వృద్ధులకు హోమ్‌ ఓటింగ్‌ | Sakshi
Sakshi News home page

వృద్ధులకు హోమ్‌ ఓటింగ్‌

Published Wed, Jan 3 2024 5:04 AM

- - Sakshi

కర్నూలు(సెంట్రల్‌): ఇది వరకు పండుముసలోళ్లు, దివ్యాంగులు శరీరం సహకరించకపోయినా ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రాలకు వె ళ్లాల్సిందే. అయితే, ఇక నుంచి ఆ అవసరం లేదు. ఇంటి దగ్గర ఉండి ఓటు వేయవచ్చు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం 80 ఏళ్లు దాటిన వృద్ధులు, 60 శాతం కంటే ఎక్కువ శారీరక వికలత్వం కలిగిన ఓటర్లకు ఈ అవకాశం కల్పించింది. అర్హులు వచ్చే పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లోనే హోం ఓటింగ్‌ ఆప్సన్‌ను ఎంచుకోవచ్చు.

ఓటు హక్కు వినియోగించుకోవాలన్నదే ప్రధాన ఉద్దేశం

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైంది. అందుకే ఓటును వజ్రాయుధంతో ప్రజాస్వామ్యవాదులు పోల్చుతుంటారు. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో 18 ఏళ్లు దాటిన వా రి నుంచి 100 ఏళ్లు దాటిన వారికి కూడా ఓటు హక్కు ఉంటుంది. ప్రతి ఒక్కరూ ప్రతి ఐదేళ్లకు జరిగే పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకొని సమర్థవంతమైన నాయకులను పాలకులుగా ఎన్నుకోవాలి. ఈ క్రమంలో 80 ఏళ్లు దాటిన ఓటర్లు, 60 శాతం కంటే ఎక్కువ వికలత్వం ఉన్న వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో భారత ఎన్నికల సంఘం నమోదైన ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంది. అందులో భాగంగా 80 ఏళ్లు దాటిన వృద్ధులు, 60 శాతం శారీరక వికలత్వం ఉన్న ఓటర్లు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంది.

ఆసక్తి ఉన్న ఓటర్ల వివరాల సేకరణకు చర్యలు

జిల్లాలోని కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ, పాణ్యం నియోజకవర్గాల్లో ముసాయిదా జాబితా ప్రకారం 19,71,325 మంది ఓటర్లు ఉండగా, ఆ సంఖ్య డిసెంబర్‌ 26వ తేదీ నాటికి 20,08,721కు చేరుకుంది. ఈక్రమంలో ఆజాబితాలో హోం ఓటింగ్‌ ఆప్షన్‌ను ఎంచుకునేందుకు ఆసక్తి చూపే ఓటర్ల వివరాలను సేకరించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కొంతమంది పోలింగ్‌ అధికారులను ప్రత్యేకంగా నియమించింది.

ఫారం–12 ద్వారా హోం ఓటింగ్‌..

ఎన్నికలు జరిగే తేదీకి మూడు రోజుల ముందు హోం ఓటింగ్‌కు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. వారి నుంచి ఫారం –12 సేకరించి దాని ఆధారంగా పోస్టల్‌ బ్యాలెట్‌ మాదిరిగా హోం ఓటింగ్‌ అవకాశాన్ని కల్పిస్తారు. హోం ఓటింగ్‌ విధానం ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ గడ్‌తో పాటు పలురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు వర్తింపజేశారు. త్వరలో జరిగే పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లోనూ హోం ఓటింగ్‌ విధానాన్ని అమలు చేస్తుండడంతో అధికారులు అందుకోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

80 ఏళ్లు దాటిన వృద్ధులు, 60 శాతం వికలత్వం ఉన్న వారికి అవకాశం

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించు

కోవాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం శ్రీకారం

ఇంటి వద్ద ఓటు వేసే వారి నుంచి ఫారం–12 స్వీకరణకు చర్యలు

జిల్లాలో అర్హులైన ఓటర్ల వివరాల సేకరణకు అధికారుల కసరత్తు

హోం ఓటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నాం

ఇప్పటికే దేశంలో చాలా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో హోం ఓటింగ్‌ విధానం అమల్లోకి వచ్చింది. పార్లమెంట్‌తోపాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ హోం ఓటింగ్‌ విధానం ద్వారా 80 ఏళ్లు దాటిన వృద్ధులు, 60 శాతం శారీరక వికలత్వం ఉన్న వారు ఓటు వేయవచ్చు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో అలాంటి వారి వివరాలను సేకరించేందుకు ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేశాం. వీరికి ఫారం–12 ద్వారా ఇంటి నుంచే పోస్టల్‌ బ్యాలెట్‌ మాదిరిగా ఓటు హక్కు కల్పిస్తాం.

– డాక్టర్‌ జి.సృజన, కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి

1/2

2/2

Advertisement
Advertisement