Year End 2023: ఆవిష్కరణల ఏడాది | Year End 2023 RoundUp: Top 10 Science News And Discoveries That Happened In 2023, See Details Inside - Sakshi
Sakshi News home page

Year End 2023: ఆవిష్కరణల ఏడాది

Published Sat, Dec 30 2023 4:55 AM

Year End 2023: Top 10 science news and discoveries that defined 2023 - Sakshi

అంతరిక్ష అన్వేషణ నుంచి ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ దాకా, గ్లోబల్‌ వారి్మంగ్‌ నుంచి పలు మానవ వికాసపు మూలాల దాకా శాస్త్ర సాంకేతిక రంగాల్లో 2023లో పలు నూతన ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయి. ప్రపంచం దృష్టిని తమవైపుకు తిప్పుకోవడమే గాక భవిష్యత్తుపై కొంగొత్త ఆశలు కూడా కల్పించాయి. వినాశ హేతువైన గ్లోబల్‌ వారి్మంగ్‌లో కొత్త రికార్డులకూ ఈ ఏడాది వేదికైంది! 2023లో టాప్‌ 10 శాస్త్ర సాంకేతిక, పర్యావరణ పరిణామాలను ఓసారి చూస్తే...          

1. చంద్రయాన్‌
దశాబ్దాల కృషి అనంతరం భారత్‌ ఎట్టకేలకు చందమామను చేరింది. తద్వారా చంద్రయాన్‌–3 ప్రయోగం చరిత్ర సృష్టించింది. పైగా ఇప్పటిదాకా ఏ దేశమూ దిగని విధంగా చంద్రుని దక్షిణ ధ్రువంవైపు చీకటి ఉపరితలంపై దిగిన రికార్డును కూడా చంద్రయాన్‌–3 సొంతంచేసుకుంది. ఇంతటి ప్రయోగాన్ని ఇస్రో కేవలం 7.5 కోట్ల డాలర్ల వ్యయంతో దిగి్వజయంగా నిర్వహించడం ప్రపంచాన్ని అబ్బురపరిచిందనే చెప్పాలి. చంద్రుని ఉపరితలంపై సల్ఫర్‌ జాడలున్నట్టు చంద్రయాన్‌–3 ప్రయోగం ధ్రువీకరించింది. రెండు వారాల పాటు చురుగ్గా పని చేసి దాన్ని ప్రయోగించిన లక్ష్యాన్ని నెరవేర్చింది.

2. కృత్రిమ మేధ
ఈ రంగంలో కీలక ప్రగతికి 2023 వేదికైంది. 2022 చివర్లో ఓపెన్‌ఏఐ విడుదల చేసిన ఏఐ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ ఈ ఏడాది అక్షరాలా సంచలనమే సృష్టించింది. ఆకా శమే హద్దుగా అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోయింది. లీవ్‌ లెటర్లు ప్రిపేర్‌ చేసినంత సులువుగా సృజనాత్మకమైన లవ్‌ లెటర్లనూ పొందికగా రాసి పెడుతూ వైవిధ్యం చాటుకుంది. అప్పుడప్పుడూ తడబడ్డా, మొత్తమ్మీద అన్ని అంశాల్లోనూ అపారమైన పరిజ్ఞానం, నైపుణ్యంతో యూజర్ల మనసు దోచుకుంది. గూగుల్‌ తదితర దిగ్గజాలు కూడా సొంత ఏఐ చాట్‌బోట్లతో బరిలో దిగుతుండటంతో ఏఐ రంగంలో మరిన్ని విప్లవాత్మక పరిణామాలు వచ్చేలా ఉన్నాయి.

