లక్ష్యాన్ని మించి పెట్టుబడులు 

5 Mar, 2023 03:35 IST|Sakshi

ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, ఉపాధి కల్పనకు పెద్దపీట 

రాష్ట్రంలోని సహజ వనరులను ప్రపంచానికి చూపించాం 

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌   

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం.. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించటమే ప్రధాన లక్ష్యంగా రెండు రోజుల పాటు నిర్వహించిన ‘గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ –2023’ గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యిందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ హర్షం వ్యక్తం చేశారు. రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని భావించినా, సీఎం జగన్‌ నాయకత్వంలో లక్ష్యాన్ని మించి రూ.13.41 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకంతోనే ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారని చెప్పారు. జీఐఎస్‌ సదస్సు ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సదస్సు ద్వారా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించామని చెప్పారు. ఫలితంగా సుమారు 378 ఎంవోయూలు జరిగాయన్నారు. ఈ సదస్సులో 48 దేశాలకు చెందిన 100 మంది వరకు వివిధ అంశాలపై చర్చించారని చెప్పారు.

ఈయూ కూటమి దేశాల నుంచి అధిక సంఖ్యలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారన్నారు. 40 దేశాలకు చెందిన 595 మంది ప్రతినిధులు వర్చువల్‌గా పాల్గొన్నారని తెలిపారు.  ప్రభుత్వ పని తీరుపై కేంద్ర మంత్రులు, కార్పొరేట్‌ ప్రముఖులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి , పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ డా.జి.సృజన, సమాచార శాఖ కమిషనర్‌ టి.విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు