బెబ్బులి కోట.. పులుల ఆవాస కేంద్రంగా నల్లమల

29 Jul, 2021 21:19 IST|Sakshi

క్రమంగా పెరుగుతున్న జాతీయ జంతువుల సంఖ్య

నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం

పర్యావరణం సమతుల్యంగా  ఉండాలంటే మానవాళితో పాటు జంతువుల నివాసానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే ప్రభుత్వాలు వీటికి లెక్కలు వేసి, అవసరమైన చోట ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తుంటాయి. మనదేశంలో పర్యావరణ పిరమిడ్‌లో పెద్ద పులిని అగ్ర సూచిగా గుర్తించారు. అలాంటి పులులకు నల్లమల ఫారెస్ట్‌  సురక్షిత ఆవాస కేంద్రంగా మారింది. వాటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి ఏటా జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

సాక్షి, కర్నూలు: ప్రపంచ వ్యాప్తంగా పులుల సంఖ్య గణనీయంగా తగ్గి పోతుండడంతో వాటిని సంరక్షించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రపంచంలో బతికి ఉన్న పెద్ద పులుల సంఖ్య 4000 వరకు ఉండగా అందులో ఒక్క భారత దేశంలోనే వాటి సంఖ్య  యాభై శాతానికి పైగా అంటే 2,226 గా ఉండడం  గమనార్హం. ఇటీవల ప్రకటించిన అరుణాచల్‌ ప్రదేశ్‌ లోని కమలంగ్‌ టైగర్‌ రిజర్వ్‌తో కలిపి  దేశ వ్యాప్తంగా మొత్తం 50 పెద్ద పులుల అభయారణ్యాలున్నాయి.  రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నాగార్జున సాగర్‌– శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ (ఎన్‌ఎస్‌టీఆర్‌) దేశంలోనే అతి పెద్దది(3,568 చ.కిమీ). 


                   నల్లమలలో ఏర్పాటు చేసిన ఇన్‌ఫ్రా రెడ్‌ కెమెరా 

నల్లమల పులి సంరక్షణకు దుర్గం
రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నల్లమల   అడవులు పులి సంరక్షణకు ఆశ్రయ దుర్గంగా ఉంటున్నాయి. పులి సంతతి వృద్ధికి ఈ ప్రాంతం అత్యంత అనుకూల పర్యావరణాన్ని కలిగి ఉంది.  గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణి అభయారణ్యం (జీబీఎం)లో కూడా పులులు క్రమేపి విస్తరిస్తూ కడప జిల్లా వరకు చేరుకుంటున్నాయి. నాగార్జున సాగర్‌ – శ్రీశైలం పులుల అభయారణ్యంలో సిబ్బంది పర్యవేక్షణ, మానవవనరులను అత్యంత ప్రతిభావంతంగా వినియోగించుకోవడం ద్వారా పులుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీనిని గుర్తించిన ఎన్‌టీసీఏ  2014లో అత్యున్నత ప్రతిభా అవార్డుతో అభినందించింది. సుదీర్ఘ ఆకలి తర్వాతే వేటపులి ఎప్పుడంటే అప్పుడు వేటాడదు. ఎంతో ఆకలి వేస్తేనే వేట మొదలుపెడుతుంది. సంవత్సరానికి ఒక పులి 50 నుంచి 60 జంతువులను తన ఆహారానికి వినియోగించుకుంటుందని అటవీ అధికారులు తెలిపారు

నల్లమలలో పులుల ఉనికి పెరుగుతుందిలా.. 

సంవత్సరం   ఎన్‌ఎస్‌టీఆర్‌ జీబీఎం మొత్తం 
 2016 23 17 40
2017 25 21 46
2018  50 పైగా ఉండొచ్చని అంచనా 
100 పైగానే పెద్ద పులులు 
        ఉన్నట్లు అంచనా

పులి సామ్రాజ్యం ప్రత్యేకం 
పులుల తమ కోసం ఓ సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటాయి. సాధారణంగా ఒక మగ పులి తన ఆహార లభ్యతను బట్టి తన విహార ప్రాంతాన్ని గుర్తిస్తుంది. నల్లమలలో ఒక పులి సాధారణంగా తన ఆధీన ప్రాంతం (టెరిటరీ)  50 చ.కిమీ గా ఉంచుకుంటుంది. అయితే తన  భాగస్వామి, ఆహారం కోసం 200 చ.కి.మీ. పరిధి వరకు విహరిస్తుంది. అదే రాజస్థాన్‌లోని రణతంబోర్‌ పులుల అభయారణ్యంలో అది ఇందులో సగం మాత్రమే ఉంటుంది. పులి తన మూత్రం వెదజల్లడం ద్వారా తన టెరిటరీ సరిహద్దులను నిర్ణయించుకుంటుంది.   


                       నల్లమల అడవిలో  పులులు

 లెక్కింపులో ప్రామాణికం స్టాండర్డ్‌ పగ్‌ మార్క్‌
పెద్ద పులుల పాద ముద్రలు సేకరించి వాటి ఆధారంగా పులుల సంఖ్యను అంచనా వేస్తారు.  దీనినే స్టాండర్డ్‌ పగమార్క్‌ ఎన్యూమరేషన్‌ పద్ధతి అని అంటారు.  ప్రస్తుతం జాతీయ జంతువుల అంచనాకు పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకుంటున్నారు. అడవుల్లో ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిల్లో పడే చిత్రాల ఆధారంగా పులుల చారలను విశ్లేషిస్తారు. వాటి చారలు మనుషుల వేలిముద్రలలాగే దేనికవే ప్రత్యేకంగా ఉంటాయి.   

పులి సంరక్షణ కఠినతరం
పులి అత్యంత సున్నితమైన జంతువు. పులి సౌకర్యంగా జీవించడానికి తగిన పర్యావరణాన్ని ఏర్పరచడం ఎంతో క్లిష్టతరంగా ఉంటుంది. నల్లమల అడవులు ఆకురాల్చు అడవులు కావడంతో పులికి ఆహారమైన జంతువులకు సంవత్సరం పొడవునా గడ్డి లభించదు. దీంతో పులికి కావాల్సిన ఆహారపు జంతువుల సంఖ్య అడవిలో తగ్గకుండా చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నల్లమలలో పులుల పెరుగుదల కనిపించడం సిబ్బంది పనితనానికి గుర్తుగా చెప్పవచ్చు. 
– అలాన్‌ చోంగ్‌ టెరాన్, డీఎఫ్‌ఓ, ఆత్మకూరు  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు