చంద్రబాబు హయాంలో కరువు.. జగన్‌ హయాంలో వ్యవసాయం వృద్ధిరేటు

25 Oct, 2023 20:24 IST|Sakshi

వర్షాభావంపై పచ్చ మీడియా పిచ్చిరాతలు

మండిపడ్డ వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి

ఈ ఏడాది వర్షపాతం తక్కువైనా.. రైతన్నను ఆదుకున్న భూగర్భజలాలు

వ్యవసాయ వృద్ధి రేటులో తెలంగాణ కంటే ఏపీనే ముందు

నాలుగేళ్లలో సీమకు 558 టీఎంసీలిచ్చిన రైతుబాంధవుడు సీఎం జగన్

బాబు ఐదేళ్ల పాలనలో సీమకు ఇచ్చింది 310 టీఎంసీలే

చంద్రబాబు హయాంలో అంతా కరువు కాటకాలే

యేటా 273 కరువుమండలాల్ని ప్రకటించిన ఘనుడు బాబే

సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో వర్షాభావంపై యెల్లో మీడియా రాస్తున్న విద్వేషపూరిత రాతలను వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు, రాష్ట్ర అగ్రిమిషన్‌ వైస్‌చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఖండించారు. తాడేపల్లి వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ వాటిని పిచ్చిరాతలుగా కొట్టేశారాయన. అలాగే.. నాడు చంద్రబాబు హయాంలో ఏర్పడిన కరువు పరిస్థితులను.. నేడు రైతు సంక్షేమం కోసం సీఎం జగన్‌ చేస్తున్న కృషిని ఆయన వివరించారు. 

చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 వరకు చూస్తే.. రాష్ట్రంలో నిరంతరం కరువు కాటకాలే కొనసాగాయి. ఆయన ఐదేళ్లలో సరాసరి 273 కరువు మండలాల్ని స్వయంగా ప్రభుత్వమే ప్రకటించింది. ఆనాడు రాయలసీమ, ప్రకాశం జిల్లా ప్రాంతాల నుంచి లక్షలాది రైతుల కుటుంబాలు బెంగుళూరు, చెన్నై, కేరళకు దినసరి కూలీల్లా వలసలు పోయారు. అప్పట్లో ప్రభుత్వం కరువు ప్రాంత రైతుల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయంటే.. మిమ్మల్ని పంటలు వేసుకోమని ప్రభుత్వం చెప్పలేదుగా.. ఎవరు వేయమన్నారో వాళ్లదగ్గరకెళ్లి సాయం కోరండని .. రైతులకు తగిన శాస్తి జరగాలని ఆనాడు ఎద్దేవా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాగే, విద్యుత్‌ ఉద్యమకారులపై కాల్పులు జరిపించిన దుర్మార్గుడు చంద్రబాబు. కృష్ణాడెల్టాలోనే నీరులేక ఊడ్చిన పొలాలు ఎండిపోయిన పరిస్థితుల్ని రైతులు ఇప్పటికీ మరిచిపోలేరు. 2018–19లో పది లక్షల ఎకరాల్లో పంటసాగు చేస్తే.. ఆ పంటంతా ఎండిపోయిన పరిస్థితిని అందరూ కళ్లారా చూశారు. అలాంటి దౌర్భాగ్యమైన, నికృష్టమైన పాలన చంద్రబాబుది.

చంద్రబాబు, కరువు కవలపిల్లలే!
నిత్యం కరువు కాటకాలను అధికారికంగా ప్రకటించుకున్న చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిది. అందుకే, చంద్రబాబు, కరువు అనేవి కవల పిల్లలంటూ టీడీపీ నాయకులే మనసులో అనుకుంటున్నా.. తమ అధినేత ఎదుట ఏనాడూ బహిరంగంగా అనలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే, బాబు ముఖ్యమంత్రిగా ఉండగా.. ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టులో నీరుండదని వాళ్లకు తెలుసుకాబట్టి.

