Sakshi News home page

Fact Check: పేదల ఇళ్లపై ఇవేం రాతలు!?

Published Sun, Oct 22 2023 4:49 AM

Eenadu Ramoji Rao Fake News On Jagananna Colonies Houses - Sakshi

సాక్షి, అమరావతి: రామోజీరావుకు కథలంటే భలే ఇష్టం.. కట్టుకథలు, కాకమ్మ కథలంటే ఇంకా ఇష్టం.. ప్రభుత్వంపై బురద జల్లేవి అయితే లొట్టలు వేసుకునేంతగా మరీ ఇష్టం. ఎందుకంటే.. ఆయనకో రోగం ఉంది. దాని పేరు కడుపుమంట. ఇలాంటి కట్టుకథలు, కాకమ్మ కథలు, రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే స్టోరీలే ఆ బాధ నుంచి ఆయనకు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయి. అది తగ్గిపోగానే మళ్లీ కడుపు రగులుతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ షరా మామూలే.. మరో కల్పిత కథనం. ఇది రామోజీకి నిత్యకృత్యం. కానీ, ఈ మధ్య ఈ రోగం ముదురుతోంది.

తన పార్ట్‌నర్‌ జైలు నుంచి వచ్చే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించకపోవడంతో ఆయన వెర్రెక్కిపోతున్నారు. ఫలితంగా ఆయన కట్టుకథల శృతి మించుతోంది. ఎంతలా అంటే.. ‘నవరత్నాలు పేదలందరీ ఇళ్లు’ పథకంలో శరవేగంగా ఊళ్లకు ఊళ్లే నిర్మిస్తుంటే వాటిని చూసి ఓర్వలేనంత. పైగా.. పేదలు సంతోషంగా సొంతిళ్లలోకి వెళ్తుంటే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. సాధారణంగా.. ఎక్కడైనా లేఔట్లలో పూర్తిస్థాయి నిర్మాణాలు చేసిన తర్వాతే శాశ్వత డ్రెయిన్లు, రోడ్లు వేస్తారు.

ఎందుకంటే.. వాటిని ముందే నిర్మిస్తే ఇళ్ల నిర్మాణంలో భాగంగా లేఔట్లలో లారీలు, ట్రాక్టర్లు తిరిగేటప్పుడు ధ్వంసమవుతాయి కాబట్టి. ఇది ఒక్క జగనన్న కాలనీల్లోనే కాదు.. ఏ ప్రైవేటు వెంచర్‌లోనైనా ఇలానే చేస్తారు. కానీ, ఈ చిన్న లాజిక్‌ను రామోజీ మిస్‌ అయ్యారు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈనాడు శనివారం ‘జగనన్నా.. ఇవేం కాలనీలు’ అంటూ పెడబొబ్బలు పెట్టింది. పేదల ఇళ్లతో ఏర్పడ్డ కాలనీల స్థితిగతులపై లేనిపోని అపోహలు సృష్టించేందుకు ఆపసోపాలు పడింది.

పెత్తందారీ ముసుగులో కలియుగ రాక్షసులు..
టీడీపీ, రామోజీరావు పెత్తందారుల ముసుగులో చెలామణీ అవుతున్న కలియుగ రాక్షసులు. అందుకే నిత్యం పేదలకు ఇళ్ల స్థలాల మహాయజ్ఞాన్ని భగ్నం చేసే కుట్ర చేస్తూనే ఉన్నారు. కోర్టుల్లో దాదాపు వెయ్యికి పైగా కేసులు వేయించి విశాఖతో పాటు ఎక్కడా కూడా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయకుండా చాలాకాలం అడ్డుకున్నారు. అమరావతిలో అయితే మరింత పేట్రేగిపోయి.. పేదలకు ఇళ్ల పట్టాలిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని నీచంగా రాతలు రాశారు. వీటన్నింటినీ ఛేదించుకుంటూ జగన్‌ సర్కార్‌ పేదల సొంతింటి కలలో భాగంగా ఇళ్ల పట్టాలను అందించింది.

లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేలా ఆర్థిక చేయూతనిస్తోంది. మూడు ఆప్షన్లు ద్వారా అక్కచెల్లెమ్మలను సొంతింటి యజమానులను చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అత్యంత పారదర్శకంగా, అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులను ఎంపిక చేసింది. కులమతాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా ఇళ్ల పట్టాలు, ఇళ్లు మంజూరు చేసింది. పైగా ఇళ్ల పట్టాల పంపిణీతో ప్రభుత్వం సామాజిక న్యాయానికి బాటలు వేసింది.

పట్టాలు అందుకున్న వారిలో 20 శాతం ఎస్సీలు, ఆరు శాతం ఎస్టీలు, 54 శాతం బీసీలు, 21 శాతం ఇతరులున్నారు. గతంలో ఇళ్ల పట్టాలు ఇవ్వకున్నా జన్మభూమి కమిటీలు పేదలకు ఆశ చూపించి వారి రెక్కల కష్టాన్ని దోచుకున్నాయి. కానీ, ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో ప్రతి అక్కచెల్లెమ్మను లేఅవుట్‌ దగ్గరకు తీసుకెళ్లి, అక్కడ స్వయంగా వారికి కేటాయించిన పట్టాభూమిని చూపించి, వారికి పట్టా పత్రాలు అందించడం జగన్‌ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. 


మార్కెట్‌ ధరలకన్నా తక్కువకు నిర్మాణ సామాగ్రి
ఇక ప్రతి లబ్ధిదారుడికి 4.5 మెట్రిక్‌ టన్నుల సిమెంట్, 0.48 మెట్రిక్‌ టన్నుల స్టీలు మార్కెట్‌ ధరల కంటే తక్కువకే అందిస్తోంది. తలుపులు, కిటికీ ఫ్రేములు, షట్టర్లు, ఎలక్ట్రిక్, శానిటరీ సామాన్లు కింద 12 రకాల గృహ వస్తువులను కూడా తక్కువ రేటుకే ఇస్తోంది. కాలనీల్లోనే తాత్కాలిక గోడౌన్లను ఏర్పాటుచేసి మరీ లబ్ధిదారులకు పంపిణీ చేస్తోంది. వీటన్నింటి కోసం ఒక్కో ఇంటికి రూ.40వేల వరకు అదనపు సాయంతో పాటు, మహిళలకు పావలా వడ్డీకే రూ.35వేల రుణాన్ని అందించి, మిగిలిగిన వడ్డీని ప్రభుత్వమే భరిస్తూ ఇంటి నిర్మాణానికి చేదోడుగా నిలుస్తోంది.

అలాగే, 20 టన్నుల చొప్పున ఉచితంగా ఇసుకును సమకూరుస్తోంది. దీనివిలువ రూ.15వేల వరకు ఉంటుంది. మధ్యవర్తులకు ప్రమేయం లేకుండా డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బును జమచేస్తూ పారదర్శకతను పాటిస్తోంది. ఇలా.. మొత్తం మీద యూనిట్‌కు రూ.1.80 లక్షలు కట్టుకోడానికి.. పావలా వడ్డీ కింద రూ.35వేలు.. మార్కెట్‌ ధరల కన్నా నిర్మాణ సామగ్రిని తక్కువకు సరఫరా చేయడం ద్వారా మరో రూ.55వేలు చొప్పున వెరసి ప్రతీ లబ్ధిదారునికి రూ.2.70లక్షల చొప్పున ప్రభుత్వం లబ్ధిచేకూరుస్తోంది.