3. ఆదిమ ‘జాతులు’!
మనిషి పుట్టిల్లు ఏదంటే తడుముకోకుండా వచ్చే సమాధానం... ఆఫ్రికా. అంతవరకూ నిజమే అయినా, మనమంతా ఒకే ఆదిమ జాతి నుంచి పుట్టుకొచ్చామని ఇప్పటిదాకా నమ్ముతున్న సిద్ధాంతం తప్పని 2023లో ఓ అధ్యయనం చెప్పింది. మన మూలాలు కనీసం రెండు ఆదిమ జాతుల్లో ఉన్నట్టు తేలి్చంది! 10 లక్షల ఏళ్ల కింద ఆఫ్రికాలో ఉనికిలో ఉన్న పలు ఆదిమ జాతులు హోమోసెపియన్ల ఆవిర్భావానికి దారి తీసినట్టు డీఎన్‌ఏ విశ్లేషణ ఆధారంగా అది చెప్పడం విశేషం! మూలవాసులైన అమెరికన్లు దాదాపు 20 వేల ఏళ్ల కింద ఉత్తర అమెరికాకు వలస వెళ్లి యురేషియాకు తిరుగు పయనమైనట్టు మరో అధ్యయనం తేల్చింది.

4. గ్రహశకలం ఓసిరిస్‌
నాసా ప్రయోగించిన ఒసిరిస్‌ రెక్స్‌ రోబోటిక్‌ అంతరిక్ష నౌక ఏడేళ్ల ప్రయాణం అనంతరం బెన్నూ గ్రహశకలంపై దిగింది. అక్కడి దాదాపు పావు కిలో పరిమాణంలో రాళ్లు, ధూళి నమూనాలను సేకరించి భూమికిపైకి పంపింది. అవి సెపె్టంబర్‌ 24న అమెరికాలోని ఉటా ఎడారి ప్రాంతంలో దిగాయి. వాటిని            విశ్లేషించిన సైంటిస్టులు నీటితో పాటు భారీ మొత్తంలో కార్బన్‌ జాడలున్నట్టు తేల్చారు. బెన్నూ గ్రహశకలం భూమి కంటే పురాతనమైనది. దాని నమూనాల విశ్లేషణ ద్వారా భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించిన కీలకమైన రహస్యాలు వెలుగు చూడవచ్చని భావిస్తున్నారు.

5. అత్యంత వేడి ఏడాది
చరిత్రలో ఇప్పటిదాకా నమోదైన అత్యంత వేడి ఏడాదిగా 2023 ఓ అవాంఛనీయ రికార్డును సొంతం చేసుకుంది. ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ దాకా ప్రతి నెలా ఇప్పటిదాకా అత్యంత వేడిమి మాసంగా నమోదవుతూ వచి్చంది! ఫలితంగా ఏడాది పొడవునా లిబియా నుంచి అమెరికా దాకా తీవ్ర తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు ఉత్పాతాలు సృష్టిస్తూనే వచ్చాయి. పైగా నవంబర్‌లో అయితే 17వ తేదీన భూ తాపంలో చరిత్రలోనే తొలిసారిగా 2 డిగ్రీల పెరుగుదల నమోదైంది! 2 డిగ్రీల లక్ష్మణ రేఖను తాకితే సర్వనాశనం తప్పదని సైంటిస్టులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం వణికిస్తోంది.

6. సికిల్‌ సెల్‌కు తొలి జన్యుచికిత్స
 సికిల్‌ సెల్, బెటా థలస్సీమియా వ్యాధులకు తొలిసారిగా జన్యు చికిత్స అందుబాటులోకి వచి్చంది. వాటికి చికిత్స నిమిత్తం కాస్‌జెవీ 9క్రిస్పర్‌ కేస్‌9) జన్యు ఎడిటింగ్‌ టూల్‌ వాడకానికి బ్రిటన్‌ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం లభించింది. ఈ థెరపీ ద్వారా రోగులకు నొప్పి నిదానించిందని, ఎర్ర రక్త కణాల మారి్పడి ఆవశ్యకత కూడా తగ్గుముఖం పట్టిందని తేలింది. కాకపోతే ఈ చికిత్స ఖరీదే ఏకంగా 20 లక్షల డాలర్లు! పైగా భద్రత అంశాలు, దీర్ఘకాలిక పనితీరు తదితరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

