వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు

15 Aug, 2020 11:17 IST|Sakshi

జాతీయ జెండా ఆవిష్కరించిన సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, తాడేపల్లి: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనాను ఆంధ్రప్రదేశ్‌ సమర్థంగా ఎదుర్కొంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు, వైఎస్సార్‌సీపీ శ్రేణులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మిగతా రాష్ట్రాలు కంటే మిన్నగా కోవిడ్ నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు చేపట్టారని తెలిపారు. (ఆ ఘనత సీఎం జగన్‌దే: మంత్రి సురేష్‌)

కోవిడ్‌ నివారణకు తీసుకుంటున్న చర్యలపై దేశ విదేశాల నుంచి ప్రశంసలు వస్తున్నాయని పేర్కొన్నారు. కోవిడ్‌ పరిస్థితిని సీఎం జగన్‌ నిత్యం పర్యవేక్షిస్తున్నారని, సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టామని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలు ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారని, వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక రాష్ట్రానికి స్వర్ణ యుగం ప్రారంభమైందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ను చిన్నాభిన్నం చేసిందన్నారు. గ్రామ సచివాలయం వ్యవస్థను సీఎం జగన్ తీసుకువచ్చారని, ఏడాది కాలంలో పేదలను అనేక సంక్షేమ కార్యక్రమాలు ద్వారా ఆదుకున్నారని పేర్కొన్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు రూ. 36 వేల కోట్లు ప్రజలు నేరుగా ప్రజల ఖాతాల్లో వేశారని తెలిపారు. రైతులు, మహిళను అన్ని విధాలుగా సీఎం జగన్‌ ఆదుకున్నారన్నారు.  

‘‘కుల, మతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.  వైఎస్సార్‌ పాలనకు మూడు, నాలుగు రెట్లు సంక్షేమ కార్యక్రమాలు జగన్ పాలనలో ప్రజలకు అందుతున్నాయి. అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని సీఎం జగన్ ముందుకు తీసుకువెళ్తున్నారని’  తెలిపారు.

సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవడానికి టీడీపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను కోర్టులకు వెళ్లి టీడీపీ అడ్డుకుందని మండిపడ్డారు. త్వరలోనే పేదలకు ఇళ్ళ పట్టాలు అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇళ్ళు లేని వారు ఉండకూడదని సీఎం జగన్ భావిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు