కైలాసగిరికి మరో మకుటం

3 Jan, 2024 05:05 IST|Sakshi

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మ్యూజియం ఏర్పాటుకు శ్రీకారం

రూ.4.69 కోట్లతో రూపుదిద్దుకోనున్న మ్యూజియంతో మరింత పర్యాటక శోభ 

శంకుస్థాపన చేసిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ 

ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖపట్నంలోని కైలాసగిరిని రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మరో అడుగు పడింది. ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా ఉన్న కైలాసగిరి.. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి నగరా­నికి వచ్చే పర్యాటకులను ఆకర్షించే విధంగా మరిన్ని హంగులు సంతరించుకుంటోంది. తాజా­గా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మ్యూజియం పురుడు­పోసుకుంటోంది. కేంద్ర సాంస్కృతికశాఖ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సుమారు ఎకరా విస్తీర్ణంలో రూ.4.69 కోట్లతో ఈ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాయి.

3డీ ఆర్ట్‌ గ్యాలరీ, సిలికా విగ్రహాలు, సైన్స్‌ వర్కింగ్‌ మోడల్‌ ప్రదర్శనలు, శాస్త్రీయ థీమ్‌లు తదితరాలతో.. ఏడా­దిలో ఇది అందుబా­టులోకి రానుంది. ఈ మ్యూజి­యం నిర్మాణానికి ఐటీశాఖ మంత్రి గుడి­వాడ అమర్‌నాథ్‌ మంగళవారం ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జునతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా­డుతూ కైలాసగిరిని ముఖ్య పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ద­నున్నట్లు చెప్పారు. ఇక్కడ పర్యాట­కు­లకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తా­మన్నారు. గతంలో పలు అభివృద్ధి పనులకు ఇక్కడ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారని గుర్తుచే­శారు.

ఇప్పుడు కేంద్ర సాంస్కృతికశాఖ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి మ్యూజియం గ్రాంట్‌æస్కీం కిం­ద సైన్స్‌ సిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఎస్‌సీఏపీ) ఆధ్వర్యంలో అధునా­తనమైన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మ్యూజి­యం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రూ.4.69 కోట్లతో ఏర్పాటు చేస్తున్న దీనికి.. రూ.3.75 కోట్లను ఎస్‌సీఏపీకి కేంద్ర సాంస్కృతిక­శాఖ కేటా­యిం­చగా మిగిలిన సుమారు రూ.కోటిని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు.

ఈ పనుల్ని ఏడాదిలో పూర్తిచేసి పర్యాటకులకు అందు­బాటులోకి తీసుకు­రావడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారని ఆయన చెప్పారు. జీవీఎంసీ కార్పొరేటర్‌ స్వాతి, ఎస్‌సీఏపీ సీఈవో డాక్టర్‌ కె.జయరామిరెడ్డి, వీఎంఆర్‌డీఏ జాయింట్‌ కమిషనర్‌ రవీంద్ర, కార్యదర్శి బి.కీర్తి తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు