కొనసాగుతున్న ద్రోణి– వచ్చే రెండు రోజులు వర్షాలు

1 May, 2023 04:22 IST|Sakshi

పిడుగుపాటుకు ఇద్దరు మృత్యువాత.. రెండు ఆవులు, 15 గొర్రెలు మృతి 

సాక్షి, అమరావతి/పెళ్లకూరు(తిరుపతి జిల్లా)/ ఒంగోలు: తూర్పు విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతున్నదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం అంబేద్కర్‌ కోనసీమ, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్,  శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో  అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములు మెరుపుల వర్షంతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉన్న దృష్ట్యా ఎవరూ చెట్ల కింద ఉండకూడదని తెలిపారు.

కాగా, తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని పునబాక గ్రామ సమీపంలోని ఓ పొలంలో నాట్లు వేస్తున్న  కృష్ణా జిల్లా రామాపురం గ్రామానికి చెందిన జల్ల వీరలంకయ్య(49) పిడుగుపాటుకు మృత్యువాత పడ్డాడు. అలాగే అదే మండలంలో రెండు ఆవులు, ఓ దూడ మృతి చెందాయి. అదే విధంగా ప్రకాశం జిల్లాలోని  త్రిపురాంతకం మండలం మిరియంపల్లి గ్రామానికి చెందిన రైతు రావెళ్ల పుల్లయ్య (73) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. కొనకనమిట్ల మండలం ఇరసలగుండంలో పిడుగుపడి 15 గొర్రెలు చనిపోయాయి.  

మరిన్ని వార్తలు