నిన్నటి వరకు అలా.. నేడు ఇలా..
రామోజీరావు ‘అసత్యాల బకాసురుడు’. ఈనాడులో ఎన్ని అసత్యాలు రాస్తే ఆయన కడుపు అంతగా నిండుతుంది. నిన్నమొన్నటి వరకు అసలు ఇళ్ల స్థలాలు ఎక్కడున్నాయో లబ్ధిదారులకు తెలియడం లేదన్నారు. ఇళ్ల నిర్మాణం ముందుకు సాగట్లేదన్నా రు.కాలనీ లన్నీమునిగిపోతున్నాయన్నారు. అసలు ఇళ్లు కడతారా? అని చెవికోసిన మేకలా అరిచారు. ఇప్పుడేమో కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేవంటూ పెడబొబ్బలు పెడుతున్నారు. అంటే.. ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు కట్టిందని, తద్వారా కాలనీలు ఏర్పడ్డాయని, అందులో లబ్ధిదారులు ఉంటున్నారని ఈనాడు ద్వారా పరోక్షంగా అంగీకరించారు.

ఈనెల 12న నిర్మాణాలు పూర్తి­చేసుకున్న 7,43,396 ఇళ్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒకేసారి ప్రారంభించారు. రాష్ట్ర చరిత్రలో ఇదొక సువర్ణాధ్యా­యం. మరో 14,42,425 ఇళ్ల పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. తొందర్లోనే వీటిని కూడా ప్రారంభిస్తారు. ఇన్ని లక్షల సంఖ్యలో ఇళ్ల నిర్మా­ణాన్ని సహించలేని టీడీపీ, దుష్టచతుష్టయం కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేవంటూ రోత రాతలు ప్రారంభించాయి.

వాస్తవానికి జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అంటే.. తాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు, విద్యుదీకరణ, ఇంటర్నెట్, ఆర్చెస్, సోక్‌పిట్స్‌ ఏర్పాట కోసం రూ.35,859 కోట్లతో కార్యాచరణను రూపొందించింది. ఇందులో శాశ్వత మౌలిక సదుపాయాల కోసం రూ.32,909 కోట్లు ఖర్చుచేస్తోంది. లేఔట్లలో ముందుగా కనీస అవసరాల కింద.. కరెంటు, తాగునీరు, సోక్‌పిట్స్, రోడ్ల కోసం కనీసంగా రూ.4,800 కోట్లు ఖర్చుచేసింది. 

పేదలకు రూ.1.5 లక్షల కోట్ల ఆస్తి..
రాష్ట్రంలో సొంతిళ్లు లేని కుటుంబం ఉండకూడదన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం. అందుకే దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఒకేసారి 31లక్షల ఇళ్ల పట్టాలను పేదలకు ఇచ్చారు. మహిళా సాధికారతలో భాగంగా వారికి ఆర్థిక భరోసా ఉండాలనే ధ్యేయంతో అక్కచెల్లెమ్మల పేరుతోనే వాటిని ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వడం మరో విశేషం. అంతేకాదు.. వీటిల్లో సుమారు 22 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నారు.

తద్వారా 17వేలకు పైగా కొత్త కాలనీలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పుడు ఒక్కో ఇంటి పట్టా విలువ రూ.2.5 లక్షల మొదలు రూ.12లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉండటం గమనార్హం. ఈ లెక్కన చూస్తే పేదలకు జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆస్తి అక్షరాల రూ.1.5 లక్షల కోట్లు. రాష్ట్రంలో ఇదంతా జరుగుతుందని 14ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు, ఆయన రాజగురువు రామోజీ కలలో కూడా ఊహించి ఉండరు.

ఎందుకంటే వాళ్లకు పేద­లంటే గిట్టదు. ఇన్నేళ్లలో తన పార్ట్‌నర్‌ చంద్రబాబు పేదలకు ఒక్క సెంటు భూమి ఇవ్వకపోయినా ఈనాడులో ఏనాడు ప్రశ్నించలేదు. బడుగు జీవులు ఇళ్ల స్థలాల కోసం ధర్నాలు, ఆందోళనలు చేసినా ఈనాడులో ఒక్క అక్షరం ముక్క కూడా రాయలేదు. అలాంటిది తమ కళ్లెదుటే పేదోడు సంతోషంగా ఉండటం, వారి జీవన ప్రమాణాలు పెరగడం చూసి ఆయన వెర్రెక్కిపోతున్నారు.  

Advertisement

What’s your opinion

Advertisement