సాగునీటి ప్రాజెక్టులు దండగన్నది చంద్రబాబే!
రాష్ట్రంలో ప్రాజెక్టులపై మనసులో మాట పుస్తకం రాసుకున్న చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులు దండగ అని అన్నది వాస్తవం కాదా..? అని ప్రశ్నిస్తున్నాను. సాగునీటి ప్రాజెక్టులకు పెట్టిన డబ్బుకు బ్యాంకుల రుణాలు కూడా రావని ఈ చంద్రబాబే అన్నాడు. ఆనాడు తన మనసులో మాట పుస్తకంలో అలా రాసుకోలేదని గుండెలమీద చెయ్యేసుకుని బాబు చెప్పగలడా..? ఆయన్ను భుజానెత్తుకుని మోస్తున్న పచ్చమీడియా సమాధానం ఇవ్వగలదా..? 

ఉచిత విద్యుత్‌ సాధ్యంకాదన్న బాబు
రైతుల శ్రమ, సాగుపెట్టుబడులపై అవగాహన కలిగిన మహానేత, దివంగత వైఎస్‌ఆర్‌ ఆనాడు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తానంటే.. అది సాధ్యం కాని హామీ అన్నది చంద్రబాబు. ఉచిత విద్యుత్‌ ఇస్తే కరెంట్‌ తీగలపై బట్టలారేసుకోవడమేనని బాబు వేళాకోళమాడింది నిజంకాదా..? వ్యవసాయం దండగమారిదని అన్న వ్యక్తి చంద్రబాబు. 

నేడు భూగర్భజలాల సద్వినియోగంతో..
సాగు, తాగునీటికి సంబంధించి ప్రకృతివనరులపై ఆధారపడటమనేది సహజం. వర్షపాతంపై ప్రధానంగా చెప్పుకోవాలంటే, ఈ ఏడాది ఆగస్టు మాసంలో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. సరిగ్గా ఇదే లోటు వర్షపాతం గతంలో 1899, 1913లలో నమోదైనట్లు రికార్డులు న్నాయి. ఇలాంటి విపత్కర సమయాల్లోనూ ప్రభుత్వపరంగా రైతులకు  నీటి సౌకర్యం కల్పించే విషయంలో మనం ముందున్నాం. భూగర్భ జలమట్టాలున్న ప్రతీచోటా రాష్ట్రవ్యాప్తంగా 19.7 లక్షల పంపుసెట్లుకు 9 గంటల ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం నిరంతరాయంగా అందిస్తున్నాం. ఇందుకు దాదాపు రూ.1800 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తుంది. అదే సమయంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా ఉచిత బీమా పథకం కింద రైతు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించనవసరం లేకుండా ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటి వరకు సాగులో ఉన్న భూమినంతటినీ బీమా పరిధిలోకి తీసుకువచ్చాం. రాష్ట్రంలో 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802 కోట్లు బీమా అందించాం. ఎక్కడైతే రైతులు ఇబ్బందులు పడుతున్నారో.. అక్కడ సాయం అందించేందుకు ప్రభుత్వం ముందుంటుంది.

రైతుల్ని ఆదుకోవడంలో శ్రమిస్తోన్న జగన్‌
చంద్రబాబు ఐదేళ్ల హయాంలో అతితక్కువ వర్షపాతం నమోదైనప్పుడు రైతుల్ని మభ్యపెట్టే విధంగా కోతలు కోశాడు. రెయిన్‌గన్‌లతో కరువును జయించామనే మాటల్ని ఆనాడు ఆయన వినిపించాడు. అదే సీఎం జగన్‌ ప్రభుత్వ పెద్దలు గానీ అలాంటి మెహర్భానీ మాటల్ని ఎన్నడూ చెప్పుకోలేదు. వాస్తవ పరిస్థితుల్ని ఎదుర్కొనడంలో ఎప్పటికప్పుడు సమీక్షలతో అహర్నిశం శ్రమిస్తున్నారు. ప్రకృతి సహజసిద్ధ వనరుల్ని సద్వినియోగం చేసుకుంటూ సీజన్‌ కు తగ్గ పంటలకు అవసరమైన ఇన్‌ఫుట్స్‌ అందించడంలో ఈ ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా పనిచేసింది. ఈఏడాది జూలై మాసంలో అధిక వర్షపాతానికి సంబంధించి కృష్ణాడెల్టాలో దెబ్బతిన్న పంటలకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీనీ కూడా ఇప్పటికే విడుదల చేశాం. రైతుభరోసా సాయం కూడా ప్రకటించిన తేదీనే రైతులకు పంపిణీ చేస్తున్నాం.  భేషరతుగా రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని.. బ్యాంకుల్లో కుదువపెట్టిన మీ పుస్తెలతాళ్లు తెచ్చిస్తానని అనంతపురంలో మాట ఇచ్చిన చంద్రబాబు రూ.87వేల కోట్లకు పైగా రుణాలుంటే.. రూ.14వేల కోట్ల మాఫీతో సరిపెట్టాడు. అదే జగన్‌గారు రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు రైతుభరోసా–పీఎం కిసాన్‌ కింద రూ.31వేల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. 

వ్యవసాయ వృద్ధిరేటులో ముందంజ
వ్యవసాయ వృద్ధిరేటులో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌ ముందుంది. గతంతో పోల్చుకుంటే, ధాన్యం పండించడంలో 7.78 లక్షల టన్నుల ఉత్పత్తి పెరిగింది. ఆహారధాన్యాల ఉత్పత్తి 153.95 లక్షల టన్నుల నుంచి 165.77 లక్షల టన్నులతో దాదాపు 11.58 లక్షల టన్నుల ఉత్పత్తి పెరిగింది. ఉద్యానపంటలు 95.55 లక్షల టన్నుల ఉత్పత్తి పెరిగాయి. అలాగే వ్యవసాయ వృద్ధిరేటు బాబు హయాంలో 2018–19లో (మైనస్‌) – 11.7 శాతం ఉంటే, 2022–23లో (ప్లస్‌) 22.7శాతంలో ఉంది. 

4ఏళ్లలో పోతిరెడ్డిపాడు నుంచి సీమకు 553 టీఎంసీల నీరు
సీఎం జగన్‌ అధికారం చేపట్టాక నాలుగేళ్ల కాలంలో ప్రతీ సాగునీటి ప్రాజెక్టు జలకళతో తొణికిసలాడుతుంది. రాయలసీమకు ప్రధానమైన నీటి వనరుగా ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి నీటిని మనం ఒకసారి పరిశీలిస్తే.. 2014–15లో బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 59.56 టీఎంసీలు, 2015–16లో 0.95 టీఎంసీలు అంటే, సాగునీటికి కూడా రాయలసీమకు నీళ్లువెళ్లలేని పరిస్థితి అది. 2016–17లో 67.94 టీఎంసీలు, 2017–18లో 91.97 టీఎంసీలు, 2018–19లో 88.87 టీఎంసీలు కాగా, మీ ఐదేళ్లలో 310 టీఎంసీల నీరు పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు వెళ్లింది. అదే మా జగన్‌ గారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాలుగేళ్లను చూస్తే.. 2019–20లో 179.29 టీఎంసీలు, 2020–21లో 134.41 టీఎంసీలు, 2021–22లో 111.07 టీఎంసీలు, 2022–23లో 123.44 టీఎంసీలు కాగా ఈ నాలుగేళ్లలోనే 553 టీఎంసీల నీరు పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు అందాయి. అంటే, బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కంటే రెండింతల నీరు జగన్‌గారి హయాంలో రాయలసీమకు వెళ్తున్నాయి. 

పచ్చమీడియా పిచ్చిరాతల్ని రైతులు నమ్మొద్దు
రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని.. సీఎం జగన్‌ ఆ దిశగా సంకల్పంతో ముందుకెళ్తున్నారని మనవి చేస్తున్నాను. చంద్రబాబును మోస్తున్న పచ్చమీడియాలో పిచ్చి రాతల్ని మాత్రం రైతులెవరూ నమ్మరనేది సుస్పష్టం. పట్టిసీమ, పులిచింతల నీళ్లు తాగు, సాగు అవసరాలకు సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తోందని, రైతులు కూడా అందుకు సహకరిస్తున్నారని నాగిరెడ్డి అన్నారు. 
 

మరిన్ని వార్తలు