్‌డీఏ లేఅవుట్లు సేఫ్‌
కొనుగోలుదారుల అవసరం మేరకు అన్ని అను­మతులు, సౌకర్యాలను కల్పించి సీఆర్డీఏనే సొంతంగా లేఅవుట్లు వేస్తోంది. నవులూరు, నూజివీడులో ప్లాట్లను అభివృద్ధి చేసి, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీ సైతం కల్పిస్తోంది. ఇలా నవులూరులో 386 ప్లాట్లు అభివృద్ధి చేయగా ఇప్పటికే 164 అమ్ముడయ్యాయి. మిగిలిన ప్లాట్లలో 10 శాతం ప్రభుత్వ అవసరాలకు మినహాయించి 180 ప్లాట్ల వరకు ఈ–లాటరీకి ఏర్పాట్లు చేసింది. నూజివీడులోనూ సీఆర్‌డీఏ 40.78 ఎకరాల్లో 393 ప్లాట్లను అభివృద్ధి చేసింది.

మరిన్ని వార్తలు