ఆహా ఏమి రుచి..!

27 Nov, 2022 23:16 IST|Sakshi
రాయచోటి నేతాజి సర్కిల్‌ సమీపంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భోజనం చేస్తున్న విద్యార్థులు  

సాక్షి, రాయచోటి: ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి..అని ఓ సినిమా కవి పాటలో రాసినట్లు అంతటి రుచికరమైన ఆహారం ప్రస్తుతం విద్యార్థులకు అందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో చదివే వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఒక వైపు విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూనే మరోవైపు రుచికరమైన ఆహారం అందించేలా ప్రణాళిక రూపొందించింది.

సర్కార్‌ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు రాష్ట్రప్రభుత్వం జగనన్న గోరు ముద్ద పథకం ద్వారా రుచికరమైన భోజనం అందిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధగా ఈ పథకంలో విద్యార్థులకు రోజుకో వంటకంతో సరికొత్త మెనూ అమలు చేస్తోంది. ఈనెల 21 నుంచి నూతన మెనూను పాఠశాలల్లో అమలు చేస్తున్నారు.   

కడుపునిండా అన్నం: గత టీడీపీ పాలనలో మధ్యాహ్న భోజనం సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఇళ్ల నుంచి తెచ్చుకుని తినాల్సిన దుస్థితి ఉండేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెల్లడిస్తున్నారు. జగనన్న గోరు ముద్ద పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇంటి నుంచి విద్యార్థులు అన్నం తెచ్చుకోవడం తగ్గిందని చెబుతున్నారు. జిల్లాలో 2190 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. అందులో 1,44,467 మంది విద్యార్థులకు కొత్త మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారు. 

ఆహారానికి అదనపు నిధులు  
జిల్లా వ్యాప్తంగా గతంలో ప్రాథమిక పాఠశాలలో ఒక్కో విద్యార్థికి రూ.5.40లను ప్రభుత్వం అందజేసేది. కొత్త ఉత్తర్వుల ప్రకారం ఒక్కో విద్యార్థికి రూ.5.88ల చొప్పున ఇవ్వనున్నారు. అలాగే ఉన్నత పాఠశాల  విద్యార్థికి గతంలో రూ.7.85లు ఉండగా.. ప్రస్తుతం రూ.8.57లు ఇవ్వనున్నారు. వంట ఖర్చుల నిధులు రెట్టింపు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు అక్టోబర్‌ 1 నుంచి అమలులోకి వచ్చినట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు. ఈ జగనన్న గోరు ముద్ద పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 2022–23 సంవత్సరానికి గానూ రూ.20 కోట్ల మేర ఖర్చు చేసింది.  

అధికారులతో ప్రత్యేక పర్యవేక్షణ: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మధ్యాహ్న భోజన పథకంపై పర్యవేక్షణ ఉండేది కాదు.పైగా నిధులు కూడా వంట ఏజెన్సీలకు సక్రమంగా ఇవ్వక పోవడంతో ఆహారం విషయంలో నాణ్యత గాలిలో దీపంలా ఉండేది. వైఎస్సార్‌సీపీ పాలనలో జగనన్న గోరు ముద్ద పథకాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఈ పథకం అమలును నాలుగు అంచెల్లో పర్యవేక్షిస్తున్నారు.

కలెక్టర్, ప్రతి వారం ఒక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. పాఠశాల స్థాయిలో హెడ్మాస్టర్, గ్రామ, వార్డు సచివాలయాలు, గ్రామ సేవా సంఘాలు (సెర్చ్, మెప్మా), ఎంఈఓలు ఇలా వివిధ స్థాయిల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జగనన్న గోరు ముద్ద ఒకే నాణ్యతతో అందించేలా ప్రత్యేక స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ను అమలు చేస్తున్నారు. ఎక్కడైనా సమస్యలు ఏర్పడితే 14417 అనే టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేసేలా పారదర్శకతను పాటిస్తున్నారు.  

పక్కాగా అమలు చేయాల్సిందే..  
జిల్లా వ్యాప్తంగా జగనన్న గోరు ముద్ద పథకంలో నూతన మెనూను పక్కాగా అమలు చేయాలని ఆదేశించాం. సర్కార్‌ బడులలో చదివే విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనం నాణ్యతగా, రుచిగా అందించాల్సిందే. పౌష్టికాహారం లోపం తలెత్తకుండా మెనూను ప్రభుత్వం రూపొందించింది. మెనూను తప్పనిసరిగా ప్రతి పాఠశాలలో అమలు చేయాలి. 
– గిరీషా పీఎస్‌(జిల్లా కలెక్టర్‌), అన్నమయ్య జిల్లా  

కొత్త మెనూ ప్రకారం జగనన్న గోరుముద్ద  
పాఠశాలల్లో నూతన మెనూను అమలు చేయాలని ఆదేశించాం. సోమవారం అన్ని పాఠశాలల్లో నూతన మెనూ అమలులోకి వచ్చింది. కొత్త మెనూ ప్రకారం గత సోమవారం విద్యార్థులకు వేడి పొంగలి, ఉడికించిన కోడి గుడ్డు, కూరగాయల పలావ్, గుడ్డు కూర, చిక్కీని అందజేశారు. ప్రతి రోజు మధ్యాహ్న భోజనం అమలు తీరును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాం.  
–రాఘవరెడ్డి (డీఈఓ), అన్నమయ్య జిల్లా   

బలవర్థకమైన ఆహారం    
మా పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఎంతో బలవర్థకంగా ఉంది. ఎదిగే పిల్లలకు మంచి పోషక విలువలను అందిస్తోంది. ఆరోగ్యపరంగా ప్రతి విద్యార్థికి సమతుల్య ఆహారం జగనన్న గోరుముద్ద ద్వారా మాకు లభించడం ఆనందంగా ఉంది.     
–గాయత్రి, పదో తరగతి, జెడ్పీహెచ్‌ఎస్, సంబేపల్లె  

ఇంటి భోజనం కంటే మిన్నగా.. 
ఎన్నో పోషక విలువలతో మా బడిలో పెట్టే మధ్యాహ్న భోజనం ఇంటి భోజనం కంటే మిన్నగా ఉంది. శరీరానికి ఎక్కువగా అవసరమయ్యే మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు సమపాళ్లలో అందుతున్నాయి. జగనన్న గోరుముద్దతో చక్కటి ఆరోగ్యం కూడా సమకూరుతోంది.     
– పి.అంజలి, 9వ తరగతి, జడ్పీహెచ్‌ఎస్, సంబేపల్లె 

మరిన్ని వార్తలు