7. ఊబకాయానికి మందు
మధుమేహానికి ఔషధంగా పేరుబడ్డ వెగోవీ ఊబకాయాన్ని తగ్గించే మందుగా కూడా తెరపైకి వచ్చి సంచలనం సృష్టించింది. బరువును తగ్గించడం మాత్రమే గాక గుండెపోటు, స్ట్రోక్‌ తదితర ముప్పులను కూడా ఇది బాగా తగ్గిస్తుందని తేలడం విశేషం. వీటితో పాటు పలురకాల అడిక్షన్లకు చికిత్సగా కూడా వెగోవీ ప్రభావవంతంగా ఉపయోగపడుతోందని తేలింది. అయితే దీని వాడకం వల్ల థైరాయిడ్‌ క్యాన్సర్‌ వంటి సైడ్‌ ఎఫెక్టులు రావచ్చంటున్నారు!

8. పాపం పక్షిజాలం
ప్రపంచవ్యాప్తంగా జంతుజాలానికి, మరీ ముఖ్యంగా పక్షిజాలానికి మరణశాసనం రాసిన ఏడాదిగా 2023 నిలిచింది! ప్రపంచ వ్యాప్తంగా లక్షల కొద్దీ పక్షి జాతుల జనాభాలో ఈ ఏడాది విపరీతమైన తగ్గుదల నమోదైనట్టు సైంటిస్టులు తేల్చారు. గత నాలుగు దశాబ్దాలుగా పెరుగుతూ వస్తున్న ఈ ధోరణి 2023లో బాగా వేగం పుంజుకున్నట్టు పలు పరిశోధనల్లో తేలింది. పురుగుమందుల విచ్చలవిడి వాడకమే పక్షుల మనుగడకు ముప్పుగా మారిందని తేలింది!

9. మూల కణాధారిత పిండం
అండం, శుక్ర కణాలతో నిమిత్తం లేకుండానే కేవలం మూల కణాల సాయంతో మానవ పిండాన్ని సృష్టించి ఇజ్రాయెల్‌ సైంటిస్టులు సంచలనం సృష్టించారు. అది కూడా మహిళ గర్భంతో నిమిత్తం లేకుండా ప్రయోగశాలలో వారీ ఘనత సాధించారు. ఈ నమూనా పిండం ప్రయోగశాలలో 14 రోజుల పాటు పెరిగింది. ఆ సమయానికి సహజంగా తల్లి గర్భంలో ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఎదిగిందని తేలింది. మానవ పునరుత్పత్తి రంగంలో దీన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ప్రయోగాలకు ఇది ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నారు.

10. కార్చిచ్చులు
2023లో కార్చిచ్చులు కొత్త రికార్డులు సృష్టించాయి. ముఖ్యంగా కెనడాలోనైతే పెను వినాశనానికే దారి తీశాయి. వీటి దెబ్బకు అక్కడ గత అక్టోబర్‌ నాటికే ఏకంగా 4.5 కోట్ల ఎకరాలు బుగ్గి పాలయ్యాయి! అక్కడ 1989లో నమోదైన పాత రికార్డుతో పోలిస్తే ఇది ఏకంగా రెట్టింపు విధ్వంసం. అమెరికా, బ్రిటన్, స్పెయిన్, నార్వే వంటి పలు ఇతర దేశాల్లోనూ కార్చిచ్చులు విధ్వంసమే సృష్టించాయి. వీటి దెబ్బకు జూన్‌ నెలంతా అమెరికాలో వాయు నాణ్యత ఎన్నడూ లేనంతగా తగ్గిపోయింది. హవాయి దీవుల్లో కార్చిచ్చుకు ఏకంగా 100 మంది బలయ్యారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
Advertisement