జగనన్న కాలనీలు.. ఆనందాల లోగిళ్లు

21 Jun, 2022 19:13 IST|Sakshi

గ్రామాలను చేర్చి నిర్మాణాలు

కాలనీల్లో సకల వసతులు

పల్లెల్లో గృహప్రవేశాల సందడి 

పెంటపాడు(పశ్చిమగోదావరి జిల్లా): పల్లెలు నూతన గృహాలతో సరికొత్త శోభను సంతరించుకుంటున్నాయి.. జగనన్న కాలనీలు ఊళ్లుగా రూపాంతరం చెందుతున్నాయి.. రాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో స్థలాలు మంజూరు చేసి ఇళ్ల నిర్మాణాలకు ప్రోత్సహిస్తున్నారు. అర్హులందరికీ ఇప్పటికే స్థలాలు అందించగా.. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వ సాయం, అధికారుల ప్రోత్సాహంతో నెల రోజులుగా నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో జగనన్న కాలనీలు ఆనందాల లోగిళ్లను తలపిస్తున్నాయి. కాలనీల్లో ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో లబ్ధిదారులు నిర్మాణాలకు మరింత ఆసక్తి చూపుతున్నారు.  


నిర్మాణాల ప్రగతి భళా 

నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా పెంటపాడు మండలంలోని 22 గ్రామాల్లో 27 లేఅవుట్లను ఏర్పాటుచేశారు. మొత్తం 2,193 మంది లబ్ధిదారులకు ఇప్పటివరకూ 1,340 మంది ఇళ్లు నిర్మించుకున్నారు. అలాగే 760 ఇళ్లు పునాది దశ దాటాయి. మిగిలిన లబ్ధిదారులు కూడా నిర్మాణాలు చేపట్టేలా అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాల్లో పెంటపాడు మండలం 55 శాతం ప్రగతితో జిల్లాలో రెండో స్థానంలో నిలిచింది. ప్రభుత్వం రూ.1.80 లక్షల ఆర్థిక సాయంతో పాటు డ్వాక్రా మహిళలకు రూ.35 వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు అందిస్తోంది. నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తోంది. సిమెంట్, స్టీల్‌ను రాయితీపై ఇస్తోంది. పెంటపాడు మండలంలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఆర్థిక సాయం, మెటీరియల్‌ ఖర్చు కింద రూ.15,00,79,366 అందిం చినట్టు గృహనిర్మాణ శాఖ అధికారులు తెలిపారు.  

సదస్సులతో స్ఫూర్తి 
గ్రామాల్లో అధికారులు, సర్పంచ్‌లతో అవగాహన సదస్సులు నిర్వహించాం. దీని ద్వారా చాలా మంది పేదలు గృహనిర్మాణాలకు ముందుకు వస్తున్నారు. వారికి గూడు సమకూరుతోంది.  
– ఓ.శ్రీనివాసరావు, హౌసింగ్‌ ఏఈ, పెంటపాడు 

జిల్లాలో రెండో స్థానంలో..   
పెంటపాడు మండలంలో ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాం. అవగాహన సదస్సులతో స్ఫూర్తి పొందిన లబ్ధిదారులు నిర్మాణాలకు ముందుకు వస్తున్నారు. దీనిద్వారా 55 శాతం ప్రగతి సాధించి జిల్లాలో రెండో స్థానంలో నిలిచాం.   
– ఎ.ప్రసాద్, హౌసింగ్‌ డీఈ 

ఆన్‌లైన్‌ కాగానే బిల్లులు 
జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి దశల వారీగా ఆన్‌లైన్‌ కాగానే ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తోంది. స్టాక్‌ పాయింట్ల ద్వారా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా మెటీరియల్‌ అందిస్తున్నాం. 
– జయరాజు, హౌసింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్, పెంటపాడు   


పెంటపాడు మండలం బి.కొండేపాడుకు చెందిన యల్లా బాలాజీ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకువస్తున్నారు. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు కాగా సొంతిల్లు కలగా ఉంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో వారికి గృహం మంజూరు కాగా.. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇంటి నిర్మాణం పూర్తిచేసుకున్నారు. సీఎం జగన్‌ దయవల్లే తమకు గూడు సమకూరిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  


ప్రభుత్వ ప్రోత్సాహంతోనే.. 

పెంటపాడు మండలం బి.కొండేపాడుకు చెందిన గూడూరి పుణ్యవతి చాలా కాలంగా సొంతింటి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం స్థలం మంజూరు చేయడంతో ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందుకు అధికారులు ఆమెను ప్రోత్సహించారు. దశల వారీగా బిల్లులు మంజూరు చేయడంతో ఆమె ఇంటి నిర్మాణం పూర్తిచేసుకోగలిగారు. సీఎం జగన్‌ సంకల్పంతోనే తన సొంతింటి కల సాకారమైందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు